YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆండాళ్ తల్లి ఆవిర్భావానికి నోచుకున్న దివ్య దేశం

ఆండాళ్ తల్లి ఆవిర్భావానికి నోచుకున్న దివ్య దేశం

*శ్రీ విల్లిపుత్తురు*
అనన్యసామాన్యమైన భక్తితో సాక్షాత్తూ శ్రీరంగనాథుని మెప్పించి, ఆయననే పతిగా పొందింది గోదాదేవి. పన్నిద్దరాళ్వారులలో తండ్రితో సమానంగా తాను కూడా ఒక ఆళ్వార్‌గా గణుతికెక్కిన గోదాదేవి కొలువుతీరిన పుణ్యక్షేత్రమే శ్రీవిల్లిపుత్తూరు. తమిళనాడులోని రాష్ట్రం విరుద్ నగర్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం, పురపాలక సంఘం. మదురైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్యక్షేత్రం. ఆండాళ్, కోదై అనే పేర్లతో ప్రసిద్ధమైన ఆ తల్లి ఆవిర్భవించింది ఇక్కడే.
వేటగాడైన విల్లి పేరు మీద విల్లిపుత్తూరు అని, ఆండాళ్ అవతరించిన పుణ్యస్థలి, పెరియాళ్వార్ నివసించిన ప్రదేశం కాబట్టి శుభప్రదమైన శ్రీవిల్లిపుత్తూరు అని ప్రసిద్ధి పొందింది. శ్రీవిల్లిపుత్తూరు పట్టణ చిహ్నం 12 అంతస్తుల ఆలయ గోపురం. సుప్రసిద్ధమైన శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి దివ్యాలయ ప్రాంగణం నిత్యం గోదా, వటపత్రశాయి నామస్మరణలతో మారుమోగుతుంటుంది. సుమారు 192 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యాలయం ఆధ్యాత్మికంగా మేరు పర్వతానికి సమానమైనదిగా భావించబడుతుంది. ఈ అతి ప్రశస్త దివ్యక్షేత్రం 108 దివ్య దేశాలలో ఆండాళ్ జన్మించిన పుణ్యస్థలం. ఈమె అనితరసాధ్యమైన భక్తితో విష్ణువుని కొలిచి అతనినే భర్తగా పొందిన భక్త శిఖామణి. ఈమె తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి పాశురాలను రచించింది.
ఈ ఆలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో వల్లభ దేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరకాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్, చొక్కప్ప నాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు. కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులుచేర్పులు జరిగినప్పటికీ, పురాతనత్వాన్ని ఏమాత్రం కోల్పోని ఆలయమిది. గోదాదేవి దొరికిన తులసీవనం ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు. మరి శ్రీవిల్లిపుత్తూరు పురాణగాథ ఏంటో తెలుసుకుందాం..
పూర్వం విష్ణుచిత్తుడనే పండితుడు శ్రీహరి భక్తుడు. అతడు రోజూ శ్రీహరినే సేవిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒక సారి విష్ణుచిత్తుడు తులసీవనంలో ఉండగా, ఓ ఆడశిశువు దొరికింది. అది శ్రీమన్నారాయణుడి కటాక్షంగా ఆ శిశువును చేరదీసి గోదాదేవి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచాడు. ఆ శిశువు పెరిగి పెద్దదవుతూ శ్రీరంగనాధుడ్ని అమితంగా సేవించేది. శ్రీరంగనాధుడే తన ప్రత్యక్షదైవమని, ఎప్పటికైనా ఆ స్వామిని చేరాలని ఆకాంక్షించేది. రోజూ పుష్పహారాలను చేసి ముందుగా తన మెడలో ధరించి, ఆ తర్వాత స్వామివారి కైంకర్యానికి పంపించేది. తను ధరించిన మాల స్వామికి సమర్పించిన తల్లి కనుక అమ్మ శుడికుడుత్త నా చ్చియార్ గా పిలువబడుతుంది.ధనుర్మాసంలో తిరుప్పావవై వ్రతాన్ని ఆచరించి భక్తిని మాలగా అల్లి సువాసన భరతి పుష్పాలతో ఆ భగవానుడ్ని సేవించి ముక్తి పొందవచ్చని తలచి తిరుప్పావై ప్రబంధాన్ని రచించి ఆండాళ్ గా ప్రసిద్ది చెందింది. ఇందులో 30పాశురాలున్నాయి. ఆ పాశురాలను భక్తితో గానామ్రుతం చేసి, తన భక్తి ప్రవత్తులను చాటుకుని, స్వామిని వివాహమాడి చివరికి శ్రీరంగనాథునిలోనే ఐక్యమైంది. గోదాదేవి ఆవిర్భవించిన స్థలంగా చెప్పబడుతున్న ఈ ప్రాంగణంలో నిర్మించిన దివ్యాలయమే శ్రీ విల్లి పుత్తూరు శ్రీ గోదాదేవి ఆలయం.
మహిమాన్వితమైన ఈ దివ్యాలయ ప్రాంగణంలో గోదాదేవి దొరికిన తులసీవనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు.
సువిశాలమైన ఈ ప్రాంగణం లోపలి ప్రాకారంలో లక్ష్మీనారాయణ పెరుమాళ్, ఆండాళ్ పూజామంటపం ఉన్నాయి. ప్రధానాలయ లోపలి ప్రాకారం కేరళ సంప్రదాయ రీతిలో ఉంటుంది. అమ్మవారి ఆలయానికి ముందు మహినగ్, సుముఖన్, సేనై ఇముదల్వర్‌ల చిన్ని చిన్న మందిరాలున్నాయి. గర్భాలయం వెలుపల తులసీవనంలో ఉన్న బావిలోనే అమ్మవారు తన ముఖారవిందాన్ని చూసుకునేదంటారు.
అత్యంత నయన శోభితంగా ఉన్న ఈ ప్రాంగణం చూపరులను అమితంగా ఆకర్షిస్తుంది. గర్భాలయంలో రంగమన్నార్ దర్శనమిస్తారు. స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తరభాగంలో గరుడాళ్వార్ కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో మరో ఆలయంలో శ్రీకృష్ణపరమాత్మ వటపత్రశాయిగా దర్శనమిస్తారు. అద్భుత శిల్పకళా విన్యాసంతో అలరారుతున్న ఈ ఆలయ రాజగోపురం అల్లంత దూరం నుంచి దృశ్యమానమవుతుంది. ఈ గోపురంపై ఉన్న దేవతల శిల్పాలు అత్యద్భుతంగా ఉండి, భక్తులను ఆకర్షిస్తాయి. ఈ ఆలయం మదిని పులకింపజేసే మనోహర శిల్పాలకు వేదిక.
ఆలయ బయటి ప్రాకారంలో గజలక్ష్మి, ఆంజనేయస్వామి మందిరాలున్నాయి. ప్రాకారపు గోడలపై అఘోర వీరభద్ర, సరస్వతి, శ్రీరాముడు, లక్ష్మణుడు, వేణుగోపాలస్వామి, విశ్వకర్మ, రంభ, ఊర్వశి, జలంధర్, మోహినీ అవతారం, రతీమన్మథులు, తదితర శిల్పాలు నాటి అద్వితీయ శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలిచి, చూపరుల దృష్టిని ఆకట్టుకుంటాయి.
వటపత్రశాయి ఆలయంలో నల్లరాతి శిల్పంపై శేషశయనుడైన స్వామి దర్శనమిస్తాడు. భక్తిభావాన్ని పెంచే స్వామిని దర్శించుకుని భక్తులు కైమోడ్పులర్పిస్తారు. అమ్మవారి ఆలయానికి ముందుభాగంలో ఉన్న శిల్ప సహిత స్తంభాలతో కూడిన మండపంలో భక్తులు సేదదీరుతారు. అమ్మవారి గర్భాలయం బయట ప్రాకారంలో తిరుప్పావై పాశురాలకు చెందిన మనోహరమైన చిత్రాలున్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం కలుగుతుందంటారు.
శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి అమ్మవారిని దర్శించుకునే కన్యలకు వివాహయోగం తప్పక కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడ అమ్మవారిని, స్వామివార్లను తులసి దళాలతో పుష్పహారాలతోనూ సేవిస్తే ఐశ్వర్యవ్రుద్ది కలిగి, కోర్కెలు సిద్ధిస్తాయంటారు. అలాగే వివాహం కాని కన్యలు ఇక్కడ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే వెంటనే వివాహం జరిగి, సౌభాగ్యసిద్ధి కలుగుతుందంటారు. మహిమాన్విత ఈ దివ్వాలయంలో ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు.
అత్యంత ఘనంగా నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రశాంతమైన వాతవరణంలో ప్రక్రుతి అందాల నడుమ అలరారుతున్న శ్రీవిల్లి పుత్తూరులో యాత్రికులకు బసచేయడానికి అనేక హోటళ్ళున్నాయి. భోజనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మహిమాన్విత ఈ క్షేత్రంలో ఒక రోజు నిద్ర చేస్తే పుణ్యఫలాలు సిద్ధిస్తాయంటారు.
ఇక్కడి ఉత్సవాలలో ప్రముఖమైనవి ఆండాళ్ జన్మనక్షత్రాన జరిగే రథోత్సవం, శ్రీ ఆండాళ్ కళ్యాణోత్సవం. ఈ దివ్యాలయంలో ధనుర్మాసం చివరి రోజున అత్యంత వైభవంగా నిర్వహించే గోదా కల్యాణ మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ఇంతటి మహిమాన్విత పుణ్యక్షేత్ర సందర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు.
మదురై నుండి 74 కిమి దూరంలో ఈ దివ్య దేశం కలదు. దేశంలో నలు మూలల నుండి రైలు మార్గం ఉంటుంది. మదురై నుండి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది.
అంతటి పరమ పవిత్రమైన దివ్య దేశం శ్రీ విల్లిపుత్తురు. శ్రీ ఆండాళ్ నా చ్చియార్ సమేత శ్రీ వటపత్రశాయి దివ్య తిరువడిగలే శరణం
*ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం*

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

 

Related Posts