YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*రేపు దామోదర ద్వాదశి*

*రేపు దామోదర ద్వాదశి*

శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది. సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాంటి సాలగ్రామాలు *'గండకీ నది'* లో విరివిగా లభిస్తాయి.
సహజ సిద్ధంగా ఏర్పడిన సాలగ్రామాలు కొన్ని పుణ్యక్షేత్రాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో వుంటాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న సాలగ్రామాన్ని *'శ్రావణ శుద్ధ ద్వాదశి'* రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందుకు కారణం *శ్రావణ శుద్ధ ద్వాదశి ... 'దామోదర ద్వాదశి'* గా పిలవబడుతూ ఉండటమే. ఏకాదశిన ఉపవాసం చేసిన వాళ్లు దామోదర ద్వాదశి రోజున ఆ ఉపవాస దీక్షను విరమిస్తుంటారు.
ఈ రోజున శ్రీమహావిష్ణువును వివిధ రకాల పూల మాలికలతో అలంకరించాలి. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించి , స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. మహా విశిష్టమైన ఈ రోజున శ్రీమహా విష్ణువుకి ప్రతీకగా చెప్పబడే సాలాగ్రామాన్ని దానంగా ఇవ్వడం మంచిదని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఒకవేళ సాలగ్రామం లభించని పక్షంలో శ్రీమహావిష్ణువు వెండి ప్రతిమను దానంగా ఇవ్వవచ్చని అంటోంది. *దామోదర ద్వాదశి* రోజున ఈ విధంగా చేయడం వలన మోక్షాన్ని పొందడానికి అవసరమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది.

Related Posts