YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానులుపై గవర్నర్ ఆచితూచి అడుగులు

మూడు రాజధానులుపై గవర్నర్ ఆచితూచి అడుగులు

విజయవాడ, జూలై 29, 
ఇపుడు ఏపీలో కరోనా కంటే అతి పెద్ద చర్చ మరోటి ఉంది. అదే మూడు రాజధానుల వ్యవహారం. అమరావతి మన రాజధాని అని టీడీపీ అంటోంది. ఆ పార్టీ పట్టుదల వెనక ఆశలు, ఆకాంక్షలు, బోలెడు రాజకీయాలు ఉన్నాయి. ఇక వైసీపీ మూడు ముక్కలాట ఆడుతోంది. అభివృధ్ధి వికేంద్రీకరణ పేరిట విశాఖకు పాలనారాజ‌ధానిని తేవాలనుకుంటోంది. దాని కోసం ఏడు నెలలుగా అవిశ్రాంత రాజకీయ పోరాటం జరుగుతోంది. శాసనమండలిలో రెండు సార్లు టీడీపీ విజయవంతంగా బ్రేకులు వేసినా కూడా రాజ్యాంగ నిబంధనల మేరకు ఆటోమేటిక్ గా బిల్లు పాస్ అయినట్లేనన్న సూత్రాన్ని ఆధారం చేసుకుని గవర్నర్ వద్దకు వైసీపీ సర్కార్ బిల్లులను పంపింది.ఈ బిల్లు విషయంలో న్యాయ చిక్కులు ఏమైనా ఉన్నాయా అని గవర్నర్ బిశ్వభూషణ్ ఇపుడు తీవ్ర్తంగానే పరిశీలిస్తున్నారని భోగట్టా. ఆయన రాజ్యాంగ, న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నట్లుగా రాజ్ భవన్ వర్గాల సమాచారం. ఈ బిల్లులపైన తన సంతకం పడితే వచ్చే ఇబ్బందులు, పర్యవసానాలు కూడా గవర్నర్ గట్టిగానే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ బిల్లులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటి వెనక అధికార, విపక్ష రాజకీయం కూడా ముడిపడిఉంది. ఇంకా చెప్పాలంటే ఏపీ బీజేపీ సైతం అమరావతి రాజధానిని కోరుకుంటోంది. మరి పూర్వాశ్రమంలో బీజేపీ మనిషిగా ఉన్న గవర్నర్ ఈ బిల్లులను అంత సులువుగా చట్టం చేస్తారని రాజకీయాలు తెలిసిన వారెవరూ భావించడంలేదు కూడా.అయితే ఈ బిల్లులు కనుక ఆమోదముద్ర వేయకుండా గవర్నర్ తిప్పి పంపితే దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద వైసీపీ సర్కార్ ప్లాన్ బీ రెడీ చేసిందని కూడా అంటున్నారు. ప్లాన్ బీ అంటే మళ్లీ రాజ్యాంగ నిబంధనలు ఉపయోగించుకోవడమేనట. అదెలా అంటే శాసనమండలిలో బిల్లులను టీడీపీ ఆమోదించకపోయినా కూడా రెండు సార్లు పంపి ఆటోమెటిక్ గా ఎలా ఆమోదం అయ్యేలా చూసుకున్నారో గవర్నర్ విషయంలో అలాగే చేయాలని వైసీపీ యోచిస్తోంది. అంటే గవర్నర్ ఒకసారి మాత్రమే ప్రభుత్వం రూపొందించిన ఏ బిల్లులను అయినా తిప్పిపంపగలరు, మళ్లీ అవే బిల్లులను యధాప్రకారం రెండవసారి ప్రభుత్వం కనుక పంపిస్తే కచ్చితంగా ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. దాంతో వైసీపీ ఇపుడు బేఖాతర్ గా ఉందిట. గవర్నర్ ఏ కారణాల చేతనైనా బిల్లులను ఆమోదించకపోయినా మళ్ళీ ఆయనకే వాటిని తిప్పి పంపి ఆమోదముద్ర వేయించుకోవాలన్నది వైసీపీ పంతంగా కనిపిస్తోందిట.సరే ఈ రకమైన రాజ్యాంగ పద్ధతులూ, నియమాలు తెలియని వారు ఎవరూ రాజ్ భవన్ లో ఉండరుగా. పైగా ఈ బిల్లులను ఒక్క వైసీపీ తప్ప ఏపీలోని విపక్షాలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఇపుడు చూస్తే కరోనా మహమ్మారి ఉంది. తక్షణం ఈ బిల్లులను ఆమోదిస్తే అంతే వేగంగా విశాఖ రాజధాని వైపుగా వైసీపీ పరుగులు తీస్తుంది అన్నది కూడా తెలిసిందే. దాంతో అపుడు ఏపీ రాజకీయ రావణ కాష్టమే అయ్యే అవకాశాలు ఉన్నా ఆశ్చర్యమే లేదు. దాంతో ఇప్పటికి ఇపుడు ఈ బిల్లుల ఆమోదానికి వచ్చిన తొందర ఏముంది అన్నది కూడా మరో ఆలోచనగా ఉంది. అదే ఆలోచన రాజ్ భవన్ వర్గాలకు నిజంగా ఉంటే కనుక బిల్లు పరిశీలన మరింత కాలం జరుగుతుందని అంటున్నారు. దానికి కాలపరిమితి లేదు కాబట్టి బిల్లులను గవర్నర్ వద్దనే ఉంచుకుని అన్ని విషయాలూ కూలంకషంగా పరిశీలించే పేరు మీద లేట్ చేసినా చేయవచ్చునని వినిపిస్తున్న మాట. మొత్తానికి ఎవరి ఆలోచనలు వారివిగా ఉన్న ఈ మూడు రాజధానుల బిల్లులు ఏపీలో అతి పెద్ద చర్చకే కాక రచ్చకు కూడా దారితీస్తున్నాయని చెప్పాలి.

Related Posts