కొత్త జిల్లాల్లతో మోదం.. ఖేదం
విజయనగరం,
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటు విషయం.. కొందరి నేతలకు కంటగింపుగా ఉంటే.. మరికొందరు మాత్రం హ్యాపీగా ఫీలవుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఇప్పటి వరకు కీలక నేతలు, సీనియర్ల ఆధిపత్యంలో ఉన్న జిల్లాల నుంచి తమ తమ నియోజకవర్గాలు పక్క జిల్లాలకు మారిపోవడం లేదా.. తమకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలతో కొత్త జిల్లాలు ఏర్పాటు కానుండడం ఈ నేతలకు ఆనందం కలిగిస్తోంది. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో కీలకమైన డిప్యూటీ సీఎంగా ఉన్న పాముల పుష్పశ్రీవాణి పరిస్థితి దీనికి అద్దం పడుతోంది. జిల్లాల విభజనపై ఈమె చాలా హ్యాపీగా ఉన్నారుదీనికి ప్రధాన కారణం.. కొత్తగా ఏర్పడే ‘అరకు జిల్లా’లో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కొత్త నాయకురాలిగా అవతరించే అవకాశముండడమే. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పార్వతీపురం, కురుపాం, సాలూరులు… కొత్తగా ఏర్పాటు చేయబోయే అరకు జిల్లాలో భాగమవుతాయి. అరకు పార్లమెంటు స్థానాన్ని రెండు జిల్లాలు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కనుక ముహూర్తం కుదిరి.. జిల్లా ఏర్పాటు జరిగితే.. అరకు జిల్లా పరిధిలోకి కురుపాం.. పార్వతీపురం, సాలూరు వస్తుండడంపై పుష్పశ్రీవాణి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం పుష్పశ్రీవాణి ఎస్టీ నియోజకవర్గం అయిన కురుపాం నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు. నియోజకవర్గంపై పట్టు పెట్టుకున్నారు. అయితే, ఇప్పటి వరకు ఇది విజయనగరంలో ఉండడంతో ఆమె దూకుడు పెద్దగా కనిపించడం లేదు. బొత్స సత్యనారాయణ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆయన కనుసన్నల్లోనే కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. ఇక మంత్రిగా ఉన్న శ్రీవాణికి చెక్ పెట్టేందుకు బొత్స జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి ( టీడీపీ సీనియర్ నేత శోభా హైమావతి కుమార్తె) ను పార్టీలోకి తీసుకువచ్చారు. కురుపాంలో శ్రీవాణికి అడ్డుకట్ట వేసేందుకే బొత్స కొద్ది రోజులుగా స్వాతిరాణిని ఎంకరేజ్ చేస్తున్నారన్న టాక్ ఉంది.ఈ క్రమంలోనే ఓ సమావేశంలో ఆమె విజయసాయి సమక్షంలోనే కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తజిల్లాగా అరకు ఏర్పడి.. కురుపాం అందులో భాగమైతే.. పుష్పశ్రీవాణి దూకుడు పెరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. అప్పుడు బొత్స కేవలం విజయనగరం జిల్లాకు మాత్రమే పరిమితమవ్వాల్సి ఉంటుంది. మొత్తానికి కొందరికి మోదం.. కొందరికి ఖేదం కల్పిస్తున్న జిల్లాల ఏర్పాటు. చిత్రమైన రాజకీయాలనే తెరమీదికి తెప్పిస్తోంది.