విశాఖపట్టణం, జూలై 30,
చంద్రబాబు అతి తెలివితోనే తెలంగాణాలో టీడీపీ అలా తయారైంది అంటారు. ముందు ఆంధ్రాలో పార్టీ సంగతి చూద్దాం, తరువాత తెలంగాణావైపు చూడచ్చు అని చంద్రబాబు తప్పుడు అంచనాలతో ముందుకు ఆనాడు వెళ్లారు. ఫలితంగా ఏపీలో ఒకసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ అప్పటికే తెలంగాణాలో పార్టీ చాప చుట్టేసింది. ఇక ఇపుడు ఏపీలోని పదమూడు జిల్లాలతో కూడా బాబు సరికొత్త రాజకీయం మొదలెట్టారు. ఆయనకు ఇపుడు అమరావతి రాజధాని ముఖ్యంగా కనిపిస్తోంది. దాంతో అటు రాయలసీమ, ఇటు విశాఖపట్నం సంగతి తరువాత చూద్దమనుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఫలితం ఎలా ఉన్నా ప్రధానమైన రెండు ప్రాంతాలను చంద్రబాబు తన సంకుచిత రాజకీయంతో కోల్పోతున్నారని అంటున్నారు.చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేద్దామనుకున్నారు. అందులో తప్పులేదు కానీ ఆయన ఆ దిశగా వేసిన అడుగులే తడబడ్డాయి. ఆయన అనుకున్నట్లుగా టెంపరరీ భవనాలు కాకుండా శాశ్వత కట్టడాలు కేంద్రం ఇచ్చిన సొమ్ముతో పాటు తన వద్ద ఉన్న సొమ్ముతో కట్టి ఉంటే ఇపుడు జగన్ కి అవకాశం అసలు వచ్చేది కాదు. ఇప్పటికీ ఆయన ముప్పయి మూడు ఎకరాలు అంటూ పాత పాటే పాడుతున్నారు. దాంతో ఆయనకు స్టేట్ కంటే రియల్ ఎస్టేట్ మాత్రమే కావాలా అని వైసీపీ గట్టిగా విమర్శలు చేస్తోంది. చివరకు ఇది ఏపీ జనంలో కూడా చంద్రబాబుపై సానుభూతిని తేవడంలేదు సరికాదా వ్యతిరేకత పెంచుతోందిఇక అమరావతి రాజధాని ఉండాలని, అదే ఏకైక రాజధాని కావాలని మొండిపట్టు పడుతున్న చంద్రబాబు మిగిలిన ప్రాంతాల ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఓట్లు కూడా ఆయనకు కావాలి కదా. విశాఖను, కర్నూలును ఈ విధంగా అభివ్రుధ్ధి చేయండని తన సీనియారిటీతో పాలనానుభవంతో చంద్రబాబు వైసీపీ సర్కార్ కి సలహా సూచనలు ఇచ్చి ఉంటే కొంతలో కొంత అయినా ఆయన వాదనకు విలువ ఉండేది. ఆ రెండూ వద్దు, ఒక్క అమరావతే ముద్దు అని చంద్రబాబు అనడంతో సమాధానం చెప్పుకోలేక అక్కడి తమ్ముళ్ళు నానా అవస్థలు పడుతున్నారు.ఉత్తరాంధ్రా జిల్లాలు టీడీపీకి కంచుకోటలు, గత ఏడాది జరిగిన ఎన్నికలు తప్ప అన్నిసార్లూ టీడీపీని ఆదరించిన ప్రాంతాలు. అటువంటి చోట రాజధాని పెడతామని వైసీపీ అంటూంటే చంద్రబాబు తొండి వాదనతో ముందుకు పోతున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. బాబుకు ఇంత చేసిన ఉత్తరాంధ్రా జిల్లాల మీద ఇదేనా ప్రేమ అన్న ప్రశ్న కూడా వస్తోంది. చంద్రబాబు ఎంతగా అమరావతి అంటే అంతలా ఈ ప్రాంతాలకు దూరం అవుతామని తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. లేక ఈ ప్రాంత ప్రజలు బాబుకు ఇంకా ఓటేస్తారని గుడ్డి నమ్మకంతో ఉన్నారా అని పసుపు శిబిరంలోనే హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఇప్పటికే మూడు జిల్లాల్లోనూ అ పార్టీ పడకేసింది. చంద్రబాబు మరింతగా అమరావతి రాగంతో తనకు తానే పార్టీకి గోతులు తీస్తున్నారని అంటున్నారు. మరి చంద్రబాబుధైర్యం ఏంటో చూడాలి.