దక్షిణ కొరియా అంటేనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు ఎక్కడలేని కోపం. ఆ పేరు వింటనే ఆయన ఓ మిసైల్ పేల్చినంత పనిచేస్తాడు. అలాంటి అతను ఇటీవలె దక్షిణ కొరియాలో నిర్వహించనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తమ దేశానికి చెందిన క్రీడాకారులను పంపించేందుకు అంగీకరించాడు. అయితే, అతడి కోపానికి మరింత ఆజ్యం పోసేట్లుగా దక్షిణ కొరియాలోని సియోల్‌లో కొంతమంది వ్యక్తులు ప్రవర్తించారు. సరిగ్గా ఉత్తర కొరియాకు చెందిన ఓ మహిళా బ్యాండ్ బృందం వెళ్లే సమయంలో పెద్ద పెట్టున కిమ్ వ్యతిరేక నినాదాలు చేస్తూ కిమ్ ఫొటోలకు నిప్పంటించడం మొదలుపెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా లెక్క చేయకుండా రైల్వే స్టేషన్‌లో కిమ్ ఫొటోలకు ఓ 200మంది నిరసనకారులు నిప్పుపెట్టారు. కిమ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చివరకు పోలీసులు వారిని నిలువరించి ఆ బ్యాండ్‌ను సురక్షితంగా ఒలింపిక్ కోసం ఆతిథ్యం ఏర్పాటుచేసిన ప్రాంతాలకు తరలించారు. కిమ్ ఫొటోలు సగానికి పైగా కాలిపోయాయి. ఈ విషయం తెలిస్తే కిమ్ ఎలా రియాక్ట్ అవుతాడో ఎదురు చూడాల్సిందే.