జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లీడర్ దొరకడం లేదు. ఆయన పార్టీలో పవన్ తప్ప మరే లీడర్ లేరు. పార్టీ స్థాపించి నాలుగేళ్లవుతున్నా ఇప్పటి వరకూ ఆయన పార్టీలో ఎవరూ చేరలేదు. తాను ఇతర పార్టీల నేతలను చేర్చుకోనని, యువతకే ఎక్కువ ప్రాధాన్యమిస్తానని పవన్ చెబుతున్నా…అది పైపైకే అంటారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేటి రాజకీయాలను బాగా ఔపోషణ పట్టించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, ఆయన తన పార్టీ బలోపేతానికి నడుంబిగించారు. ఇందుకోసం అనుభవజ్ఞులైన నేతలను తన దరికి చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఆయన ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్టు సమాచారం. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలకు గాలం వేస్తున్నారా? ఇతర పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్‌కి ప్రయత్నాలు మొదలుపెట్టారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీడీపీ సీనియర్ ఎంపీ జేసీ.దివాకర్ రెడ్డి ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. వాస్తవంగా జిల్లాలో బలమైన గొంతుక విన్పించే నేత అవసరం. అలాగే జిల్లా మొత్తాన్ని శాసించగల లీడర్ ఆయన పార్టీకి అవసరం. కాని పవన్ వెంట నడిచేందుకు నేతలు సముఖంగా లేరా? లేక ఇతర పార్టీల్లో టిక్కెట్ దక్కని వారు ఈపార్టీలో చేరేందుకు వస్తారా? అనేది ఆ పార్టీలోనే చర్చనీయాంశమైంది.పవన్ కల్యాణ‌్ ఈసారి వామపక్షాలతో కలసి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఆయన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని స్పష్టం చేయకపోయినప్పటికీ….దాదాపు వందకు పైగానే నియోజకవర్గాల్లో పవన్ పార్టీ పోటీ చేస్తుందన్నది ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఇప్పుడు పవన్ కు వందమంది అభ్యర్థులు కావాలి. ఎవరినో ఒకరి నిలపాలనుకుంటే అభ్యర్థుల కొరత ఉండదు. కాని సమర్థులైన అభ్యర్థులే కావాలని పవన్ అన్వేషణ ప్రారంభించినట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీలో లాగా ఎవరెవరికో టిక్కెట్లు ఇవ్వకుండా, తాను సొంతంగా చేయించిన సర్వే ప్రకారమే టిక్కెట్లు ఇవ్వాలన్నది పవన్ నిర్ణయంగా తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని టీమ్ లను జిల్లాలకు పంపినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో పేరుమోసిన వైద్యులు, ఇంజినీర్లు, పారిశ్రామికవేత్తలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా వీటిపై దృష్టి పెట్టని పవన్ గత నాలుగు రోజులుగా నియోజకవర్గాలుగా సమీక్షలు చేస్తున్నారు.