తన సోదరుడైన హిరణ్యాక్షుని మరణమునకై శోకిస్తున్న తల్లిని ఓదార్చుతూ, హిరణ్య కశిపుడు ఆత్మస్వరూపమును గురించి బోధిస్తాడు. అమ్మా! ఆత్మస్వరూపమును తెలుసుకొనుట కషటము. అది కేవలం జ్ఞానస్వరూపం. ఆ ఆత్మకు అనాదియైన కర్మసంబంధమును వలన, సంసార బంధము కలిగి ఒకరితో ఒకరు కలియుట, విడిపోవుట జరుగుతుంది. అలాగే జనన మరణాలు కలుగుతాయి. ఈ విషయమై నీకొక కథ చెబుతాను విను. పూర్వము ఉశీనర దేశము నేలు సుయజ్ఞుడను మహారాజు యుద్ధంలో పరాజితుడై శత్రుబాణములతో కొట్టబడి, ప్రాణములు కోల్పోయి క్రింద పడియుండగా అతనిని చూసిన భార్య సోదరులు, బంధుమిత్రులు ఎంతో విచారిస్తూ, నాధా నాధాయని విలపిస్తూ అతని గుణవిశేషణములు చెప్పుకుంటూ ఏడుస్తున్నారు. రాజా! నీవ్ఞలేని మేము ఎలా జీవించగలము? మాకు నిమిషమొక యుగముగా తోచుచున్నది. నీవు పరలోక మునకేగి తిరిగి రానిచో మేము జీవించగలమా? నిన్నెడ బాసియుండలేము. అగ్నిప్రవేశము చేసి నీ దరికై చేరెదము, అని ఆ రాజు భార్యాపిల్లలు, బంధువ్ఞలు ఏడుస్తుండగా యమధర్మరాజు విన్నవాడై వారి బాధను చూసి నివారింప నిశ్చయించి ఒక బ్రాహ్మణ బాలునిగా వేషధారియై వచ్చి వారితో, అమ్మా! ఎందులకై మీరు ఇంత బాధాకరంగా విలపిస్తున్నారు? ఆలోచించండి.
అమ్మా! మీరందరూ మోహంలో మునిగియున్నారు. ఏ జీవియైనను దేహమును పొందుట, విడుచుటయేగాని ఆత్మపుట్టునదియు, చచ్చునదియుకాదు. (లోపలనున్నదే ఆత్మ) ప్రతివారికీ పూర్వజన్మ కర్మవలననే దేహము వచ్చును. దాని ద్వారా ఏఏ కర్మలనుభవింపవలయునో, అవి అనుభవించుట పూర్తికాగానే ఆ దేహము నశించుచున్నది. కనుక చావకయుండు వాడెవ్వడు లేడు. ఎక్కడి నుండి వచ్చెనో తిరిగి, అచ్చటికి పోవుట జీవులకు స్వభావమైయున్నది. భగవంతుడు ఈ సమస్త సృష్టి యందునను ఉండేవాడు. నాశనములేనివాడు ఆయన అజ్ఞానుసారమే ప్రాణులన్నియు వారి వారి కర్మానుసారముగా పుట్టుట, పెరుగుట, నశించుట జరుగుతుంది. కనుక మీరు ఇలా విలపించుట వలన ప్రయోజనమేమున్నది? అంతేకాక దైవానుగ్రహము కలవాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినను తప్పించుకొన గలడు. అదిలేని వానికి ఎన్ని రక్షణలున్నను పనికిరావు. కనుక సర్వమునకు దైవమే కారణము.
