YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సిక్కోలులో అన్నదమ్ముల సవాల్

సిక్కోలులో అన్నదమ్ముల సవాల్

శ్రీకాకుళం, జూలై 30, 
పదవులు ఊరికే తగిలించుకోవడానికి కావు, అలంకారప్రాయం అంతకంటే కావు. అవి తెచ్చే బరువులు, బాధ్యతలు మోయడం అంటే తలకు మించిన వ్యవహారమే. అందునా క్లిష్టమైన సమస్యలు ఉన్నపుడు పదవులలో ఉన్న వారికి అంతకన్నా నరకం వేరే ఉండదు కూడా. ఏపీలో తెలంగాణా ఉద్యమం గట్టిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సీటు ముళ్ళ కిరీటం అని చాలా మంది తలపండిన నేతలు భావించేవారు. ఇపుడు అలాంటి సమస్య కాకపోయినా కొంచెం ఇబ్బంది కలిగించేదే శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అదే కొత్త జిల్లాల ఏర్పాటు, అదీ కూడా పార్లమెంట్ సరిహద్దుగా చేస్తామని జగన్ సర్కార్ డిసైడ్ చేసింది. దాంతోనే సిక్కోలు ఒక్కసారిగా మండుతోంది. ఎందుకంటే శ్రీకాకుళంలో అభివృధ్ధి చెందిన ఎచ్చెర్ల, పాలకొండ, రాజాం వంటివి వెళ్లి పక్క జిల్లాల్లో కలుస్తాయి. దాంతో సమైక్య శ్రీకాకుళం జిల్లా కోరుతూ అపుడే ఉద్యమం మొదలైంది. దానికి ఆజ్యం పోసింది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావే కావడం ఇక్కడ విశేషం.శ్రీకాకుళం జిల్లా 1950 దశకంలో ఏర్పాటు అయింది. నాడు ఇపుడున్న విజయనగరమే కాదు, ఒడిషాలోని కొన్ని ప్రాంతాలు కూడా శ్రీకాకుళంలో ఉండేది. అలా ఒక చిన్న రాష్ట్రంలా ఉండేదన్న మాట. ఆ తరువాత 1978లో విజయనగరం జిల్లా ఏర్పాటు అవుతూనే సగం ముక్క వెళ్ళిపోయింది. ఇపుడు కొత్త జిల్లాల పేరిట మూడవ వంతు ప్రాంతం విజయనగరం జిల్లాతో కలిస్తే మాకు మిగిలిందేంటి అని అంటున్నారు సిక్కోలు జనం. ఇక శ్రీకాకుళంలో స్థలాభావం వల్ల ఎచ్చెర, రాజాంలలో పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టారు. అంబేద్కర్ వర్శిటీ లాంటివి కూడా అక్కడే ఉన్నాయి. దాంతో విద్యా, ఉపాధి అంతా ఇక్కడే ముడిపడిఉంది. ఇపుడు ఆ సరిహద్దు ప్రాంతాలను వేరే జిల్లాలో కలిపేస్తే శ్రీకాకుళం మరింత వెనకబడిపోతుందన్న ఆందోళన అందరిలో ఉంది.ఈ పరిణామాల నేపధ్యంలో సహజంగా విపక్షాలు ఈ అడ్డగోలు విభజన మీద పోరాడుతాయి. కానీ చిత్రంగా అధికార పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు ముందుకు వచ్చారు. సిక్కోలు పరిరక్షణ అన్నది రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అంతా ఒక్కటి కావాలి. ఈ విషయంలో ఏ పార్టీ అన్నది కాదు, భవిష్యత్తు ముఖ్యం. తరతరాలు బాగుండాలంటే ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి అయినా ఇపుడున్న రూపంలోనే శ్రీకాకుళం జిల్లాను కాపాడుకోవాలి అన్నది ధర్మాన ఇచ్చిన పిలుపు. దాని కోసం కోటి సంతకాల సేకరణ కూడా జరుగుతోంది. మిగిలిన పార్టీలు కూడా జత చేరాయి. ఇపుడు ఇది నిప్పు రాజేస్తోంది.ఈ నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ధర్మాన కృష్ణ దాస్ కి ప్రమోషన్ ఇచ్చి మరీ కీలకమైన రెవిన్యూ శాఖ కూడా జగన్ ఇచ్చారు. జిల్లాల విభజన కూడా ఈ శాఖ కిందకే వస్తుంది. పైగా ముఖ్యమంత్రి తరువాత అంతటి కీలకమైన పదవిలో ఉన్న కృష్ణ దాస్ శ్రీకాకుళం జిల్లాను ముక్కలు కాకుండా ఎలా కాపాడుతారు అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. ఓ వైపు జగన్ ఈ భారమంతా ఆయన మీద ఉంచి సాఫీగా విభజన జరగాలని కోరుకుంటున్నారు. మరో వైపు తమ్ముడు ప్రసాదరరావు సిక్కోలును యధాతధంగా ఉంచాలని అంటున్నారు. మరి తనకు పదవులు ఇచ్చి ఆదరించిన జగన్ మాట ప్రకారం నడవాలా లేక తన సొంత జిల్లా ప్రయోజనాలు కాపాడుకోవాలా అన్నది ఉప ముఖ్యమంత్రి దాసన్నకు పెను సవాల్ అంటున్నారు. మొత్తానికి తమ్ముడు ఉద్యమ జెండా ఎగరేస్తూంటే అన్న ఎదురు నిలిచి పోరాడాల్సివస్తోంది. జగన్ కు నచ్చచెప్పి జిల్లాను ఒకటిగా ఉంచితే కృష్ణ దాస్ చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా తమ్ముడి మీద కూడా విజయం సాధించిన వారు అవుతారు. మరి దాసన్న వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి

Related Posts