రామాలయానికి మద్దతుగా పూజలు చేయాలని పిలుపు
న్యూఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. కొద్ది రోజులుగా వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్న ఆయన.. తాజాగా అయోధ్య రామ మందిరానికి సంబంధించి లేఖలో ప్రస్తావించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీ ఆగష్టు 5న చేస్తున్న భూమి పూజ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయని.. ప్రజలు చిరకాల వాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం అన్నారు. అలాగే మరికొన్ని కీలక అంశాలను రఘురామ కృష్ణరాజు తన లేఖలో ప్రస్తావించారు.ఆగష్టు 5న అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రమం రోజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం నిర్వహించాలన్నారు ఎంపీ. భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీ ఆద్వర్యంలో నడుస్తున్న ఎస్వీబీసీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి అన్నారు.ఇటీవల కూడా రఘురామ ఓ లేఖ రాశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు నిర్వహిస్తే బావుంటుందని సలహా ఇచ్చారు. అంతేకాదు పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో మంచిదన్నారు. తెలుగు ప్రజల్లో ప్రేమ, గౌరవం పెరుగుతాయన్నారు. 2004లో పీవీ మరణించాక ఆయనకు అంత్యక్రియలు నిర్వహించిన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ప్రాంతాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పీవీ ఘాట్ గా నామకరణం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ భుత్వం పీవీ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్న విషయాన్ని రఘురామ గుర్తు చేశారు.