గిట్టుబాటు రాని సమయంలో మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లు
గుంటూరు,
కేజీ నిమ్మకాయల ధర రూ.2కు పడిపోయింది. రైతుకు కనీసం కోత ఖర్చులు కూడా రాని దుస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణమే మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించారు. కొనుగోళ్లలో జోక్యం చేసుకుని రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో మార్కెటింగ్ శాఖ నిమ్మకాయల కొనుగోలు చేపట్టింది. దీంతో కిలో రూ.2 ఉన్న నిమ్మ ధర ఇప్పుడు రూ.40కి పెరిగింది. దీంతో నిమ్మ రైతులకు మేలు కలుగుతోంది. నిమ్మ మార్కెట్‌లో తాజా పరిస్థితి ఎలా ఉందనే దానిపై సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్నతో సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్షించారు. మార్కెట్లలో తాజా పరిస్థితులు, నిమ్మ ధరలు ఎంతవరకు పెరిగాయి, పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్ల స్థితిగతులేమిటనే అంశాలపై సీఎం ఆరా తీశారు. పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్లు మూతపడటంతో నిమ్మ ఎగుమతులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా నిమ్మకాయల ధరలు పడిపోయాయి. ఏపీలోని ప్రధాన మార్కెటైన ఏలూరులో ఈ నెల 24న కేజీ ధర రూ.2కు పడిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.నిమ్మ మార్కెట్లలో జో క్యం చేసుకున్న అధికారులు ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు జరిపారు. మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యు మ్న బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి అక్కడి మార్కెట్లు తెరుచుకునేలా చూశారు. అక్కడి మార్కెట్లకు ఎగుమతులు మొదలు కావడంతో నిమ్మ ధరలు తిరిగి పుంజుకున్నాయి.
గత శుక్రవారం ఏలూరు మార్కెట్‌లో కిలో నిమ్మకాయల ధర కనిష్టం రూ.2 నుంచి గరిష్టంగా రూ.5 వరకు పలకగా.. మార్కెటింగ్ శాఖ జోక్యంతో ఏలూరుతో పాటు, దెందులూరు మార్కెట్‌లో శనివారం కిలో ధర గరిష్టంగా రూ.9 పలికింది. ఏలూరు మార్కెట్‌లో సోమవారం కిలో కాయలను రూ.40 వరకు కొనుగోలు చేశారు. దెందులూరు మార్కెట్‌లోనూ కిలో రూ.30, ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న గూడూరు మార్కెట్‌లో రూ.11.50 వరకు కొనుగోలు చేశారు.సీఎం జగన్ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ అధికారులు గత శనివారం నుంచే నిమ్మ మార్కెట్‌లో కొనుగోళ్లు మొదలు పెట్టారు. కేజీ కాయల కనీస ధర రూ.9గా నిర్ణయించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఏలూరు మార్కెట్‌లో కొనుగోళ్లు చేపట్టడంతో ధరల్లో భారీ పెరుగుదల కొనసాగుతోంది. 2.1 టన్నుల నిమ్మకాయలను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసింది. ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధి నుంచి సొమ్మును వెచ్చించింది. పంటలకు కనీస గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులను ఆదుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. ధరలు పతనమైనప్పుడల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు రంగంలోకి దిగి మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ప్రైస్ స్కీమ్ (ఎంఐఎస్) కింద మార్కెట్ల లో ప్రభుత్వం తరఫున జోక్యం చేసు కుని ధరల స్థిరీకరణ నిధిని వినియోగించి కొనుగోళ్లు జరుపుతున్నారు. తాజాగా అదే విధానంలో పెద్ద ఎత్తున నిమ్మకాయల్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఆ రైతులకు కొండంత అండగా నిలబడింది. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మన రాష్ట్రంలో పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ఏ పంటకైనా కనీస గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులను రంగంలోకి దించి ఆ పంటలను మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేయిస్తున్నారు. అరటి, బత్తాయి, ఉల్లి, టమాటాలు ప్రభుత్వమే కొనుగోలు చేయటం వల్ల పోటీతత్వం పెరిగి రైతులకు కనీన గిట్టుబాటు ధర లభించింది.