ఏపీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆక్వా రైతాంగం టౌన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ నిధుల కోసం వేయి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారుదేశంలో మరే రాష్ట్రానికి రెండు ప్రాంతాలను ప్రకటించిన దాఖలాలు లేవు. ఒకే రాష్ట్రానికి రెండు ప్రాంతాలను గుర్తించినందుకు ఆక్వా రైతులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ నిధులకు ఇవి తోడుగా ఉంటాయని భావించారు. కానీ ఏళ్లు గడిచినా ఇప్పటివరకు టౌన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ నిధుల ఊసేలేదు. . కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం 2015-20కిగాను ఆక్వా రాజధానిగా ఉన్న భీమవరం, ఎగుమతుల్లో రాణిస్తున్న విశాఖ నగరానికి సముద్ర ఉత్పత్తులు, ఎగుమతుల్లో టౌన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీగా ప్రకటించాయి. అంటే 2015 నుంచి 2018 వరకు మూడేళ్లకు రూ.450 కోట్లు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులు మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి. 2014-15లో 1.38 లక్షల హెక్టార్లలో, 2015-16లో 1.58 హెక్టార్లలోను, 2016-17లో 1.67 లక్షల హెక్టార్లలో ఆక్వా ఉత్పత్తులను రాష్ట్రంలో ఉత్పత్తి చేశారు. ఇక 2017-18లో 2 లక్షల హెక్టార్ల సాగును ఈపాటికే దాటేసి ఉంటుందని అంచనా. అంటే గతంలో 5 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఉత్పత్తి చేయగా ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఎప్పుడో దాటేసి ఉంటుంది. దీనిని బట్టి ఆక్వా ఉత్పత్తుల ద్వారా అటు కేంద్రానికి, రాష్ట్రానికి ఎటువంటి ఆదాయ వనరులు వస్తాయో అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీరాన్ని ఆనుకుని ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఆక్వా ఉత్పత్తులు ఉత్పత్తి అవుతాయి. వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఆక్వా ఉత్పత్తులు జరిగినా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్పత్తి శాతం బాగా ఎక్కువ. ఈ ఉత్పత్తులను చైనా, జపాన్, అమెరికా, యూరోపియన్ యూనియన్, దక్షిణ తూర్పు ఆశియా తదితర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇతర దేశాలకు సుమారు 5 బిలియన్ డాలర్లు ఆక్వా ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 3 బిలియన్ డాలర్లు పైగానే ఆక్వా ఉత్పత్తులను ఎగుమతులు చేస్తున్నారు. పైగా ఎగుమతులు చేసిన దానికి విదేశీమారక ద్రవ్యం రాష్ట్రానికి బాగా వస్తోంది. దీని ఆధారంగా రాష్ట్రంలో భీమవరం, విశాఖకు టౌన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ విధంగా తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలకు గతంలో ఎక్స్‌లెన్సీ నిధులు ప్రకటించడం, విడుదల చేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఏడాదికి రూ.150 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకు రూపాయి కూడా విదల్చలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందిచకపోవడం శోచనీయం. గతంలో వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ దృష్టికి రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. ఈ నిధులు విడుదల చేస్తే భీమవరం, విశాఖ నగరాల్లో ఆక్వా చెరువులు అభివృద్ధి, ప్రోసెసింగ్ ప్లాంట్ల నిర్మాణం, మినీ పోర్టులు, హ్యాచరీలు ఇలా నిబంధనల ప్రకారం ఆక్వా మరింత అభివృద్ధి చేయవచ్చునని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.