YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*సర్వం కృష్ణమయం.....*

*సర్వం కృష్ణమయం.....*

ఒకనాడు శ్రీకృష్ణుడు బృందావనంలో గోపబాలురతో కలసి గోవులను మేపటానికి వెళ్ళి, కొంతసేపు ఆటలాడుకొని చల్దులు ఆరగిస్తున్నారు. అందరూ వలయాకారంలో కూర్చొని ఒకరి చేతిలో ముద్దను మరొకరు లాక్కుంటూ, ఒకరి చేతిలోని నంజుడును మరొకరు నోటితో అందుకుంటూ, ఎంగిలి మంగలం అనే తేడా లేకుండా తింటున్నారు. గోపబాలుర చేతిలోని చల్దులను ఒడిసి లాక్కొని తింటున్నాడు కన్నయ్య. కన్నయ్య చేతిలోనిది లాక్కొని తింటున్నారు స్నేహితులు. భగవంతుని ఎంగిలి భక్తునికి ప్రసాదమైతే భక్తుని ఎంగిలి భగవంతునికి ప్రసాదం. అదొక లీల.
ఇదంతా చూస్తున్న బ్రహ్మదేవునికి ఈ ఎంగిలి తినే శ్రీకృష్ణుడు భగవంతుడేనా? అని సందేహం వచ్చింది.
ఎంతవారైనా మాయకు లొంగేవారే. అందుకే ఎంగిలి ముద్దల కోసం దేబిరించుకుంటూ వాటిని అందుకొనుటకు ఎగబడుతూ, స్నేహితులతో వాటికోసం పోట్లాడుతూ ముద్ద దొరికితే పరమానందం చెందే ఈ అర్భకుడు భగవంతుడా? అనే సందేహం వచ్చింది.
సందేహం రాగానే పరీక్షించాలనుకున్నాడు.
వెంటనే ఆవులను, లేగదూడలను మాయం చేశాడు. అవి కనిపించక పోయే సరికి గోపబాలురు భయంతో తినే తినే ముద్దలను వదిలి లేవబోతున్నారు.
"నేను వెళ్ళి గోవులను వెతికి వస్తాను" అని కన్నయ్య వారికి నచ్చజెప్పి బయలుదేరాడు.
గోవులు ఎక్కడా కనిపించలేదు. గోవులు కనిపించలేదని గోవిందుడు తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఉన్న గోపబాలురందరిని మాయం చేశాడు బ్రహ్మదేవుడు.
బ్రహ్మదేవుని పితలాటకం తెలుసుకున్నాడు కన్నయ్య.
కేవలం సంకల్పమాత్రంతో గోవులూ తానే అయ్యాడు, లేగదూడలూ తానే అయ్యాడు, గోవులను తోలే గోపబాలకులూ తానే అయ్యాడు.
సర్వం కృష్ణమయం - భగవన్మయం. అదొక కమనీయదృశ్యం. ఎవరు తెలుసుకోగలరు ఈ వైష్ణవ మాయను?
ఒక సంవత్సరం గడిచిపోయింది. బ్రహ్మగారికి అనుమానం వచ్చి బృందావనం కేసి చూసాడు. తను మాయం చేసిన గోపాలబాలురు అక్కడే ఉన్నారు, గోవులు, దూడలూ అక్కడే ఉన్నాయి.
ఏమీ అర్ధం కావట్లేదు. “అరే! నేను దాచిపెట్టిన గోపాలబాలురు, గోవులు, దూడలూ అన్నీ నేను దాచిన చోటే ఉన్నాయి. మరి ఇవెక్కడవీ? అని అంతర్ముఖుడై చూసాడు...
అన్నీ గోవులయందు, దూడలయందు, గోపాలబాలుర యందు కృష్ణుడే కనిపించాడు. కొన్ని కోట్ల రూపాలుగా కృష్ణుడే మారిపోయాడని గమనించాడు.
“ఓహో ఎవరి మాయని బ్రహ్మ, శివాది పన్నెండుమంది మహాజ్ణానులు సైతం దాటలేరో, ఎవరి మాయ, 33 కోట్లమంది దేవతలను, సిద్ధులను, యోగులను, ఋషులను సైతం మోహపరవశంలో ముంచెత్తుతుందో అటువంటి విష్ణుమాయ ఇది అని తెలుసుకున్నాడు.
బ్రహ్మదేవునికి శృంగభంగమైంది. బాలకృష్ణుని పాదాలపై బడి క్షమించమన్నాడు. ఇలా సంవత్సరం పాటు అన్ని రూపాలలో కన్నయ్యే ఉన్నాడు. అయినా ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు.
అలాగే ఇక్కడ ఉన్న సమస్త ప్రాణులూ పరమాత్మ స్వరూపులే, అయినా బాహ్యదృష్టి గలవారు తెలుసుకోలేరు.
ఇలా ఈ జగత్తు అంతా కృష్ణపరమాత్మే అయినా ఆయనను తెలుసుకోలేక పోతున్నాం.
*జై శ్రీమన్నారాయణ*

Related Posts