అమరావతి జూలై 24
రాయలసీమ అంటే కరువు ప్రాంతం.. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఒకప్పుడు ఉండేది.. తలాపునే కృష్ణా నది.. కానీ తాగేందుకు నీరు లేని రాయలసీమ దుస్థితి.. ఆంధ్రప్రదేశ్ లో నదీజలాల వాటాలో అత్యంత అన్యాయం జరిగింది ఎవరికైనా అంటే అది ఖచ్చితంగా రాయలసీమకే. ఎందుకంటే రాయలసీమలోని కర్నూలు జిల్లా మీదుగానే కృష్ణా నది పోతుంది. వానాకాలంలో భారీ వరదలు వచ్చి వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంది. కానీ ఆ వరద జలాలను కూడా సద్వినియోగించుకోలేని దుస్థితి సీమ వాసులదీ. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తెలంగాణ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా మారాయి. గత ఐదేళ్లలో తెలంగాణ సాగునీటిరంగంలో ఎంతో అభివృద్ధి సాధించింది. అదే సమయంలో ఏపీలో పోలవరం కూడా పూర్తికాకుండా పడకేసింది. ఏపీ అభివృద్ధి కేవలం గ్రాఫిక్స్ లకు మాత్రం పరిమితమైందన్న ఆవేదన ఉంది. 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి ఏపీ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను జగన్ సర్కార్ పెద్దపీఠ వేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ మరణంతో ఆగిపోయిన రాయలసీమ అభివృద్ధిని జగన్ భుజాన వేసుకున్నారు. సీమ ప్రజలు నీటి కోసం నింగివైపు చూసే రోజులుపోయేలా ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపడుతున్నారు. సీమను సస్యశ్యామలం చేసేలా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలలో ఒకటైన కాళేశ్వరంకు ధీటుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం(ఆర్.ఎల్.సీ)ను ఏర్పాటు చేయబోతున్నారు. సీమ కరువు తీరేలా శ్రీశైలం జలాలను మళ్లించనున్నారు. రోజుకు 3 టీఎంసీల వరకు కృష్ణా నదీ వరద జలాలను మళ్లించే ఈ అద్భుత పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అంతరాష్ట్ర వివాదాలను అధిగమిస్తూ సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలిచే దశకు చకచకా చేరుకుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న రాయలసీమ పథకం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యంతో నిర్మిస్తుండటం విశేషం. రోజుకు మూడు టీఎంసీల నీటిని పంపింగ్ చేసేలా తీర్చిదిద్దారు. ఇంతవరకు రాష్ట్రంలో ఇంత పెద్ద పంపింగ్ ప్రాజెక్ట్ నిర్మించనే లేదు. ఏపీలో అతిపెద్దదిగా భావించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం మొత్తం ఏడాది పంపింగ్ సామర్థ్యం 40టీఎంసీలు మాత్రమే. అలాగే పట్టిసీమ ముచ్చుమర్రి కొండవీటి వాగు పురుషోత్తపట్నం లాంటి ఎత్తిపోతల పథకాలు గతంలోనే పూర్తయ్యాయి. వీటితో ఏమాత్రం పోలికలేని విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా సంగమేశ్వర వద్ద నిర్మిస్తున్నారు.2019-20 సంవత్సరంలో శ్రీశైలంకు ఆరు విడతల్లో(స్పెల్స్) వరదలు వచ్చాయి. 889 టిఎంసిల నీటిని స్పిల్ వే నుంచి కిందకు విడుదల చేశారు. అందులో 600 టిఎంసిల నీరు నిరుపయోగంగా సముద్రం పాలు అయ్యింది. అదే సమయంలో రాయలసీమలోని 4 జిల్లాలకు అవసరమైన నీరు అందలేదు. 120టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఈ నాలుగు జిల్లాలోనూ ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. వరద నీరు సైతం సీమ జిల్లాలకు అందుబాటులోకి రావడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్.ఎల్.సీ-రాయలసీమ లిప్ట్ స్కీమ్) ద్వారా రోజు మూడు టీఎంసీల(34722 క్యూసెక్కులు) నీటిని వరదల సమయంలో కృష్ణానది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి కృష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపడతారు. ఇక్కడ మూడు టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు. జలాశయంలో 800 నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లా అవసరాలకు మళ్లించే విధంగా నీటిని పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణానదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8 టిఎంసీల వరకు కూడా పంప్ చేసేందుకు ఉపయోగపడే విధంగా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది జగన్ ప్రభుత్వ ఉద్దేశం.ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తో పాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5 కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12 మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యుమెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసే విధంగా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు మోటార్లు ఏర్పాటు అవుతాయి. మొత్తం 397మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరమవుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముఖ్యంగా కొత్తకాలువ తవ్వడానికి 12వేల ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు.ఆర్.ఎల్.సీ పూర్తయితే ఇక రాయలసీమ వాసులు నీళ్లకోసం నింగివైపు చూపే రోజులు పోవడం ఖాయం. తన హయాంలోనే ఈ నిర్మాణం పూర్తిచేసి రాయలసీమ వాసులకు చిరకాలం గుర్తుండే కానుకను సీఎం జగన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.