నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో జగన్ కు ఇక్కట్లేనా
విజయవాడ,
ఏపీ ముఖ్యమంత్రిగా వైెఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇంగ్లీష్ మీడియం ఒకటి. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇంగ్లీష్ విద్యకు దూరమవ్వడం వల్లనే భవిష్యత్ లో రాణించలేకపోతున్నారని భావించిన జగన్ కింది స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టేందుకు రెడీ అయ్యారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. మాతృభాషను జగన్ అణగదొక్కుతున్నారని విమర్శించాయి. న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాయి.ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది. మాతృభాషను కొనసాగించాలని కోరింది. అయితే దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తీర్పు రావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను కూడా నిర్వహించింది. సర్వేలోనూ ఎక్కువ శాతం మంది ప్రజలు ఇంగ్లీష్ మీడియంను కోరుకున్నారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాధమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానంతో జగన్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంను అమలు చేసే అవకాశం లేదు. ఐదో తరగతి వరకూ ప్రతి రాష్ట్రంలో మాతృభాషలోనే విద్యాబోధన జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. వీలైతే ఎనిమిదో తరగతి వరకూ విద్యాబోధన చేయాలని బిల్లులో పేర్కొంది. జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేపెట్టడానికి రెడీ అవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇబ్బంది కాక తప్పదు.
జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఆగస్టు 1 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. సెప్టంబరులో తరగతులు నిర్వహించాలని భావిస్తుంది. ఈనేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కాదని ముందుకు వెళ్లే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఐదో తరగతి వరకూ మాతృభాషలోనే విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి. మరి ఏం జరుగుతుందో చూడాలి.