YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరులో సైకిల్ కు రిపేర్లు

చిత్తూరులో సైకిల్ కు రిపేర్లు

తిరుపతి, జూలై 28, (న్యూస్ పల్స్)
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధారణ కార్యకర్త మొదలు జిల్లాకు చెందిన ముఖ్య నేతల వరకు అంతా అధికారాన్ని ఎంజాయ్ చేసిన వారే. పాలనా వ్యవహారాలన్నీ పార్టీ ముఖ్యనేతల కనుసన్నల్లోనే సాగిపోయేవి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయాక జిల్లాలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. నేతలంతా పార్టీకి ముఖం చాటేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాని సైలెంట్ అయిపోయారు. గత ఎన్నికల్లో ఆయన చంద్రగిరి నుంచి పోటీ చేసి చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇది ఆయన్ను బాగా కుంగదీసింది. ఏడాది కాలంగా నాని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు.పార్టీ నేతల ఇళ్లల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. ఒక దశలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వదులుకోడానికి కూడా సిద్ధమయ్యారు. జిల్లా అధ్యక్షుడే ఇలా ఉంటే ఇక పార్టీ పరిస్థితి కూడా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా పార్టీకి చెందిన మరో ముఖ్యనేత అమర్‌నాథ్‌రెడ్డి. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి, టీడీపీలో చేరారుసుమారు రెండున్నరేళ్ల పాటు మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. మొన్నటి ఎన్నికల్లో ఓటర్లు ఆయనకు షాక్ ఇచ్చారు. రాజకీయాలకు కొత్త అయిన ఓ యువకుడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి నుంచి ఆయన ఇంకా తేరుకోలేదు. పెద్దగా బయటకు రావడం లేదు. కరోనా కారణంగా ఇంట్లో కూడా ఎక్కువ సమయం ఉండడం లేదు. సొంత ఫాం హౌస్‌లో ఉంటున్నారట.ఈ మధ్య టీడీపీ రెండు, మూడు కార్యక్రమాలు చేపట్టినా అమర్నాథ్‌ రెడ్డి ఎక్కడా పాల్గొనలేదు. ఒక దశలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవి మళ్లీ ఆయనకే అప్పగించాలని భావించినా.. ఆయన సున్నితంగా వద్దనేశారట. ఎన్నికల ముందు చూద్దామని చెప్పేశారట. జిల్లాకు చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. గుంటూరులో ఉంటూ తనయుడు, ఎంపీ జయదేవ్ వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నారు.అడపాదడపా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాత్రమే పార్టీలో కాస్త చురుగ్గా కనిపిస్తున్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తరచు మీడియా ముందుకు వస్తున్నారు. కుప్పంకు చెందిన ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు స్థానికంగానే ఉంటున్నారు. ఆయన కుప్పం వదలి బయటకు రావడం లేదు. శ్రీకాళహస్తికి చెందిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి, నగరికి చెందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు గాలి జగదీశ్‌లు మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత బాగా డీలా పడిపోయారు.రాజకీయ ఆరంగేట్రంలోనే పరాజయం ఎదురుకావడంతో కోలుకోలేకపోతున్నారని కార్యకర్తల్లో గుసగుసలు మొదలయ్యాయి. మొత్తం మీద జిల్లాలో టీడీపీ నేతలు పార్టీకే కాదు స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా బాగా దూరం అవుతున్నారట. ఒకటి, రెండు సందర్భాల్లో తప్ప ప్రజలకు కనిపించడం లేదు. ఇలాంటి సందర్భాల్లో సొంత జిల్లాలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టడం అధినేత చంద్రబాబుకు పెద్ద సవాల్ అని అంటున్నారు. ఈ విషయంలో ఆయన ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారో వేచి చూడాల్సిందే.

Related Posts