YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేబినెట్ కూర్పుపై చర్చోపచర్చలు

కేబినెట్ కూర్పుపై చర్చోపచర్చలు

విజయవాడ,జూలై 29, 
రాజ‌కీయంగా వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంచ‌ల‌నంగా మారుతోంది. ఆయ‌న వేసే ప్రతి అడుగును నిశితంగా గ‌మ‌నించేవారు పెరుగుతున్నారు. నిజానికి ఈ బాధ్యత ఇప్పటి వ‌రకు ఆయ‌న వ్యతిరేక మీడియా, ప్రతిప‌క్షాలు పోషించాయి. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ వేస్తున్న అడుగులను, తీసుకుంటున్న నిర్ణయాల‌ను వైఎస్సార్ సీపీలోనే కొంద‌రు స‌మీక్షిస్తున్నారు. అయితే, బ‌య‌ట‌కు చెప్పక‌పోయినా.. వారిలో వారు గుసుగుస‌లాడుకుంటున్నారు. తాజాగా జ‌రిగిన ఇద్దరు మంత్రుల ప్రమాణ స్వీకారంపై ఇదే త‌ర‌హా చ‌ర్చ పార్టీలో పెద్దగానే జ‌రుగుతోంది. కీల‌క నాయ‌కులు ముఖ్యంగా సీనియ‌ర్లు.. పార్టీలో జ‌రుగుతున్న ఈ ప‌రిణామాల‌ను చ‌ర్చించుకుంటున్నారు.తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరు మంత్రులు కూడా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారే. వారికి పెద్దగా రాజ‌కీయ హిస్టరీ కానీ, రాష్ట్ర స్థాయిలో ప‌ద‌వులు అనుభ‌వించిన చ‌రిత్రకానీ లేదు. అదే స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ కోసం ఇర‌గ‌దీసి కృషి చేసింది కూడా లేదు. వారు చేసిన త్యాగాలు కూడా లేవు. కానీ, ఇదే పార్టీలో త్యాగాలు చేసిన వారు ఉన్నారు. సీనియ‌ర్లు ఉన్నారు. గ‌తంలో మంత్రులుగా చ‌క్రాలు తిప్పిన వారు జిల్లాల‌ను శాసించిన వారు ఉన్నారు. కేంద్రంలోనూ మంచి ప‌లుకుబ‌డి ఉన్న వారు ఉన్నారు. వారంతా ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, వారంద‌రినీ ప‌క్కన పెట్టి.. ముఖ్యంగా బీసీ నాయ‌కులు ఉన్నప్పటికీ.. కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన అప్పల‌రాజు, వేణుల‌ను ఎందుకు మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నార‌నేదే సీనియ‌ర్ల మ‌ధ్య సాగుతున్న గుస‌గుస‌.దీనికి వైఎస్సార్ సీపీ సీనియ‌ర్లు చెబుతున్న కీల‌క విష‌యం ఏంటంటే.. జ‌గ‌న్ ఇలాంటి వారినే కోరుకుంటున్నార‌ని. కొత్త వారైతే.. వ‌చ్చే కాలంలో తాను తీసుకునే నిర్ణయాల‌ను తు.చ‌. త‌ప్పకుండా అమ‌లు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని, అదే పాత‌వారు… సీనియ‌ర్లు అయితే.. త‌న నిర్ణయాల‌పై అభిప్రాయాలు చెప్పడంతోపాటు.. త‌న‌కు కంట్లో న‌లుసుల్లా మారే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని చెబుతున్నారు. దాదాపు ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్‌లో బొత్స, పెద్దిరెడ్డి వంటివారు త‌ప్ప పెద్దగా సీనియ‌ర్లు ఎవ‌రూ లేరు.ఇక మంత్రి ప‌ద‌వి ఆశిస్తోన్న సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలా మంది తోక జాడిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిని కంట్రోల్ చేయాల‌ని డిసైడ్ అయిన జ‌గ‌న్ వీరి కేబినెట్ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లడంతో పాటు పూర్తిగా జూనియ‌ర్లతోనే త‌న కేబినెట్‌ను నింపేస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రీముఖ్యంగా త‌న‌కు అనుగుంలైన వారు, జూనియ‌ర్లనే జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో పెట్టుకున్నారు. దీనివెనుక‌.. ఆయ‌న సొంత అజెండా ఉంద‌ని, దీనిని అమ‌లు చేసుకునేందుకు కొత్తవారినే ఆయ‌న ఎంపిక చేసుకుంటున్నారని సీనియ‌ర్లు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఇది నిజ‌మేనా? అంటే.. ప‌రిణామాలు కూడా దీనిని స‌మ‌ర్ధిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related Posts