తుంగభద్ర కష్టాలకు చెక్ ఎప్పుడు
విజయవాడ,
తుంగభద్ర జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనివిధంగా జులైలోనే వరదనీరు పోటెత్తింది. ఈసారి ముందస్తుగానే జిల్లాకు నీటిని విడుదల చేయడంతో అన్నదాతల్లో ఆనందం ఉప్పొంగుతోంది. అంతా సాగుకు సన్నద్ధమవుతున్నారు. కానీ మధ్య పెన్నార్ జలాశయం దక్షిణ కాలువ ఆయకట్టుదారుల్లో ఆ సంతోషం కనిపించడం లేదు. కాలువ ఆధునికీకరణ పనులు నత్తతో పోటీ పడుతుండటమే కారణం. చివరి ఆయకట్టుకు నీరు వెళ్లడం లేదన్న ఉద్దేశంతో ఎమ్పీఆర్ దక్షిణ కాలువ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఇదే జలాశయం ఉత్తర కాలువ పనులు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. దక్షిణ కాలువ మాత్రం ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. దీనికి ‘రాజకీయ’ గ్రహణం పట్టుకుంది. మొత్తం రూ.461.55 కోట్ల అంచనాలతో 86 కి.మీ. ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. 43, 44 ప్యాకేజీలుగా విభజించారు. 43వ ప్యాకేజీ కింద ఎమ్పీఆర్ 0 కి.మీ. నుంచి అనంత నగరం దాకా 41 కి.మీ, అనంత నుంచి నార్పల మండలం తుంపెర డీప్‌కట్ వరకు 42 నుంచి 86 కి.మీ.లు పనులు చేయాల్సి ఉంది. మొత్తం 86 కి.మీ. పరిధిలో 114 నిర్మాణాలు ఉండగా.. అందులో 12 మాత్రమే వివిధ దశల్లో ఉన్నాయి.ఎమ్పీఆర్ జలాశయానికి త్వరలో నీరు చేరనుంది. అక్కడి నుంచి కాలువకు విడుదల చేసినా.. ముందుకు వెళ్లే దారే లేదు. పాత అండర్ టర్నల్‌లను (యూటీ) తొలగించి.. కొత్తగా నిర్మాణం చేపట్టారు. అవి సగం కూడా పూర్తి కాలేదు. వీటిని పూర్తి చేస్తే తప్ప నీటి విడుదల సాధ్యం కాదు. తుంగభద్ర జలాలు ఎమ్పీఆర్‌కు వస్తున్నాయని ఆనందించాలో.. వచ్చినా తీసుకోలేని దుస్థితిలో ఉన్నామని బాధపడాలో రైతులకు అర్థం కాని పరిస్థితి. ముందస్తు హెచ్చెల్సీకి నీరు విడుదల కావడంతో రైతులు వరినార్లు పోసుకున్నారు. ఆగస్టులో కాలువకు నీరివ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.మధ్య పెన్నార్ జలాశయం (ఎమ్పీఆర్) దక్షిణ కాలువ ఇది. దీని ద్వారానే అటు తాడిపత్రి, ఇటు పులివెందుల ఉప కాలువలకు నీరు వెళతాయి. గార్లదిన్నె, అనంత గ్రామీణం, బీకే సముద్రం, శింగనమల, నార్పల మండలాల మీదుగా కాలువ 96.56 కి.మీ. పొడవున ఉంది. దీని పరిధిలో 36,052 ఎకరాల ఆయకట్టు, 29 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. మరోవైపు తుంపెర డీప్‌కట్ నుంచి తాడిపత్రి ఉప కాలువ మొదలవుతుంది. ఈ కాలువ పెద్దపప్పూరు, తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో 30.58 కి.మీ. ఉండగా.. 28,144 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇంతటి కీలకమైన దక్షిణ కాలువ ఆధునికీకరణపై ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. తుంగభద్ర జలాలు నాలుగైదు రోజుల్లో ఎమ్పీఆర్‌లోకి రానున్నాయి. ఇక్కడి నుంచి దక్షిణ కాలువకు నీరివ్వలేని దుస్థితి. కాలువ వెడల్పు.. కట్టడాల పనులు పూర్తి కాకపోవడమే అందుకు కారణం.దక్షిణ కాలువ కింద మొత్తం 36 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువ ద్వారానే తాడిపత్రి, పులివెందుల ఉప కాలువలకు నీరు వెళుతుంది. ప్రస్తుతం దక్షిణ కాలువ 1350 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. దీన్ని 2వేలకు పెంచాలన్న ఉద్దేశంతోనే ఆధునికీకరణ సాగుతోంది. పది మీటర్ల వెడల్పు ఉన్న కాలువను 15.6 మీటర్లకు పెంచనున్నారు. ఈ పని 70 శాతం పూర్తయినట్లు ఇంజినీర్లు ‘లెక్క’ నమోదు చేశారు. సైడ్ లైనింగ్ మాత్రం ఆగిపోయింది. లైనింగ్ వల్ల భూగర్భ జలాలపై ప్రభావం చూపిస్తుందన్న ఉద్దేశంతో గార్లదిన్నె మండల ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. గార్లదిన్నె, అనంత గ్రామీణ మండలాల పరిధిలో 23.4, 26.15 కి.మీ వద్ద ఉన్న పాత యూటీలను తొలగించారు. వీటి స్థానంలో కొత్త వాటిని నిర్మిస్తున్నారు. ఈ పనులు సగమే అయ్యాయి. ఇవి పూర్తయితేనే నీరు రావడానికి అవకాశం ఉంది. ఇక 17, 29.53 కి.మీ. వద్ద సింగిల్ లైన్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇవన్నీ ఆగస్టు రెండో వారానికి పూర్తయ్యే పరిస్థితి లేదు. అందుకే అక్టోబరులో నీరిస్తామని హెచ్చెల్సీ అధికారులు ప్రకటించారు. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.