వరంగల్, జూలై 29,
విదేశాల్లో ఉంటున్న వారు అవకాయ పచ్చడి ఎంచక్కా లాంగించేస్తున్నారు. అంతేకాదు కారంపొడులు, అల్లం-వెల్లుల్లి, పసుపు, చింతపండు, మిరియాలు, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులతో ఎప్పుడు లేని విధంగా రుచికరమైన వంటలు చేసుకుని కమ్మగా తినేస్తున్నారు. వీటితో పాటు అరిసెలు, లడ్డూలు, సున్నండలు, జంతికలు, గారెల్లాంటి పిండి వంటలతో ప్రతిరోజూ పండుగ చేసుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పల్లె రుచులన్నీ ఫ్లైట్లో విదేశాలకు ఎగిరిపోతున్నాయి. కరోనా పుణ్యమా అని ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగువారికి అమ్మచేతి వంట తినే భాగ్యం కలిగింది.కరోనా విజృంభణతో అమెరికా సహా పలు దేశాల్లో లాక్‌డౌన్ విధించడంతో చాలాచోట్ల ఇండియన్ స్టోర్స్ అందుబాటులో లేవు. మరోవైపు వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని బయటి వస్తువులను తెచ్చుకోవడం కంటే ఇంట్లో చేసిన వంట కాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో ఉన్న తమ పిల్లలు, బంధువుల కోసం వివిధ రకాల ఆహార పదార్థాలను ఎగుమతి చేస్తున్నారు. కార్గో సర్వీస్ ద్వారా కమ్మనైన వంటలను నేరుగా వాళ్ల ఇళ్లకే పంపించేస్తున్నారు.అంతర్జాతీయ కొరియర్ సంస్థల ద్వారా విదేశాలకు ఎగుమతవుతున్న నిత్యావసరాల్లో 90 శాతానికిపైగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు వెళ్తుండగా మరో 10 శాతం కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, బ్రిటన్ తదితర దేశాలకు వెళ్తున్నాయి. సగటున రోజుకు 50 నుంచి 100 క్వింటాళ్ల వరకు ఇక్కడి నుంచి వివిధ రకాల ఆహార పదార్థాలు విదేశాలకు తరలివెళ్తున్నాయి. ఒక్కోసారి 500 క్వింటాళ్ల వరకు కూడా పచ్చళ్లు, పిండివంటల పార్శిళ్లు వెళ్తున్నట్టు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు చెబుతున్నారు. కాగా, ఒక్కో ప్యాకింగ్‌లో 10 నుంచి 25 కిలోల వరకు వస్తువులుంటున్నాయి. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు హైదరాబాద్‌లోని తమ ఇంటి నుంచి కావలసిన వస్తువులను తెప్పించుకుంటున్నారు. కాలిఫోర్నియా, ఒక్లహామా, న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా తదితర ప్రాంతాలకు వస్తువులు ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి.కరోనా కట్టడి కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోవడంతో కార్గో సర్వీసుల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో రోజుకు 17 కార్గో విమానాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లేవి. ప్రస్తుతం 37 విమానాలు వివిధ దేశాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కరోనా మందులు, ఇతర ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, పీపీఈ కిట్లు తదితర వస్తువులు బల్క్‌గా రవాణా అవుతున్నాయి. అలాగే, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తమ పిల్లలకు, బంధువులకు పంపించే పార్శిళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. డీహెచ్‌ఎల్, ఫెడాక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు వీటిని ఎగుమతి చేస్తున్నాయి. ఈ సంస్థలకు అనుబంధంగా నగరం నలమూలలా 250 నుంచి 300కుపైగా అనుబంధ కొరియర్ సంస్థలు పని చేస్తున్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకొని నేరుగా వారిళ్ల వద్దకే వెళ్లి ప్యాకింగ్ చేసి పార్శిల్ సంస్థలకు తరలిస్తారు. గతంలో కిలోకు రూ.500 తీసుకొనేవారు. ఇప్పుడీ మొత్తం రూ.600కు పెంచేశారు. ఇక గతంలో అన్ని రకాల వస్తువులను పంపించేవారు. ఇప్పుడు ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. పచ్చళ్ల ఎక్కువగా వెళ్తున్నారు