YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ఆచితూచి అడుగులు

జగన్ ఆచితూచి అడుగులు

జగన్ ఆచితూచి అడుగులు
విజయవాడ, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిందా ? 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ఏదైనా చేయాలనుకుంటే కుదరదని తత్వం బోధపడిందా ?  ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు పాలకుడిగా ఉన్నప్పుడు కూడా ఓపిక ఉండాలనేది అర్థమయ్యిందా ? మొండితనంతో కాకుండా ముందుచూపుతో వ్యవహరించాలని ఇప్పటికైనా తెలిసొచ్చిందా ? ఈ  ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అవును అని జగన్ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న వెనకడుగులు చెబుతున్నాయి. తాజాగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా 
తిరిగి పునర్నియమిస్తూ అర్థరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నిజానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు అనధికారికంగా అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి ఇది తాము జగన్ ప్రభుత్వంపై  సాధించిన విజయంగా అనిపించవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇది ఓటమిగా తోచవచ్చు. అయితే, ఇక్కడ అన్నింటి కంటే ముఖ్యంగా కనిపిస్తోంది జగన్ ప్రభుత్వం వెనకడుగు. ప్రజాక్షేత్రంలో  గెలిచి వస్తే ఐదేళ్ల పాటు ఏ నిర్ణయమైనా మొండిగా తీసుకోవచ్చని నియతృత్వ ధోరణి చెల్లదని జగన్కు తెలిసేలా చేసిన సంఘటన ఇది. న్యాయ వ్యవస్థతో పెట్టుకోవడం తనకు, తన ప్రభుత్వానికి అంత  మంచిది కాదనే విషయాన్ని జగన్ గ్రహించినట్లున్నారు.కేవలం నిమ్మగడ్డ వ్యవహారంలోనే కాదు చాలా విషయాల్లో ఇటీవల జగన్ వెనకడుగు వేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయంపై తానే పునరాలోచించుకుంటున్నారు. మొదటగా పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయించే విషయంలో ఇదే జరిగింది. గత టీడీపీ పాలకుల అడుగుజాడల్లో ప్రభుత్వ ఆస్తులన్నింటికీ తమ పార్టీ  రంగులు వేయించాలని వైసీపీ భావించింది. ఇది చాలా రోజులుగా ప్రభుత్వాలు పాటిస్తున్న ఒక సంప్రదాయంగా మారింది. కానీ, ఈ విషయంలో జగన్ ప్రభుత్వంపై కొందరు కోర్టులకు ఎక్కారు. హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.సుప్రీం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము వేయించిన తమ పార్టీ రంగులను తమ ప్రభుత్వమే తొలగించాలని జగన్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లీష్ మీడియం వ్యవహారంలోనూ ఇలానే జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని జగన్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. కోర్టుల్లో, బయట ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొదట చెప్పినట్లుగా కాకుండా ఒక్కో తరగతిని ఇంగ్లీష్ మీడియం నుంచి మినహాయిస్తూ వెళుతోంది.శాసనమండలి రద్దు వ్యవహారంలోనూ సిఎం జగన్ భారీ యూటర్న్ తీసుకున్నారు. మండలిలో తెలుగుదేశం పార్టీకి 2021 చివరి నాటికి మెజారిటీ ఉంటుంది. ఆ తర్వాత వైసీపీకి మెజారిటీ వస్తుంది. మండలిలో తమకున్న మెజారిటీతో వైసీపీ ప్రభుత్వం తెస్తున్న బిల్లులను టీడీపీ కొంతకాలం పాటు నిలువరించే ప్రయత్నం చేస్తోంది. బిల్లులను ఆలస్యం చేస్తోంది. ఈ వ్యవహారం డీల్ చేయడానికి ప్రభుత్వానికి కొంచెం ఓపిక, సహనం అవసరం. కానీ, శాసనమండలినే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడువుగా అసెంబ్లీలో తీర్మాణం చేసి పార్లమెంటుకు పంపించారు.ఈ సమయంలో మండలి అనేది పెద్ద వృథా అన్నట్లుగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటనలు చేసింది. అయితే, ఇప్పుడప్పుడే పార్లమెంటులో ఈ నిర్ణయానికి ఆమోదం లభించే అవకాశాలు కనిపించడం లేదు. పార్లమెంటులో ఈ తీర్మానం ఆమోదం పొందితే తప్ప ఏపీలో శాసనమండలి రద్దు కాదు. ఇంతలోపు క్రమంగా వైసీపీకి ఎమ్మెల్సీల సంఖ్య పెరుగుతోంది. దీంతో శాసనమండలి రద్దు నిర్ణయాన్ని ఇప్పుడు ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోవడం లేదు. నిజానికి వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది. పార్లమెంటుకు పంపించిన తీర్మాణం కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్లిపోయింది. నిజానికి వైసీపీకి శాసనమండలి అవసరం. చాలా మంది నేతలను ఎమ్మెల్సీలను చేస్తానని జగన్ హామీలు ఇచ్చారు.ఈ హామీలను నెరవేర్చ డానికి శాసనమండలి జగన్కు రాజకీయంగా చాలా అవసరం. అయితే తొందరపాటుతో మండలి రద్దుకు తీసుకున్న నిర్ణయంపై జగన్ ఇప్పుడు అన్నీ ఆలోచించిన తర్వాత వెనకడుగు వేశారు. ఇలా పలు విషయాల్లో ఆవేశంలో నేల విడిచి సాము చేసిన జగన్కు ఇప్పుడు వాస్తవ పరిస్థితులు అవగతమవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో వ్యవస్థలను ధిక్కరించే పని పెట్టుకోకుండా తానే ఒకడుగు తగ్గుతున్నారు.నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో సరిగ్గా ఇదే జరిగింది. సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి రాకముందే జగన్ వెనకడుగు వేసి నిమ్మగడ్డను పునర్నియమించారు. మొత్తంగా మన రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాతీర్పు, ప్రభుత్వ నిర్ణయాలే ఫైనల్ కాదనేది జగన్ గ్రహించారనే అర్థం చేసుకోవచ్చు.

Related Posts