తమిళనాడులో సూపర్ స్టార్‌గా చలామణి అవుతున్న రజనీకాంత్, విశ్వనటుడుగా చలామణి అవుతున్న కమల్ హాసన్‌ల ను కావేరీ నది వివాదం కొంప ముంచేస్తోంది. రాజకీయంగా ఈ అగ్రహీరోలు తీసుకున్న యూటర్న్ ఫేమ్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తోంది. నట శిఖరాలను అధిగమించిన ఈ ఇద్దరు నటులకు దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అయితే ప్రాంతీయ తత్వానికి పెద్ద పీట వేసే తమిళనాడు, కర్ణాటకల్లో వీరికి ఇప్పుడు ఎదురు గాలి వీస్తోంది. వరుస పరిణామంతో ఈ ఇద్దరు అగ్రహీరోలపై కన్నడిగులు మండి పడుతున్నారు. తమకు అన్యాయం జరిగేలా వ్యాఖ్యలు చేస్తూ.. కార్యాచరణకు సిద్ధమవుతున్న కమల్, రజనీలకు వ్యతిరేకంగా వారు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రం లో కమల్, రజనీ సినిమాలను బ్యాన్ చేస్తామని కూడా అభిమానులు హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, రాజకీయ నేతలు మరింతగా అభిమానులను రెచ్చగొడుతున్నారు. ఈ పరిణామంతో ఈ ఇద్దరు హీరోలకు రాజకీయంగా తమిళనాడు ఎంత దగ్గరవుతోందో.. బిజినెస్ పరంగాను, సినిమాల పరంగానూ కర్ణాటక అంతకన్నా ఎక్కువ దూరమవుతోంది. దీంతో వీరి పరిస్థితి.. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారిపోయింది. మరి ఏం చేస్తారో చూడాలి.ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేశారు. మక్కల్ నీది మయ్యం పేరుతో కమల్ హాసన్ ఇప్పటికే పార్టీని ప్రకటించి.. తన కార్యాచరణను గ్రామ స్థాయికి తీసుకు వెళ్లేందుకు పూర్తిసన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా మండ్రం పేరుతో రజనీ కూడా త్వరలోనే పార్టీనిప్రకటించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.దీంతో ఈ ఇద్దరు హీరోలు తమ నటనను సైతం పక్కన పెట్టి రాజకీయంగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, రాష్ట్రంలో ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యం లో ఈ ఇద్దరూ సినిమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. అడపా దడపా సినిమాలు తీసేందుకు తాను సిద్ధమేనని విశ్వనటుడు ఇప్పటికే ప్రకటించాడు. ఇక, 2.0 సినిమాతో త్వరలోనే వెండి తెరను బ్రేక్ చేసేందుకు రజనీ సిద్ధమవుతున్నాడు. అంతా బాగానే ఉన్నా.. రాజకీయంగా వీరు వేస్తున్న అడుగులు కన్నడనాట తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. వీరికి కర్ణాటక మార్కెట్‌లోనూ భారీ బిజినెస్ ఉంది. అక్కడ కూడా వీరికి పిచ్చ అభిమానులు ఉన్నారు. అయితే, తాజాగా తమిళనాడు రాష్ట్రం కావేరీ నది జలాల బోర్డు ఏర్పాటు చేయడంపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అని పోరాడుతోంది.కావేరీ జలాల కేటాయింపులో తమిళనాడుకు అన్యాయం జరిగిందని, బోర్డు ఏర్పాటుతో ఆ నష్టం తీరుతుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే, ఇదే సమస్యపై కర్ణాటకలోనూ ఉద్యమాలు సిద్ధమవుతున్నాయి. కావేరీ జలాల బోర్డు ఏర్పాటు చేస్తే.. తమకు నష్టం కలుగుతుందని ఇక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక, తమిళనాడులో రాజకీయం గా అరంగేట్రం చేసిన రజనీ, కమల్ హాసన్‌లకు తమిళ ప్రజల ప్రాముఖ్యం ఎక్కువ. అక్కడ ఏ సమస్య వచ్చినా నడిగర్ సంఘంపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సినీ నటులు స్పందించి తీరాల్సిందే. ఈ క్రమంలో తాజాగా నడిగర్ సంఘం మౌన దీక్షలు సైతం చేసింది. అదేసమయంలో రజనీ దూకుడు పెంచి ఐపీఎస్ మ్యాచ్‌లు ఇప్పుడు అవసరమా? అని కూడా ప్రశ్నించారు. అంటే, కావేరీ బోర్డు ఏర్పాటు తక్షణ అవసరమని ఆయన చెప్పకనే చెప్పాడు.