హైద్రాబాద్, జూలై 30
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న భార్యను బతికించుకోవడం కోసం ఓ హెడ్ కానిస్టేబుల్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చేతిలో రూ.2 లక్షలు ఉన్నా.. నగరంలోని ప్రయివేట్ హాస్పిటళ్లు ఐసీయూలో బెడ్లు ఖాళీగా లేవని చెప్పి ముఖం చాటేశాయి. తీరా గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లాక.. అక్కడున్న సీఐ కరోనా ఉంటేనే గేటు దాటి లోపలికి పంపిస్తానని చెప్పారు. హాస్పిటల్లోకి వెళ్లనీయండి సార్ అని ప్రాధేయపడినా కనికరించలేదు. దీంతో వెనక్కి వెళ్తుండగా.. ఆహెడ్ కానిస్టేబుల్ భార్య ప్రాణాలు కోల్పోయింది. ఆ పోలీసు అధికారి ఆవేదనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది.‘‘నా భార్యను యశోదా హాస్పిటల్కు తీసుకెళ్లాను. ఈసీజీ తీసి పల్స్ రేట్ తక్కువగా ఉందన్నారు. రూ.2 లక్షలు ఉన్నాయని చెప్పినా.. ఐసీయూలో బెడ్లు ఖాళీగా లేవన్నారు. కానీ నా కళ్ల ముందే వేరే పేషెంట్లను ఐసీయూలో చేర్చుుకుంటున్నారు. సరూర్నగర్లోని గ్లోబల్ హాస్పిటల్కు తీసుకెళ్లాను. సిటీ స్కాన్ తీసి లంగ్స్లో ప్రాబ్లం ఉందన్నారు. అవును సార్ రిపోర్టులు కూడా ఉన్నాయన్నాను. రూ.2 లక్షలు ఉన్నాయి, అడ్మిట్ చేసుకోండన్నాను. తెల్లారాక మరో రూ.3 లక్షలు తెచ్చిస్తానని చెప్పాను.సీపీ సార్కు ఫోన్ చేస్తే.. ఏదైనా హాస్పిటల్లో చేర్పించండని సూచించారు. ఒక్కణ్నే మళ్లీ యశోదా హాస్పిటల్కు వెళ్లాను. కానీ బెడ్లు ఖాళీ లేవన్నారు. అక్కడి నుంచి ఓమ్నీ, అమ్మ, కామినేని హాస్పిటళ్లకు వెళ్లినా ఐసీయూలో బెడ్లు ఖాళీ లేవన్నారు. సార్తో మాట్లాడితే గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లమన్నారు.తీరా అక్కడికి వెళ్లిన తర్వాత చిలకలగూడ సీఐ ఉన్నారు. నేను హెడ్ కానిస్టేబుల్ సార్.. ఏ హాస్పిటల్కు వెళ్లినా కరోనా ఉందో లేదో తెలియదని అడ్మిట్ చేసుకోలేదు సార్ అని చెప్పాను. నా భార్య చావు బతుకుల్లో
ఉంది.. హాస్పిటల్లోకి తీసుకెళ్లనీయండి సార్ అని వేడుకున్నాను. సీపీ సార్ చెప్పారని చెప్పాను. కానీ ఆయన మాత్రం ఏం మాట్లాడలేదు. కరోనా ఉందంటేనే లోపలికి వెళ్లనిస్తానని గేటుకు తాళం వేయించారు. రాత్రి ఒంటి గంటకు అక్కడి నుంచి వెళ్లగొట్టారు.అంబులెన్స్ తీసుకొని అక్కడి నుంచి ఒక కిలోమీటర్ వచ్చే సరికి నా భార్య చనిపోయింది. నా కళ్ల ముందే కాళ్లు చేతులు కొట్టుకొని ఊపిరి ఆడకపోవడంతో నా భార్య చనిపోయింది. చేతిలో రూ.2 లక్షలు ఉన్నా బతికించుకోలేకపోయాను. శాంపిళ్లు ఇచ్చిన తర్వాత పిల్లలకు కరోనా వచ్చింది. దీంతో నేను క్వారంటైన్లోకి వెళ్లాను. 15 రోజుల తర్వాత కింగ్ కోఠి డాక్టర్ ఫోన్ చేసి నీకు కరోనా పాజిటివ్ ఉంది అని చెప్పారు’’ అని హెడ్ కానిస్టేబుల్ వాపోయారు.