ఇక మంచినీటి కష్టాలు లేనట్టే
హైద్రాబాద్,
గ్రేటర్ ప్రజలను దాహార్తి తీర్చే జలమండలి ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్న గ్రామాలకు సంబంధించిన రిజర్వాయర్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువుకంటే ముందే ప్రజలకు జలాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటివరకు వర్షాలు సరిపడా కురవకున్న వాటర్‌బోర్డు అధికారులు 464 ఎంజిడి నీరు సరఫరా చేస్తూ ప్రజలకు నీటి సమస్య ప్రశ్న తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కృష్ణా నుంచి 272, గోదావరి ఎల్లంపల్లి నుంచి 170 ఎంజిలు, ఉస్మాన్, హిమయాత్‌సాగర్ నుంచి నీటిని క్రమం తప్పకుండా అందిస్తున్నారు. పట్టణ ప్రాంతం కాకుండా శివారు ప్రాంతాల్లోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు నీరందించేందుకు జలమండలి ముందుకు వచ్చి పలు చోట్ల రిజర్వాయర్ల ఏర్పాటుకు ప్రణాళికలు వేసి, వెంటనే నిర్మాణాలు చేపట్టింది. ప్రాజెక్టులో భాగంగా 164 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటివరకు 140 రిజర్వాయర్ల పూర్తి చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి 183 గ్రామాలు, 7 మున్సిపాలిటీలు నీరు అందించేందుకు రూ. 748 కోట్లలో రిజర్వాయర్లు నిర్మిస్తోందివాటర్ బోర్డు పరిధిలోకి రాకముందు సగటు వ్యక్తికి రోజుకు 70లీటర్ల నీరు సరఫరా చేసే వారు ఈ రిజర్వాయర్లు ప్రారంభిస్తే ఒక వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీటి సరఫరా చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. నగర చుట్టు 2400కిమీ మేర పైపులైన్లు వేసి వాటి ద్వారా కలుషిత నీరు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన నీరు అందించనున్నారు. మొత్తంలో ఓఆర్‌ఆర్ పరిధిలో 10 మండలాలున్నాయి ఘట్‌కేసర్, సరూర్‌నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, రాజేంద్రనగర్, కుత్బులాపూర్, కీసర, శామీర్‌పేట, రామచంద్రపురం మండలాల పరిధిలో నిర్మిస్తోంది. కీసర మండలంలో 14 రిజర్వాయర్లకు 10 రిజర్వాయర్లు పూర్తి చేశారు. శామీర్‌పేటలో 14 రిజర్వాయర్లకు 6 పూర్తి చేశారు. ఘట్‌కేసర్ మండల పరిధిలో 29 రిజర్వాయర్లకు 26 రిజర్వాయర్లు పూర్తి, కుత్బులాపూర్ 09, రాజేంద్రనగర్ 09, మహేశ్వరం 3, ఇబ్రహీంపట్నం 02, హయత్‌నగర్ 21, సరూర్‌నగర్ 04, రామచంద్రపురం 08 పూర్తి చేసిన ప్రజలకు నీరందిస్తున్నారు. మిగిలిన ప్రాజెక్టులు కూడా ఈనెల చివరినాటికి పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.శివారు మున్సిపాలిటీ ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు రూ. 1900 కోట్ల హాడ్కో రుణంతో జలమండలి మంచినీటి పథకం ప్రారంభించింది. ఈప్రాజెక్టులో భాగంగా 7 మున్సిపాలిటీ పనులు చేపట్టి కూకట్‌పల్లి మున్సిపాలిటీలో 07 రిజర్వాయర్లు, కుత్బులాపూర్ 06, అల్వాల్ 03, కాప్రా 07, ఉప్పల్ 04, ఎల్‌బినగర్ 10, శేరిలింగంపల్లి 15 రిజర్వాయర్లతో పాటు ప్రపంచ బ్యాంకు నిధులతో మల్కాజిగిరి ప్రాంతంలో మంచినీటి వ్యవస్ద మెరుగుపరిచేందుకు 09 రిజర్వాయర్లు నిర్మించి ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేసింది.