YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పక్కదారి పడుతున్న ఆలయాల నిధులు

పక్కదారి పడుతున్న ఆలయాల నిధులు

ఒంగోలు, జూలై 30, 
కరోనా కావడంతో ఆలయాలకు ఆదాయాలు తగ్గిపోయాయి. ఇక రోజువారి దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని పలు ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు జరిగే పూజలు, బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు తదితర వాటికి పూజా సామగ్రి కొనుగోలు, ఇతరత్రా ఖర్చులపై సమగ్రంగా ఆడిట్‌ జరగటం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏటా ఆలయాలకు వచ్చే కానుకలు, గదుల నిర్మాణం, అన్నదానానికి వచ్చే విరాళాలు సైతం లక్షలాది రూపాయలు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. 1999 – 2000 ఆర్థిక సంవత్సరం నుంచి 2013–14 వరకు 42 దేవాలయాల నిధుల వినియోగానికి సంబంధించి 8,381 అభ్యంతరాలు వచ్చాయి. వీటికి నిర్వహించిన ఆడిట్‌లో రూ.3,81,98,817లు పెండింగ్‌ పడింది. వీటిలో దేవాలయాల కాంట్రిబ్యూషన్‌ ఫీజు, ఆడిట్‌ ఫీజు, ఇతరత్రా రసీదులను కార్యనిర్వహణాధికారులు చూపలేదని ఆడిట్‌ అధికారులు పెండింగ్‌ పెట్టారు. ఆరేళ్లుగా దేవాలయాలకు ఆడిట్‌ సక్రమంగా జరగలేదు. నామమాత్రంగా జరిగిన ఆడిట్‌కు సంబంధించి వచ్చిన అభ్యంతరాలకు కార్యనిర్వహణాధికారులు సరైన లెక్కలు, బిల్లులు చూపలేదని సమాచారం. ఆడిట్‌ పూర్తయిన వివరాలు, అభ్యంతరాల రిపోర్టును  కర్నూలులోని దేవదాయ, ధర్మదాయ సహాయ కమిషనర్, ఉపకమిషనర్‌ కార్యాలయాలకు ఈఓలు అందజేయాల్సి ఉంటుంది. కానీ ఆరేళ్లుగా ఒక్క ఆడిట్‌ రిపోర్టు గానీ, అభ్యంతరాల వివరాలను గానీ అందజేయకపోవడం గమనార్హం. 2012–13లో ఉపకమిషనర్‌గా పని చేసిన సాగర్‌బాబు హయాంలో గానీ, 2013–17  మధ్య పనిచేసిన గాయత్రీదేవి హయాంలో గానీ ఎలాంటి ఆడిట్‌ రిపోర్టులూ అందలేదు. ప్రస్తుతం ఉన్న ఉపకమిషనర్‌ డి.దేములుకు కూడా ఏడాది దాటినా ఒక్క కార్యనిర్వహణాధికారీ అందజేశారు .జిల్లాలో మొత్తం 3,880 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 6ఏ గ్రూపు దేవాలయాలు 10, అలాగే 6బీ గ్రూపు దేవాలయాలు 88 ఉన్నాయి. వీటితో పాటు 6సీ గ్రూపు దేవాలయాలు 3,780 ఉన్నాయి. చాలా ఆలయాలకు మాన్యం భూముల కౌలు, తలనీలాలు, టెంకాయల విక్రయ వేలం, ఇతరత్రా వేలం పాటల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. అలాగే శ్రావణ, కార్తీక, మాఘ మాసాలు, దసరా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మంచి ఆదాయం సమకూరుతోంది.భక్తుల సౌకర్యార్థం గదుల నిర్మాణం, అన్నదానం కోసం దాతలు విరాళాల రూపంలో లక్షలాది రూపాయలను అందజేస్తున్నారు. ఆదాయం బాగా ఉన్న ఆలయాల్లో అవినీతి కూడా అదే స్థాయిలో ఉంటోంది. భక్తులకు సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనుల పేరిట అధికారులు, ఆలయ కమిటీలు కలిసి నిధులు స్వాహా చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఆడిట్‌ సమయంలో చాలావరకు తప్పుడు బిల్లులు బయటపడుతున్నాయి.

Related Posts