మీరు శోకించి ప్రయోజనమేమున్నది? ఎవరికైననూ కర్మలు తీరిన వెంటనే దేహము నశిస్తుంది. ఇలాగే దేహమునకు కలిగే జరామరణాదులు ఆత్మకు కలుగవ్ఞ. ఆత్మనిత్యము శాశ్వ తము. కనున నిత్యమైన ఆత్మను గురించిగానీ, అస్థిర మైన దేహ మును గురించి కానీ జ్ఞానులైన వారు శోకింపరు. ఎలాగంటే, ఒక గృహములో ఆ గృహ యజమాని నివసించును. ఏకారణముతోనైనా ఆ గృహము నశించినపుడు వేరొక గృహములో ప్రవేశిస్తాడు. అలాగే, ఆత్మయును కర్మాధీనమై వచ్చి దేహమున ప్రవేశించి. ఆ దేహము ద్వారా అనుభవించవలసిన కర్మలు తీరునంతవరకూ అందులోనే యుండి, ఆ కర్మలు తీరగానే ఆ దేహమును విడిచిపోతుంది. కర్మతీరగానే నశించేది దేహమేకానీ, అందున్న ఆత్మకాదు. ఆత్మకును దేహమునకును చాలా భేదమున్నది. ఆత్మదేహములో వున్నా దేహము కన్నా వేరుగా వ్ఞన్నది. అందుకే దేహము నశిస్తుంది. ఆత్మకు నశింపులేదు. చూడండి! మీరాజు నిద్రపోయినట్లున్నాడు. మీ మాటలను విను వాడును, బదులు పలుకువాడును అయిన జీవుడు ఆయన శరీరము నుండి ఎప్పుడో వెళ్లిపోయినాడు. ఆ జీవుడు ప్రాణములకును, దేహమునకును, ఇంద్రియ ములకును, మనస్సునకును ముఖ్యుడు. ఆ జీవుడు పోయిన తర్వాత ఈ బంధములేవియు వుండవు. మరి మీరెందుకు శోకిస్తారు? అంతేకాదు.
మీరు దేహమునే ఆత్మయని భావించుట వలననే ఈ శోకము కలుగు తున్నది. ఇలా దేహములందు, విషయములందు అభి మానం వున్నవారు నా తల్లి, నా తండ్రి, నా భార్యా, నా బిడ్డ, నా స్నేహితులు, నా బంధువ్ఞలు నా గృహమని ఎంతో ప్రేమ చూపుతారు. ఈయనకు, మీకు ఎంత కాలము సంబంధముందో అంతకాలము వుండి వదలిపెట్టి వెళ్లిపోయాడు. మీరు విచారించాల్సిన పనిలేదు. జ్ఞాను లగు వారు నిత్యమైన ఆత్మను, అనిత్యమైన దేహమును గురించి దుఃఖింపరు. అజ్ఞానులు నాశనమందునపుడు శోకిస్తారు. మీరు ఎంత ఏడ్చినను మీరాజు తిరిగిరాడు. మీరునూ ఆ రాజు వద్దకు పోలేరు. జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతిదీ నశింపవలసిందే. అంతేకాదు, కనిపించే ప్రతిదీ నశించేదే. ఒకసారి దేహమును విడిచినవారు తిరిగి ఈ దేహమునకు రారు.
తిరిగి దేహములో చేరరు. మీరు విచారమును విడిచి, మీమీ గృహములకు వెళ్ళవలసినది అని వారికి జ్ఞానోదయం కలిగించిన ఆ బాలకుని రూపధారియైన యమధర్మరాజు తన లోకము కేగెను. తదుపరి వారం దరూ ఈ బాలునికున్న జ్ఞానము మనకు లేకపోయెను గదా అని ఆలోచించినవారై చనిపోయిన సుయజ్ఞ మహారాజు తిరిగిరాడని నిశ్చయించుకుని ఆ రాజుకు చేయవలసిన పరలోక క్రియలు పూర్తిచేసి వారందరూ తమ దారిన తాము వెడలిపోయారు. ఈ కథను హిరణ్యకశిపుడు తన సోదరుడైన హిరణ్యాక్షుని మృతికి దుఃఖించుచున్న తల్లికి, సోదరుని భార్యలకు చెప్పి, వారినోదార్చి తాను మరణములేని జీవితమును సాధించవలెనని ఆలోచించి ఆ చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థించుటకై, తపస్సు చేయుటకై వెడలిపోయెను.