వాషింగ్టన్, జూలై 29,
ప్రపంచలోనే అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సిన్ అధ్యయనానికి అగ్రరాజ్యం అమెరికా తెరతీసింది. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో అమెరికాలోని బయోటెక్ కంపెనీ మోడర్నా ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఇక ఈ సంస్థ తమ లాస్ట్ స్టేజ్ ట్రయల్స్‌ను సోమవారం ప్రారంభించింది. ఈ ట్రయల్‌లో కొవిడ్-19 వల్ల తలెత్తే శ్వాసకోస సమస్యలు లేని దాదాపు 30 వేల మంది యుక్తవయసున్న వాలంటీర్లు పాల్గొన్నారు. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను 30 వేల మంది వాలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఇందుకోసం అవసరమైన డోసులను సిద్ధం చేసినట్లు మోడెర్నా తెలిపింది. ఈ వ్యాక్సిన్ పరీక్షలను మోడెర్నా మార్చిలోనే ప్రారంభించింది. తొలుత 45 మంది వాలంటీర్లపై ప్రయోగించింది. అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం భారీ ఎత్తున నిర్వహించే పరీక్షలతో వ్యాక్సిన్ అసలు సామర్థ్యం బయటపడే అవకాశముందంటున్నారు నిపుణులు. అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీపై పెట్టుబడిని రెట్టింపు చేసింది. గతంలో 483 మిలియన్ల డాలర్లు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా వ్యాక్సిన్ తయారీ సంస్థకు అదనంగా 472 మిలియన్ల డాలర్లు కేటాయించింది. మోడెర్నా బయోటెక్నాలజీ కంపెనీ ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సుమారు 30వేల రోగులపై మోడెర్నా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. వ్యాక్సిన్ పరీక్షల కోసం దాదాపు 1,50,000 మంది అమెరికన్లు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో వేర్వేరు ప్రాంతాల నుంచి సుమారు 30 వేల మందిని ఎన్నుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాక వీరిలో కొందరికి అసలు వాక్సిన్, మరి కొందరికి డమ్మీ వెర్షన్ ఇవ్వనున్నారు. అనంతరం వీరందరి రోజు వారి దినచర్యలను.. వారి ఆరోగ్యంలో వచ్చే మార్పులను నిశితంగా పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.కేవలం తామిచ్చిన షాట్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది మాత్రమే కాకుండా ఈ అధ్యయనం ద్వారా వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితం అనేది కూడా పరీక్షిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక మోడర్నా 30 వేల మందితో లాస్ట్ స్టేజ్ ట్రయల్స్‌ను ప్రారంభిస్తోందనే వార్త వైరల్ అవ్వడంతో.. మోడర్నా షేర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సంస్థ షేర్లు 11 శాతం పెరిగి ప్రస్తుతం షేర్ ధర 81.31 డాలర్లకు చేరింది. మోడరనా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు ట్రయల్ సైట్లలో వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపింది. మొదటిసారిగా జారియాలోని సవన్నాలో వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించింది. అంతేకాక ఈ నెల ప్రారంభంలో చైనా, బ్రిటన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకాతో పాటు బ్రెజిల్‌లో తయారవుతున్న వ్యాక్సిన్‌ల చివరి దశ పరీక్షలు కూడా మొదలయ్యాయి.