YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శ్రావణమాసం-లక్ష్మీ కటాక్షం

శ్రావణమాసం-లక్ష్మీ కటాక్షం

ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చిందే కాలం శ్రావణమాసం. ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చు. పూర్తిగా సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు- శ్రావణ మంగళవారాల నోములు, దివ్యమైన శుభకరమైన పండుగలతో, పర్వదినాలలో అలరారుతూ భక్తుల పాలిట సౌభాగ్యదాయినిగా నిలిచిన మాసం శ్రావణం.
చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో అయిదవ దివ్యమైన మాసం శ్రావణం. వర్షఋతువు ప్రారంభమయ్యేమాసం. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్ర సమీపంలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణమాసమనే పేరొచ్చింది. ‘శ్రవణం’ విష్ణుమూర్తి జన్మనక్షత్రం. శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడంవల్ల విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణమాసం.
శ్రావణమాసంలో మంగళవారాలు శ్రీ గౌరీదేవి పూజకు, శుక్రవారాలు శ్రీ లక్ష్మీదేవి పూజకు, శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైనవి. శ్రావణమాసంలో సోమవారంనాడు పరమశివుడిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది. సోమవారంనాడు శివాలయంలోగానీ, ఇంటిలోగానీ అభిషేకం చేయడంతోపాటు బిళ్వదళములతో అర్చన చేయవచ్చు. భగవాన్ శ్రీకృష్ణుని జననం శ్రావణమాసంలోనే జరిగింది. హయగ్రీవుడు, అరవిందయోగి వంటి పుణ్యపురుషులు జన్మించింది ఈనెలలోనే. వర్షఋతువు, ఓషధులు, పంటలు, ధనధాన్యాలకు శుభకరమైనది ఈ మాసం. ఈ కాలంలో దాడిచేసే రోగాలను దూరంగా పెట్టడానికి ఆహార నియమాలు పాటిస్తూ ఉపవాసాలకూ ప్రాధాన్యత ఇస్తారు.
అంతేగాక దక్షిణాయనంలో దేవతల అనుహ్రం భూమిపై ప్రసరిస్తూ ఉంటుంది. ఈమాసంలో మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాలతోపాటు అందరిమదిలో మెదిలేది శ్రావణపూర్ణిమ. శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మరియు శ్రీకృష్ణాష్టమి. శ్రీకృష్ణుడు భువిపై అవతరించిన పుణ్యదినమే శ్రావణ బహుళ అష్టమి.
శ్రావణంలో గృహ నిర్మాణాన్ని ఆరంభించడంవల్ల సకల శుభాలు కలుగుతాయని మత్స్యపురాణం చెబుతున్నది. శ్రావణ శుద్ధ చవితిని నాగుల చవితి అని, పంచమిని నాగపంచమి అంటారు. నాగచతుర్థినాడు ఉపవాసం ఉండి పుట్టలో పాలుపోసి నాగదేవతను పూజించాలి. నాగపంచమినే గరుడ పంచమని కూడా అంటారు. నాగులకు పాలు, పాయసం, నువ్వుల పిండి, చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల సర్పదోషం తొలగుతుంది.
కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు తమ అయిదోతనం కలకాలం నిలవాలంటే ఈమాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారు. పెళ్లయిన సంవత్సరంనుంచి వరుసగా అయిదు సంవత్సరాలపాటు నోము నోచి చివరి సంవత్సరం ఉద్యాపన చేస్తారు. శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము స్ర్తిలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కల్గి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం. ఈ వ్రతాన్ని గురించి పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు.
శ్రావణ పూర్ణిమను భారతావని మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు గల విశిష్టత ఇంతింతని చెప్పనలవికాదు. ఈ రోజున చేసే హయగ్రీవ ఆరాధన ఉన్నత విద్యను ప్రసాదిస్తుంది. చదువుల తల్లి సరస్వతికి గురువు హయగ్రీవుడని దేవీభాగవతం చెబుతోంది. శ్రావణపూర్ణిమనే ‘రాఖీపూర్ణిమ’.శ్రావణ బహుళ విదియ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన తిథిగా చెప్పబడింది. ఈ తిథి రోజు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రులు సశరీరంగా సజీవంగా బృందావన ప్రవేశాన్ని పొందారు. లోకానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమే బహుళ అష్టమి. బహుళ ఏకాదశి కామ్య ఏకాదశి, శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటారు.
ఈ విధంగా ప్రతిరోజూ విశేషదాయకమైన శ్రావణమాసాన్ని మనం పాటిద్దాం- మోక్షాన్ని పొందుదాం.

Related Posts