YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మొదటి వారంలో గంటా గ్యారంటీ

 మొదటి వారంలో గంటా గ్యారంటీ

విశాఖపట్టణం, జూలై 28, 
గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో దిట్ట. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలైనా గంటా శ్రీనివాసరావు మాత్రం వైజాగ్ ఉత్తరం నుంచి విజయం సాధించారు. ఎప్పుడూ అధికార పార్టీలో ఉండటానికి ఇష్టపడే గంటాకు కొత్త చిక్కు వచ్చి పడింది. విపక్ష పాత్ర పోషించడానికి గంటా ఇష్టపడటం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఇన్ని రోజులు చర్చలు జరిపిన గంటా.. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ అయిన వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారనే టాక్‌ జోరందుకుందిఅటు బీజేపీతో ఇటు వైసీపీతో సమాంతరంగా చర్చలు జరిపారు గంటా. అనుచరులు మాత్రం బీజేపీలోకి అసలు వద్దే వద్దంటున్నారట. దీంతో వైసీపీ తప్పించి వేరే ఆప్షన్ లేదని నిర్ధారించుకున్న గంటా డైరెక్ట్‌గా రంగంలోకి దిగారట. జిల్లా వైసీపీ నాయకత్వాన్ని పట్టించుకోకుండా డైరెక్ట్‌గా సీఎం జగన్ సన్నిహితులతో టచ్‌లోకి వెళ్లి, ఓకే చేయించుకున్నారని టాక్. విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్‌తో గంటాకు తీవ్ర విభేదాలున్నాయి. విజయసాయిరెడ్డి సమక్షంలోనే గంటా త్వరలో జైలుకు పోతారని అవంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ జిల్లా వైసీపీ నేతలెవరికీ గంటా పార్టీలో చేరటం ఇష్టం లేదనే ప్రచారం జరుగుతోంది.మరోపక్క, గంటా కూడా పలు కీలక ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, అధికార పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపినా గెలిపించి తీసుకువస్తానని ప్రతిపాదన పెట్టారట. దీనికి వైసీపీ హైకమాండ్ కూడా ఓకే అందని చెబుతున్నారు. గంటాకు కేబినెట్ ర్యాంక్‌తో కూడిన నామినేటెడ్ పదవి అడిగారని అంటున్నారు. ఆ పదవి ఇవ్వడానికి వైసీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టుకుపోయినా విశాఖ సిటీలో నాలుగు అసెంబ్లీ స్థానాలు సాధించి తన పట్టును నిరూపించుకుంది టీడీపీ. విశాఖ ప్రజలు రాజధాని కావాలని కోరుకోవడం లేదని, అవసరమైతే అభిప్రాయ సేకరణ కూడా చేసుకోవచ్చని పలు సందర్బాలలో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు సవాల్ చేశారు.గంటా రాజీనామా ప్రతిపాదన ద్వారా ప్రతిపక్షానికి గట్టి సమాధానం చెప్పే అవకాశం వస్తుందని అధికార పార్టీ భావిస్తోందంట. ఈ ఉపఎన్నికల్లో గెలుపు ద్వారా విశాఖను పరిపాలనా రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని, విశాఖ సిటీలో టీడీపీ ప్రభ తగ్గిపోయిందని, ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం దాటిపా ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత రాలేదనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుందని వైసీపీ అంచనా. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఇన్‌చార్జిగా కేకే రాజు ఉన్నారు. పేరుకే గంటా ఎమ్మెల్యే అయినా అధికారిక కార్యక్రమాలన్నీ రాజు చేస్తున్నారు. గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేశారు గంటా.2014లో టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు గంటా. అనంతరం మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో విశాఖ నార్త్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అవసరానికి అనుగుణంగా రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవడంలో గంటా తర్వాత ఎవరైనా అని అంటారు. 1999 నుంచి నేటి వరకు ఓటమి ఎరుగని నేతగా గంటా ఉన్నారు. 2019లో విజయం తర్వాత నుంచి ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. అటు బీజేపీలో గానీ ఇటు వైసీపీలో గానీ చేరే అవకాశం ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, ఏడాది దాటినా ఇప్పటి వరకూ అవేవీ జరగలేదు. కానీ, ఈ సమయంలో గంటా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారని అంటున్నారు. ఈసారి మాత్రం పక్కాగా ఒక నెల రోజులలోపే గంటా వైసీపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

Related Posts