YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఊర్మిళ వర్సెస్ సంచయిత

ఊర్మిళ వర్సెస్ సంచయిత

విజయనగరం, జూలై 25
అదేంటో రాజకోట రహస్యం కాస్తా రచ్చ అవుతోంది. తెర వెనక ఉండాల్సిన యువ రాణులు ముందుకు వచ్చి కత్తి యుధ్ధం చేస్తున్నారు. రాజవంశానికి సిసలైన వారసులు తామేనని సవాల్ చేస్తున్నారు. ఇదంతా ఏదో జానపద సినిమా కాదు, ప్రతిష్టాత్మకమైన విజయనగరం పూసపాటి సంస్థానంలో జరుగుతున్న సిసలైన పోరాటం. రాజ్యాలు పోయినా ఆస్తులు ఉన్నాయి. వాటికి సాక్ష్యంగా కోట కూడా ఉంది. వాటి కోసమేనా ఈ ఆరాటాలూ, పోరాటాలు అన్న చర్చ కూడా ముందుకువస్తోంది. పీవీజీ రాజు గారి ఇద్దరు కొడుకుల్లో లౌక్యుడు అశోక్ గజపతి రాజు. అందుకే సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్ సొంతం చేసుకున్నారు. ఇక అన్న గారు ఆనందగజపతిరాజు మాత్రం ఎంపీగా, మంత్రిగా పనిచేసినా కూడా ఎక్కువ కాలం ఈ కుళ్ళు రాజకీయాల్లో ఇమడలేక దండంపెట్టేశారు.ఆనందగజపతిరాజు సింహాచలం ట్రస్ట్ చైర్మన్ గా ఆధ్యాత్మిక భావనలు నిండా వంటబట్టించుకున్నారు. ఇక మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా పేదలకు విధ్య, వైద్యం వంటి వాటిని అందించే ప్రయత్నం చేశారు. వందల ఎకరాల భూములు మాన్సాస్ ట్రస్ట్ కి ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆయన 2016న దివంగతులయ్యారు. ఆయన స్థానంలో ఎవరు అన్న ప్రశ్న వస్తే అపుడు తమ్ముడు, కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపరిరాజే అన్నారంతా. అప్పట్లో టీడీపీ సర్కార్ అధికారంలో ఉండడం, అశోక్ గజపతిరాజు పూసపాటి వారసుడిగా జనం మొత్తానికి తెలియడంతో ఏ వివాదం లేకుండానే ఆయనే బాధ్యతలు స్వీకరించారు. దానికి అనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పౌరోహిత్యం నెరిపారు.ఇదంతా బయట జనాలకు కనిపించినా నాడే వారసత్వం కోసం అంతపురంలో అతి పెద్ద యుధ్ధమే జరిగిందని ఇపుడు అర్ధమవుతోంది. ముందుగా ఆనందగజపతిరాజు విడాకులు ఇచ్చిన భార్య ఉమాగజపతి రాజు పెద్ద కుమార్తె సంచయిత గజపతి నాడే తనను ట్రస్టీని చేయమని కోరారని ఆమె ఇన్నాళ్ళుగా చేస్తున్న వాదనల బట్టి తెలుస్తోంది. ఇక నాడు బాబు కేవలం అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజుకే ట్రస్టీగా పదవికి కట్టబెట్టి పెద్దవాడు అయిన ఆనందగజపతి కుటుంబాన్ని పక్కన పెట్టారని సంచయిత గజపతి ఆరోపిస్తూ వచ్చారు. ఇపుడు వైసీపీ అధికారంలోకి రావడం, తన తల్లి ఉమ మాజీ ఎంపీ కావడం, తాను కూడా బీజేపీలో ఉండడంతో రాజకీయ పలుకుబడితో బాబాయ్ అశోక్ గజపతిని గద్దె దింపి సంచయిత తాను ఆ ట్రస్ట్ పదవులు దక్కించుకున్నారు.ఇక ఇపుడు సీన్ లోకి ఆనందగజపతి రెండవ భార్య సుధా గజపతిరాజు కుమార్తె ఊర్మిక గజపతి రాజు వచ్చారు. ఆమె విదేశాల్లో చదువుకుంటోంది. ఎపుడైతే అక్క సంచయిత మాన్సాస్ చైర్మన్ అయ్యారో నాటి నుంచే చెల్లెలు రంగంలోకి దిగిపోయారు. తనకు దక్కాల్సిన పదవి అది అంటూ ఇపుడు వీరంగం వేస్తున్నారు. ఒకే నోటితో అటు బాబాయ్ అశోక్ గజపతిరాజు ని ఇటు అక్క సంచయితను కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు. బాబాయ్ నాడు తమను మోసం చేయబట్టే ఇపుడు ఆయనకూ పదవి లేకుండా పోయిందని కూడా సెటైర్లు వేస్తున్నారు. నిజానికి తమకే ఆనందగజపతిరాజు వారసత్వం హక్కులు ఉన్నాయని కూడా ఊర్మిళ‌ అంటోంది. ఇది ఇక్కడితో ఆగదు, న్యాయ పోరాటం చేసి అయినా సాధిస్తామని కూడా చెబుతోంది. మరో వైపు తాను రాజకీయాల్లోకి వస్తానని కూడా అంటోంది. మొత్తం మీద చూస్తే ఇపుడు పూసపాటి కోటలో అక్కచెల్లెళ్ల సమరం భల్ పసంద్ గా సాగుతోంది

Related Posts