విజయవాడ, ఆగస్టు 3,
బాబు అంటే బాబోయి అని బీజేపీ అంటోందా. అంతేగా మరి. చంద్రబాబుని ఇకపైన దరిచేర్చనీయవద్దని బీజేపీ గట్టిగానే శపధం చేసినట్లు ఉంది. లేకపోతే బాబుకు బాకాగా మారాడన్న వాదనను నమ్మే కదా కన్నా లక్ష్మీనారాయణ కిరీటం ఊడబెరికింది. ఇక బీజేపీలో కూడా మరో బాబు ఉన్నారు. ఆయన అయిదేళ్ల పాటు ఏపీ బీజేపీకి ప్రెసిడెంట్ గా వ్యవహరించిన కంభంపాటి హరిబాబు. ఆయన స్వతహగా మృదు స్వభావి. అయితే ఆయన చంద్రబాబుకు అతి సన్నిహితుడు అన్న ముద్రతోనే తన అధ్యక్ష పదవి కోల్పోయారు. ఇపుడు ఆయన చాయిస్ గా విశాఖకు చెందిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఉన్నారు. అదే మాధవ్ చేతికి ఏపీ బీజేపీ పగ్గాలు దక్కకుండా చేసిందా అన్న చర్చ బీజేపీలో జరుగుతోంది.జనసంఘ్ బీజేపీగా రూపాంతరం చెందాక జాతీయ స్థాయిలో తొలి అధ్యక్షుడిగా వాజ్ పేయి నియమితుడైతే ఉమ్మడి ఏపీకి మొదటి బీజేపీ ప్రెసిడెంట్ గా పీవీ చలపతిరావు వ్యవహరించారు. నాడు ఆయన వద్ద శిష్యులుగా వెంకయ్యనాయుడు, హరిబాబు ఉండేవారు. తరువాత కాలంలో వెంకయ్యనాయుడు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన అనుచరుడిగా హరిబాబు ఉంటూ వచ్చారు. ఇక పీవీ చలపతిరావు తెరవెనక్కువెళ్ళిపోయారు. అలా నాడు వెంకయ్యనాయుడు, హరిబాబు ఏపీలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు సొంత పార్టీలోనే ఉన్నాయి.ఇక మూడేళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ చలపతిరావు కుమారుడు పీవీఎన్ మాధవ్ విజయానికి నాడు కేంద్ర మంత్రి హోదాలో వెంకయ్యనాయుడు ఎంతో క్రుషి చేశారు. అసలు మాధవ్ కి టికెట్ రావడం వెనకనే కాదు, టీడీపీ మద్దతు సాధించడం వీటన్నిటి వెనక వెంకయ్యనాయుడు ఉన్నారు. మొత్తానికి అంతదాకా బీజీపీలో ఎడముఖం, పెడముఖంగా ఉన్న పీవీ, వెంకయ్యనాయుడు మాధవ్ వ్యవహారంలో కలిశారని అంటారు. ఆ తరువాత మాధవ్ హరిబాబు కోటరీలోకి వెళ్లారని పార్టీలోని రెండవ వర్గం ప్రచారం చేస్తూ వచ్చింది. దానికి తగినట్లుగానే బీజేపీలో యాంటీ చంద్రబాబు వర్గంగా కొనసాగుతోంది.ఇక మాధవ్ కి బీజేపీ కిరీటం ఖాయమని నిన్నటిదాకా వినిపించింది. యువకుడు, విధ్యాధికుడు. బీసీ వర్గాలకు చెందిన మాధవ్ కొత్త ప్రెసిడెంట్ అనుకున్నారు. విశాఖకు రాజధాని రావడం ఖాయమైన వేళ ఉత్తరాంధ్ర నిండా బీసీలు ఉన్న వేళ అన్ని విధాలుగా మాధవ్ సరైన అధ్యక్ష్య అభ్యర్ధి అని భావించారు. పైగా యువ ముఖ్యమంత్రి జగన్ని ఎదుర్కోవడానికి మాధవ్ సమర్ధుడు అని కూడా అన్నారు. అయితే ఆయన వెనక మద్దతుగా హరిబాబు ఉన్నారని ప్రచారం జరగడం, అదే సమయంలో మాధవ్ ని కనుక నియమిస్తే మళ్లీ ప్రో టీడీపీ గా బీజేపీ వాయిస్ ఉంటుందేమోనన్న అనుమానాలు పెద్దలకు కలిగాయని అంటున్నారు. అందువల్ల దూకుడు గా ఉండడమే కాకుండా బాబు అంటే ఇంతెత్తున లేచి ఎగిరే సోము వీర్రాజుకే చివరి నిముషంలో బీజేపీ పగ్గాలు దక్కాయని అంటున్నారు. దీనిని బట్టి బీజేపీ ప్రెసిడెంట్ పదవి ఆశించేవారు అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు పచ్చి వ్యతిరేక వాదం ఎవరు బలంగా వినిపిస్తారో వారే కమల సారధి అవుతారని. మరి దాన్ని బట్టి ఏపీ రాజకీయాల్లో మొదటి శత్రువు, రెండవ శత్రువు అని విభజించుకుని ఇకపైన బీజేపీ నేతలు విమర్శలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఎంతో భవిష్యత్తు ఉంది కాబట్టి మాధవ్ కి మరో చాన్స్ వస్తుందనే అంటున్నారు.