
హైద్రాబాద్, జూలై 25,
కొన్నేళ్ళ క్రితం తెలంగాణలో కుప్పలుతెప్పలుగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. కోళ్లఫారాలు పెట్టినట్టు చిన్న చిన్న షెడ్లలో కాలేజీలు పెట్టేశారు. వేలాదిమంది విద్యార్ధులు వాటిలో చేరిపోయి పట్టాలతో బయటకు వచ్చారు, అయితే ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు, బోధన సరిగా లేకపోవడం వల్ల కొన్నింటిని ప్రభుత్వం మూసివేసింది. తాజాగా తెలంగాణలో 16 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేయాలని నిర్ణయించింది. దీని వల్ల 3800 సీట్లు పైగా తగ్గిపోనున్నాయి.
గత కొన్నేళ్ళుగా ఈ కాలేజీల్లో చాలా తక్కువస్థాయిలో అడ్మిషన్లు జరిగాయని జెఎన్టీయూ హెచ్ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఈ కాలేజీలన్నీ వివిధ జిల్లాల్లో వున్నాయని ఆయన అన్నారు. అడ్మిషన్లు లేకపోవడం వల్ల ఈ కాలేజీల నిర్వహణకు యాజమాన్యాలకు తలకు మించిన భారంగా మారింది. దీనికి తోడు ఫీజు రీఎంబర్స్ మెంట్ కూడా ఆలస్యంగా రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ దృష్టికి తెచ్చాయన్నారు రిజిష్ట్రార్.
కరోనా వైరస్ కారణంగా కాలేజీలను పరిశీలించాల్సి వుందన్నారు. వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో వసతుల గురించి ఫిర్యాదులు వచ్చాయని, కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే కాలేజీలు తెరిచేందుకు అనుమతులు ఇస్తామన్నారు. మూసివేసే కాలేజీలకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ వుండదన్నారు.
అంతేకాదు మూసివేయనున్న కాలేజీ క్యాంపస్ లను హాస్టళ్ళు, పెయింగ్ గెస్ట్ రూంలుగా మార్చనున్నారు. అద్దెకు తీసుకున్న భవనాలను తిరిగి యజమానులకు అప్పగించనున్నారు. ఈ మూసివేయనున్న కాలేజీల జాబితాను త్వరలో ప్రకటించనుంది జేఎన్టీయూహెచ్.