ముంబై జూలై 24
మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. గురువారం సాయంత్రం జిల్లాలోని కొర్చి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు శుక్రవారం ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని ఆయన తెలిపారు. కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగిన తర్వాత నక్సల్స్ అడవుల్లోకి పరారైనట్టు సదరు అధికారి పేర్కొన్నారు.అయితే ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. కాగా జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమ రూపకర్త చారుమజుందార్ జ్ఞాపకార్థం ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ‘‘అమరవీరుల వారం’’గా పాటించాలంటూ నక్సలైట్లు పోస్టర్లు అంటించినట్లు సమాచారం.