హైదరాబాద్ జూలై 24
చైనా, పాకిస్థాన్ దేశాలు జీవాయుధాల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. దీని కోసం మూడేళ్ల క్రితం ఆ రెండు దేశాల రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్‌తో పాటు ప్రత్యర్థి పశ్చిమ దేశాలపై ఆ ఆయుధాలను ప్రయోగించాలన్న ఉద్దేశంతో చైనా,పాక్ దేశాలు జీవాయుధాలను డెవలప్ చేస్తున్న క్లాక్సన్ నివేదిక వెల్లడించింది. ప్రాణాంతకమైన యాంత్రాక్స్ ఏజెంట్‌పై కూడా పలు ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆ రెండు దేశాలపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి వచ్చినట్లు చైనాపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఆంధోనీ క్లాన్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌కు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్(డిఈఎస్‌టీవో).. అంటువ్యాధులు, వాటి జీవ నియంత్‌్ణపై వుహాన్ ల్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. రహస్యంగా కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం.. బయోలాజికల్ ఏజెంట్లను చైనా బయటి దేశాల్లో పరీక్షలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. కరోనా వైరస్ నియంత్రణలోనూ చైనాపై ఆరోపణలు ఉన్నాయి. ఆ దేశం ఆలస్యం చేయడం వల్లే ఆ వైరస్ మహమ్మారిగా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాకిస్థాన్ అభివృద్ధి చేయాలనుకున్న జీవాయుధాలకు.. వుహాన్ ల్యాబ్ సహకరించినట్లు క్లాక్సన్ నివేదికలో వెల్లడించారు. యాంత్రాక్స్‌పై పాక్ రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. బయో వార్ ఏజెంట్‌ను అభివృద్ధి చేసిన పాకిస్థాన్.. బ్యాక్టీరియా ద్వారా ఆ ఆయుధాన్ని వాడాలని చూస్తున్నది. బాసిల్లస్ తురింజినెసిస్ పరీక్షలకు కావాల్సిన రసాయనాలను వుహాన్ ల్యాబ్ అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్యాథోజెన్ల క్రియేషన్, బయో ఇన్‌ఫర్మేషన్ కోసం పాక్ శాస్త్రవేత్తలకు చైనా శిక్షణ కూడా ఇస్తున్నది. పాక్ స్వంతంగా వైరస్ డేటాబేస్ అభివృద్ధి చేసుకునే విధంగా ఈ శిక్షణ సాగుతున్నది.
వైరస్ జన్యువులను గుర్తించడం, ప్రమాదకర సూక్ష్మజీవాలను పరీక్షించడం, అంటువ్యాధుల పరిశోధన కోసం జీనోమిక్ టూల్స్‌ను వాడే విధంగా పాకిస్థాన్ తన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నది. ఈ సీక్రెట్ ప్రాజెక్టుపై ప్రభుత్వ ఆరోగ్య శాఖ నిఘా ఉండకుండా చేశారు. ఇండియాపై పాకిస్థాన్‌ను ఉసిగొల్పేందుకు చైనా ఆ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. విదేశీ నేలపై ఆ ప్రమాదకర వైరస్ పరీక్షలు చేసే విధంగా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. విషపూరితమైన జీవరసాయనిక పరిశోధనకు పాకిస్థాన్‌ను చైనా ఓ కేంద్రంగా వాడుకున్నట్లు కూడా నివేదిక చెబుతున్నది.
ఇప్పటికే చైనా, పాక్ దేశాలు తమ ఒప్పందం ప్రకారం.. క్రిమియన్ కాంగో హెమరోజిక్ ఫీవర్ వైరస్(సీసీహెచ్ఎప్‌వీ)పై పరీక్షలు మొదలుపెట్టాయి. ఎబోలా లాంటి ఈ వైరస్ వల్ల 25 శాతం మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. బయోసేఫ్టీ లేనటువంటి పరిశోధనశాలల్లో పాకిస్థాన్ సీసీహెచ్ఎఫ్‌వీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు క్లాక్సన్ రిపోర్ట్ పేర్కొన్నది.