నంద్యాల అధికార పార్టీలో ఉన్న బహునాయకత్వం కారణంగా అధికారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోని టీడీపీలో ఇటీవల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. మంత్రి అఖిలప్రియకు, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఖిల, భూమా బ్రహ్మానందరెడ్డికి వ్యతిరరేకంగా ఆళ్లగడ్డ, నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి విడిగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇది కాస్తా రచ్చగా మారింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలనూ చంద్రబాబు చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో ఏవీసుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోనని హెచ్చిరించినట్లు తెలిసింది. ఒక నేత అవునంటే మరో నేత కాదంటూ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో స్థానికంగా అధికారులెవరూ స్వేచ్ఛగా పని చేయలేకపోవడమే కాకుండా ఒక పని విషయంలో మరో నేత ఏం చెప్తాడోనని వాయిదా వేస్తున్నారు. దీంతో సామాన్యుల పనులు ప్రభుత్వ కార్యాలయాల్లో నత్తనడకన కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల నియోజకవర్గంలో మండలి అధ్యక్షుడు ఫరూక్, మంత్రి భూమా అఖిలప్రియ, ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నేత ఏపీ సుబ్బారెడ్డి ఉండగా ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన పురపాలక సంఘం అధ్యక్షురాలు దేశం సులోచన ఉన్నారు. వీరంతా అధికారులకు సిఫారసు చేయగల సత్తా ఉన్నవారే. వీరు ఎవరికి వారు మరొకరితో సంబంధం లేకుండా తాను చెప్పిన పని కావాల్సిందేనని పట్టుబడుతున్న నేతలు. ఒక నేత ఒక పని విషయంలో సిఫారసు చేస్తే మరో నేత అదే పని విషయంలో తాను చెప్పినట్లే జరగాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. నంద్యాల నియోజకవర్గంలో పని చేయాలంటే అన్ని ఒత్తిళ్లను భరించగల సత్తా ఉన్న వారు మాత్రమే అర్హులని అధికారులు వెల్లడించడం గమనార్హం. ఉదయం నుంచి రాత్రి వరకూ అందరు నాయకులను సమన్వయం చేసుకోగలిగితేనే ఇక్కడ పని చేయడం సాధ్యమని, లేదంటే మరోచోట పని చేయడం ఉత్తమమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భూ కబ్జాల విషయంలో మాత్రం నేతల మధ్య సమన్వయం లేక కబ్జాలు సాధ్యం కావడం లేదని ఓ అధికారి వ్యంగంగా పేర్కొన్నారు. ఈ తరహా ఫిర్యాదులు మాత్రం తమ వద్దకు రావడం లేదని ఆయన పేర్కొనడం గమనార్హం. భూ కబ్జాల విషయంలో ఇతర నేతలు వ్యతిరేకించి చెడ్డ పేరు తీసుకువస్తారన్న భయం కారణంగానే ఆ పనికి పూనుకోవడం లేదని అనడం విశేషం. స్థానిక అధికార పార్టీ నాయకులు ఒకటిగా ఉంటే తప్ప అధికారులు స్వేచ్ఛగా పని చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నంద్యాల నియోజకవర్గంలో పనిచేయడానికి ఏ అధికారికి ఏ నేత సిఫారసు చేస్తూ లేఖ ఇచ్చినా సచివాలయంలో అధికారులు నవ్వుకుంటూ ఎంతకాలం అక్కడ పనిచేస్తావో అంటూ ఫైల్ సిద్ధం చేస్తున్నారని, వారం తరువాత కూడా మరో నేత నుంచి సిఫారసు లేకపోతేనే పని ప్రారంభమవుతుందని చెప్పడం విశేషం. నేతల నంద్యాల నేడు నాయకుల అనైక్యత కారణంగా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు.