నెల్లూరు, జూలై 30,
ధారణంగా.. బలమైన నాయకత్వం ఉన్న కుటుంబం నుంచి ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉంటేనే.. జిల్లా మొత్తం చేతిలో పెట్టుకుంటున్న రోజులు ఇవి. కొందరైతే.. మరింతగా దూకుడు ప్రదర్శించి.. రాష్ట్రంలోనూ చక్రం తిప్పుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే, ఈ పరిస్థితికి భిన్నమైన పరిస్థితి నెల్లూరులో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేకపాటి గౌతంరెడ్డి..ప్రస్తుతం అత్యంత కీలకమైన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడు.. ఒకరకంగా మిత్రుడు కూడా. సుదీర్ఘమైన స్నేహం కూడా ఈ కుటుంబంతో మేకపాటి కుటుంబానికి ఉంది. గతంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి నుంచి వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉంది.కాంగ్రెస్‌లో ఉన్నసమయంతోనే వైఎస్‌తో ఉన్న అనుబంధం కారణంగా.. ఆయనమరణానంతరం.. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి తదితరులు జగన్‌కు జై కొట్టారు. ఈ క్రమంలోనే 2012 ఉప ఎన్నికలు, 2014 ఎన్నికల్లో మేకపాటి కుటుంబం వైఎస్సార్ సీపీ తరఫున బరిలో నిలిచి విజయం సాధించింది. 2012లో ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖరరెడ్డి గెలిచారు. అయితే, తర్వాత ఎన్నికల్లో 2014లో ఆయన గెలుపు గుర్రం ఎక్కలేక పోయినా.. ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి గౌతంరెడ్డి గెలుపు గుర్రాలు ఎక్కారు. ఈ ఎన్నికల్లో జగన్ మేకపాటి కుటుంబానికి ఏకంగా జిల్లాలో మూడు సీట్లు ఇవ్వడం అంటే ఎంత ప్రయార్టీ ఇచ్చారో అర్థమవుతోంది.ఇక, గత ఏడాది ఎన్నికల్లో రాజమోహ న్‌రెడ్డి పక్కకు తప్పుకొన్నా.. ఆయన సోదరుడు, కుమారుడు విజయం సాధించారు. ఈ క్రమంలోనే మేకపాటి గౌతం రెడ్డికి మంత్రి పదవి కూడా దక్కింది. జిల్లాలో రెడ్డి వర్గం నేతల్లో గౌతంరెడ్డి కన్నా సీనియర్లు ఉన్నా కూడా జగన్ గౌతంరెడ్డికే కేబినెట్లో కీలకమైన శాఖను కట్టబెట్టారు. మరి జగన్ దగ్గర ఇంత ప్రయార్టీ ఉండి… జిల్లాలో ఓ రేంజ్‌లో వైఎస్సార్ సీపీలో చక్రం తిప్పిన ఈ కుటుంబం ఇప్పుడు ఎక్కడా పైచేయి సాధించలేక పోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి నెల్లూరు అంటేనే రెడ్డి సామ్రాజ్యం. ఎక్కడ చూసినా.. వారి జాడలే కనిపిస్తాయి.ఈ జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన ఏకైక మంత్రిగా ఉన్న గౌతంరెడ్డి.. తన సొంత సామాజక వర్గం నేతల సమస్యలను కూడా పరిష్కరించలేక పోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నెల్లూరు సిటీ నుంచి గెలిచిన మంత్రి అనిల్ కుమార్ దూకుడు ముందు గౌతం రెడ్డి చతికిల పడుతున్నారని, జిల్లాలో ఏం కావాలన్నా.. అనిల్ దగ్గరకే అందరూ వెళ్తున్నారని అంటున్నారు. చివరికి ప్రజలు కూడా గౌతంరెడ్డిని మరిచిపోయే పరిస్థితి వచ్చిందని వైసీపీలోనే చర్చ సాగుతుండడం గమనార్హం.అయితే, రాజమోహన్‌రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన కొంత మేరకు జిల్లాలో చక్రం తిప్పారని , ఇప్పుడు ఆ తరహా రాజకీయాలు గౌతం రెడ్డి చేయలేక పోతున్నారని అంటున్నారు. మొత్తానికి నెల్లూరులో సొంత బాబాయి ఎమ్మెల్యేగా ఉండి.. తనను సమర్ధించే రెడ్డి ఎమ్మెల్యేలు ఉండి కూడా గౌతంరెడ్డి మౌనం వహించడంపై సొంత పార్టీలోనే నిట్టూర్పునకు దారితీస్తోంది. అయితే అనిల్‌తో పోలిస్తే ఎలాంటి కాంట్రవర్సీలు లేని మంత్రిగా కూడా ఆయనకు మంచి మార్కులే ఉండడం నాణేనికి మరోవైపు సూచికకు నిదర్శనం.