YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజీనామా దిశగా టీడీపీ అడుగులు...

రాజీనామా దిశగా టీడీపీ అడుగులు...

విజయవాడ, ఆగస్టు 3
మ‌రోసారి తెలంగాణ ఉద్యమం ఏపీలో తెర‌మీదికి వ‌చ్చింది. నాడు.. తెలంగాణ సాధ‌న కోసం అప్పటి టీఆర్ఎస్ అధినేత ‌(ప్రస్తుత సీఎం)గా కేసీఆర్ త‌న‌కు ఉన్న అన్ని ప‌ద‌వుల‌కు అనేక‌సార్లు రాజీనామా చేశారు. తిరిగి ప్రజ‌ల‌లోకి వెళ్లి గెలుపుగుర్రం ఎక్కారు. త‌ద్వారా రాష్ట్ర ప్రజ‌లు తెలంగాణ కోరుకుంటున్నార‌నే వాద‌న‌ను ఢిల్లీ వ‌ర‌కు బ‌లంగా వినిపించారు. ఇది ఆయ‌న‌కు అన్ని విధాలా క‌లిసి వ‌చ్చింది. గ‌ల్లీ నుంచి డిల్లీ వ‌ర‌కు కూడా తెలంగాణ సెంటిమెంటును మోసుకువెళ్లింది. ఇక‌, ఇప్పుడు ఈ ఫార్ములానే ఏపీలో టీడీపీ అధినేత‌గా ఉన్న ప్రతిప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం చంద్రబాబు ప్రయోగించ‌నున్నార‌ని సోష‌ల్ మీడియాలోవార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ప్రస్తుతం జ‌గ‌న్ స‌ర్కారు.. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ‌రావ‌తిని ప‌క్కన పెట్టారు. మూడు రాజ‌ధానుల ప్రతిపాద‌నను తెర‌మీదికి తీసుకురావ‌డంతో పాటు ఎన్ని ఉద్యమాలు జ‌రిగినా.. ఆందోళ‌న‌లు జ‌రిగినా.. జ‌గ‌న్ వెన‌క్కి మ‌ళ్లలేదు. గ‌త ఐదారు నెలలుగా పెద్ద స‌స్పెన్స్‌గా న‌డుస్తోన్న ఈ వ్యవ‌హారంలో జ‌గ‌న్ తాను అనుకున్నదే చేసేలా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే మూడు రాజ‌ధానుల బిల్లుకు గ‌వ‌ర్నర్ కూడా ఆమోదం తెలిపారు. దీంతో నిన్నమొన్నటి వ‌ర‌కు కూడా చంద్రబాబు స‌హా అమ‌రావ‌తి రైతులు పెట్టుకున్న ఆశ‌లు దాదాపుగా నీట క‌లిసాయి. ఈ ప‌రిణామాల‌ను చూస్తూ.. ఊరుకుంటే.. చంద్రబాబు ప్రతిష్టకు… పార్టీ ప‌రువుకు కూడా ప్రమాదం పొంచి ఉంద‌నే భావ‌న చ‌ర్చకు వ‌స్తోంది.ఇప్పటికే పార్టీ చరిత్రలోనే అత్యంత ద‌య‌నీయ స్థితిలో ఉండ‌డంతో పార్టీ త‌ర‌పున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌ను కూడా కాపాడుకోవ‌డం చంద్రబాబుకు చాలా క‌ష్టం అయిపోతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అనే చంద్రబాబు కేవ‌లం ప‌దేళ్ల రాజ‌కీయ అనుభ‌వం కూడా లేని జ‌గ‌న్ ను రాజ‌ధాని విష‌యంలో క‌ట్టడి చేయ‌లేక‌పోవ‌డం, లేదా రాజ్యాంగ బ‌ద్ధంగా లేదా శాస‌న బ‌ద్ధంగానైనా జ‌గ‌న్‌ను నిలువ‌రించ‌లేక పోవ‌డం వంటివి చంద్రబాబు సీనియార్టీకే మాయ‌ని మ‌చ్చగా మారుతుంద‌నడంలో సందేహం లేదు. ఈ ప‌రిణామాల‌ను చూస్తూ ఊరుకుంటే..రేపు చంద్రబాబుకు త‌న పార్టీలోనే విలువ లేకుండా పోయే ప్రమాదం కూడా పొంచి ఉంద‌న్న చ‌ర్చలు కూడా న‌డుస్తున్నాయి.ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నించిన చంద్రబాబు ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన ఉద్యమాల‌ను ప‌క్కన పెట్టి.. ఇప్పుడు .. త‌నకున్న 23 మంది ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించి.. ప్రజ‌ల్లోనే రాజ‌ధాని విష‌యంపై తేల్చుకునేందుకు సిద్ధప‌డుతున్నార‌నేది సోష‌ల్ మీడియా స‌మాచారం. మ‌రి ఇదే జ‌రిగితే.. చంద్రబాబుకు క‌లిసి వ‌చ్చే ఎమ్మెల్యేలు ఎంద‌రు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న. కానీ, దీనికి మించి చంద్రబాబు ముందున్న వ్యూహం మ‌రేమీ క‌నిపించ‌డం లేదు. అయితే నాడు తెలంగాణ‌లో బ‌ల‌మైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉండ‌డంతో కేవ‌లం కేసీఆర్ మాత్రమే కాదు.. ఏ పార్టీ నుంచి అయినా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోటీ చేసినా గెలిచారు.ఇప్పుడు టీడీపీకి ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో ఉత్తరాంధ్రలోనే ఆరుగురు ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి గంటాతో పాటు మ‌రో ఒక‌రిద్దరు పార్టీ మారిపోనున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఇక మిగిలిన వారు కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తారా ? రాజీనామా చేసినా వీరిలో ప్రాంతాల వారీగా ఎంద‌రు గెలుస్తారు ? వైజాగ్ రాజ‌ధానికి వ్యతిరేక‌మ‌న్న టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు గెలుస్తారా ? మ‌రి ఈ సంక‌ట స్థితిలో చంద్రబాబు ఈ సాహ‌సం చేస్తారా ? లేదా ? అన్నది చూడాలి.

Related Posts