అమరావతి జూలై 29
ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా పథకాలు ప్రారంభించనున్నట్లు సీఎం వైయస్ జగన్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 45–60 ఏళ్ల మధ్య అర్హత ఉన్న మహిళలకు వైయస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750లు చొప్పున నాలుగు సంవత్సరాలు అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే 90 లక్షలకుపైగా ఉన్న డ్వాక్రా మహిళలకు వైయస్సార్ ఆసరాతో అండగా నిలుస్తామని చెప్పారు. ఈ రెండు పథకాల కోసం ఏడాదికి దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం వెల్లడించారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం మహిళా సాధికారితలో మైలు రాయి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మహిళల జీవితాలను మార్చడానికి ఈ సహాయం ఉపయోగపడాలని, దీని కోసం బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. పాడి పరిశ్రామిభివృద్ధికి అమూల్ తరహాలోనే మరికొన్ని కంపెనీలతో కీలక అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకర్లు ఏపీకి సహకరిస్తున్నారు. సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి రైతుల ఖాతాల వివరాలను పంపాలని కోరుతున్నాను. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించాం. ఈ ఏడాదికి సంబంధించినవి కూడా (2019–20) రైతులకు చెల్లించాల్సిన సున్నా వడ్డీని చెల్లిస్తాం. రైతుల ఖాతాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి:
ప్రభుత్వం ఒక పథకం ప్రారంభించింది అంటే.. దాని మీద విశ్వాసం, నమ్మకం కలగాలి. దీన్ని అమలు చేయకుంటే.. ప్రజలు బాగా ఇబ్బంది పడతారు. మేం చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాం, చెప్పిన ప్రకారం అన్నీ నెరవేరుస్తున్నాం. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మహిళల సాధికారిత దిశగా రెండు పథకాలను ప్రారంభిస్తున్నాం. 25 లక్షల మహిళలకు వైయస్సార్ చేయూత అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45–60 ఏళ్ల మధ్య అర్హత ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ సహాయం ద్వారా వారి జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నాం. నాలుగేళ్ల పాటు, ఏడాదికి రూ.18,750 చొప్పున లబ్ధిదారు అయిన మహిళకు ఇస్తామని అన్నారు.
వారి జీవితాలను మార్చడానికి ఈ డబ్బు వినియోగపడాలి. పాడి పరిశ్రమాభివృద్ధికి అమూల్తో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందాలు చేసుకోబోతున్నాం. ఈ కంపెనీలు, బ్యాంకుల సహాయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. సెప్టెంబరులో కూడా స్వయం సహాయక సంఘాలకు రూ.6,700 కోట్లకు పైగా ఇవ్వబోతున్నాం. మొత్తమ్మీద ఏటా రూ.11 వేల కోట్ల చొప్పన, నాలుగేళ్ల పాటు ఈ రెండు పథకాలకు ఖర్చు చేస్తున్నాం. 90 లక్షల మందికిపైగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వైయస్సార్ ఆసరా, చేయూత కింద మరో 25 లక్షలమంది మహిళలు.. మొత్తంగా కోటి మందికి పైగా సహాయం లభిస్తుందని అన్నారు.
రైతులు, మహిళలు, ప్రజారోగ్యంకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. వాటితో పాటు, అన్ని వర్గాల వారికి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు బ్యాంకర్లు పూర్తి సహాయ, సహకారాలు అందించాలని ఆయన కోరారు.