విశాఖపట్టణం, జూలై 25,
అదేంటో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా చూస్తే జగన్ కుడి భుజం విజయసాయిరెడ్డి సైడ్ అవుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ ఇంచార్జిగా విజయసాయిరెడ్డి ఉంటున్నారు. ఆయనకు తెలియకుండా వైసీపీలో చేరేందుకు గంటా చక్రం తిప్పడం పార్టీలో పెద్ద ఎత్తున చర్చగా ఉంది. విజయసాయిరెడ్డి కను సైగతోనే వైసీపీలో చీమ కూడా కదులుతుంది అన్న రోజులు పోయాయా అనిపిస్తోంది. తాజాగా విజయసాయిరెడ్డి గంటా అవినీతి బాగోతాన్ని చదివి వినిపించారు. తుప్పు పట్టిన సైకిల్ బెల్లుకు గంటా గణ గణ అంటూ ట్విట్టర్ ద్వారా టార్గెట్ చేశారు. అంతే కాదు, గంటా అవినీతిపరుడు, ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ చేరడానికి చూస్తారు, మేము ఎట్టి పరిస్థితిలోనూ ఆయన్ని చేర్చుకోం అంటూ భారీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. గంటాకు వైసీపీ ఎపుడో డోర్స్ క్లోజ్ చేసింది అని కూడా అన్నారు. గంటా హవా ఎక్కడుంది, ఆయన పలుకుబడి పూర్తిగా పోయిందని కూడా గాలి తీసేశారు.ఈ మాటలను బట్టి ఎవరికైనా అర్ధమయ్యేది ఏంటంటే గంటా ఎప్పటికీ వైసీపీ గడప తొక్కరని, కానీ జరిగేది ఇపుడు వేరుగా ఉంది. గంటా వైసీపీలోకి వస్తున్నారు. ఏకంగా రాజ మార్గాన వస్తున్నారు. విజయసాయిరెడ్డిని కాదని మరీ ఫ్యాన్ నీడన సేద తీరాలనుకుంటున్నారు. నిజానికి ఒకసారి విజయసాయిరెడ్డి కాదు అంటే ఎవరికైనా వైసీపీలో నో ఎంట్రీవే. కానీ ఇక్కడ ఉన్నది గంటా మరి. రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న నేత ఆయన. అందువల్లనే గంటా నేరుగా జగన్నే మంచి చేసుకుని వైసీపీలోకి వస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామం వైసీపీలో నంబర్ టూ అనిపించుకుంటున్న విజయసాయిరెడ్డికి శరాఘాతమే అంటున్నారు.గంటా వైసీపీలో చెరేందుకు ఇద్దరు మంత్రులు ప్రధాన పాత్ర పోషించారని అంటున్నారు. అందులో ఒకరు విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే, మరొకరు విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి కన్నబాబు అన్న మాట వినిపిస్తోంది. కన్నబాబు అంటే జగన్ కి బాగా గురి. పైగా ఆయన విశాఖ రాజకీయాలను చూస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ గెలవాలన్నది జగన్ పట్టుదల. దానికి ఏమేం చేయాలో అన్నీ చేయమని కూడా కన్నబాబుకు జగన్ ఫ్రీడం ఇచ్చేశారు. రాజకీయ, సామాజిక సమీకరణలు చూసుకున్నపుడు గంటా వంటి నేత వైసీపీలో ఉంటే అది గరిష్ట లాభమని కన్నబాబు అంచనా కట్టారు. ఇక బొత్సకు విజయసాయిరెడ్డి రాకతో తన పట్టు జారుతోందన్న బాధ ఉంది. దీంతో ఆయన గంటా కనుక వైసీపీలోకి వస్తే విజయసాయిరెడ్డిని వెనక్కు నెట్టవచ్చు అన్న వ్యూహంతోనే గంటాను కోరి మరీ తీసుకువస్తున్నారని అంటున్నారు.ఈ పరిణామాలతో విజయసాయిరెడ్డికి జగన్ వద్ద ఏమీ పలుకుబడి లేదని రుజువు అయితే మరో వైపు డైరెక్ట్ దెబ్బ మాత్రం అవంతి శ్రీనివాస్ కి పడుతోంది. గంటాను పూర్తిగా వ్యతిరేకిస్తున్న అవంతి కి ఇపుడు ఎటూ పోలేని పరిస్థితి. అలాగని ఆయన్ని వైసీపీలో తక్కువ చేయరు. ఆయనకు మరో ఏడాదిన్నర పాటు పదవి కచ్చితంగా ఉంటుంది. ఆ తరువాత మాత్రం మాజీ అయిపోతారు. అపుడు కనుక గంటాకు మంత్రి పదవి ఇచ్చి భీమిలీ టికెట్ కూడా కన్ ఫర్మ్ చేస్తేనే అవంతి బాధ వర్ణనాతీతం అవుతుంది అంటున్నారు. కానీ అవంతి చేసేది ఏమీ లేదు. జగన్ ని కాదని పార్టీలో ఏమీ చేయలేరు. అలాగని ఇప్పకిపుడు బయటకు వెళ్ళలేరు. ఆయనకు మళ్ళీ టీడీపీ ఆల్టర్నేషన్ అవుతుందా అంటే ఏమో 2024 నాటికి సైకిల్ పార్టీ పుంజుకుంటే ఇదే గంటా వైసీపీలో ఎందుకుంటారు అన్న డౌట్లు ఉండనే ఉన్నాయి. మొత్తానికి అవంతి ఈ మొత్తం ఎపిసోడ్ లో భారీగా నష్టపోతారని చెప్పకతప్పదు.