విజయవాడ, జూలై 25,
ప్రజాస్వామ్యంలో మూడు స్తంభాలు ఘర్షణ పడుతున్నాయి. ఒక వ్యవస్థ పరిధిలోకి మరో వ్యవస్థ వస్తూనే ఉంది. అయితే “లెజిస్లేచర్” మరియు “ఎగ్జిక్యూటివ్” పనితీరును సమీక్షించే అవకాశం, అధికారం జ్యూడిషయరీకి రాజ్యాంగం పరిమితంగా కల్పించింది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ పతనం అయ్యాయి. అనుమానం లేదు. రాజకీయం, అధికారం మినహా ఇక్కడ మిగిలిందేమీ లేదు. చట్ట సభల్లో చర్చలు తక్కువ జరుగుతున్నాయి. రచ్చే ఎక్కువగా ఉంటోంది. అదికూడా అధికార పార్టీ లేదా పార్టీల సమూహంపై ప్రతిపక్ష పార్టీ లేదా పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రమే ఉంటున్నాయి.ఏ అంశంపైనా అర్ధవంతమైన చర్చ చట్టసభల్లో జరుగుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఎగ్జిక్యూటివ్ వెన్నెముక కోల్పోయింది. అధికారంలో ఉన్న పార్టీకి, నాయకత్వానికి ఊడిగం చేయడానికి అలవాటు పడింది. జ్యూడిషియరీలో కూడా విలువలు పడిపోతున్నాయి. చాలా మందికి న్యాయమూర్తులు కాకముందు రాజకీయ సంబంధాలు ఉంటున్నాయి. కొందరు న్యాయమూర్తులుగా పదవీవిరమణ చేసిన తర్వాత రాజకీయ సంబంధాలు పెట్టుకుంటున్నారు.లెజిస్లేచర్ లో స్పీకర్ అనే వ్యవస్థ ఒక బలమైన వ్యవస్థగా ఇప్పటికీ నిలిచే ఉంది. ఈ పదవిలోకి వచ్చిన కొందరు రాజకీయ నేతలు ఈ పదవి ప్రతిష్టను దిగజార్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకో ఆ పదవి ప్రతిష్ట కొంత మిగిలే ఉంది. బహుశా అందుకేనేమో రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై సుప్రీం కోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది. ప్రజాస్వామ్యం, ప్రాధమిక హక్కులు, అసమ్మతి వంటి విషయాల్లో లెజిస్లేచర్ పనివిధానంలో కోర్టులు ఎంతమేరకు జోక్యం చేసుకోవచ్చు అనే వ్యాఖ్య సుప్రీం కోర్టు చేసింది. పైగా ఈ అంశంలో విస్తృతమైన చర్చ జరగాలని కూడా సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. నిజమే స్పీకర్ వ్యవస్థపై చర్చ జరగాల్సిందే. అలాగే న్యాయమూర్తి పదవీకాలానికి ముందూ, వెనుకా (పదవీవిరమణ తర్వాత) ఉండే రాజకీయ అనుబంధంపై కూడా విస్తృత చర్చ జరగాల్సిందే.