గుంటూరు, ఆగస్టు 3,
గుంటూరుకు చెందిన హోం మంత్రి సుచరితకు ముందు వెనుక కష్టకాలం ఎదురవుతోందా ? జిల్లాలోనే కాకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె వివాదాస్పదం అవుతున్నారా ? ప‌్రధాన ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వలేక పోతున్నారా ? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరితకు సీఎం జగన్ ఏకంగా హోం శాఖ పగ్గాలు అప్పగించారు. అయితే, ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు జాతీయస్థాయిలో విమర్శలకు దారితీస్తోంది.ప్రజలను ఉత్తిపుణ్యానికే బాదేస్తున్నారని, స్టేషన్ల చుట్టూ తిప్పి.. వారిని నరకం ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారని.. పోలీసులపై జాతీయస్థాయిలోనే కథనాలు వస్తున్నాయి. తాజాగా జరిగిన ప్రకాశం జిల్లా ఘటన దీనికి ఊతం ఇస్తోంది. మాస్క్ పెట్టుకోలేదనే కారణంగా ఓయుకుడిని పోలీసులు కొట్టడం, ఆయన ఆసుపత్రిలో మృతి చెందడం వంటివి దేశవ్యాప్తంగా తమిళనాడులో జరిగిన తండ్రీ కొడుకుల ఘటనను మరోసారి తెరమీదికి తెచ్చినట్టయింది. ఇక, తూర్పుగోదావరిలో ఎస్సీ వర్గానికే చెందిన ఓ యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి.. శిరోముండనం చేయించిన ఘటన మరింత దారుణంగా తయారైంది. దీనిపై జాతీయ మానవహక్కుల సంఘం తీవ్రంగా స్పందించిందిఈ పరిణామాలు ఇలా జరుగుతున్నా.. ఈ శాఖకు మంత్రిగా ఉన్న సుచరిత మాత్రం మౌనం పాటిస్తున్నారు. ఏమీ మాట్లాడడం లేదు. ఇక, డీజీపీ సవాంగ్ పోలీసులకు వత్తాసు పలుకుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు కూడా మంత్రి సుచరితను టార్గెట్ చేశాయి. ఇవన్నీ ఒక వైపు.. మరోవైపు తన సొంత జిల్లా గుంటూరులోనే మంత్రిగారికి ప్రాధాన్యం లేకుండా పోవడం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ సీపీకే చెందిన మరో నేత వేలుపెడుతున్నారని… అదేవిధంగా ఆయన కనుసన్నల్లోనే ఇక్కడి కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు.ఇటీవల జరిగిన పరిణామాలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రిగా సుచరితకు డౌన్ ట్రెండ్ ప్రారంభమైందనే వ్యాఖ్యలు సర్వత్రా విస్మయానికి గురి చేస్తున్నాయి. దూకుడు లేకపోయినా.. ఫర్వాలేదు.. అసలు పాలనపైనే పట్టుకోల్పోయే పరిస్థితి వచ్చిందనేది పలువురి మాట. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది అదే. హోంశాఖపై నిజానికి ఎప్పుడూ విమర్శలు కామనే అని సరిపెట్టుకునే కన్నా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టి.. సరిదిద్దాల్సిన అవసరం మంత్రి సుచరితకు తక్షణ కర్తవ్యమని వైఎస్సార్ సీపీ నేతలే చెబుతుండడం గమనార్హం. అలాగే రాష్ట్ర స్థాయిలో కీలకమైన హోం శాఖకు మంత్రిగా ఉన్న సుచరిత చివరకు జిల్లా స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోతోన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి.