విజయవాడ, ఆగస్టు 3,
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించింది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీంతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రాజధాని వ్యవహారం మళ్లీ రాష్ట్రంలో రాజకీయ చిచ్చుకు కారణమైంది. ఒకవైపు మూడు రాజధానులను స్వాగతిస్తున్న వారి సంబరాలు, అమరావతి మాత్రమే రాజధాని కావాలంటున్న వారి నిరసనలు మరోవైపు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న పార్టీల నెక్ట్స్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అమరావతి అనేది చంద్రబాబు నాయుడుకు డ్రీమ్ ప్రాజెక్ట్. అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మించాలని ఆయన కలలు గన్నారు. అమరావతికి ల్యాండ్ పూలింగ్ చేయడంలోనూ చంద్రబాబుదే ప్రధాన పాత్ర. హైదరాబాద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేసినట్లుగానే అమరావతిని కూడా ఆయన అభివృద్ధి చేయగలరని అమరావతి ప్రాంత రైతులు నమ్మారు. నమ్మని వారిని నమ్మించారు. రాజధాని వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తాము బాగుపడతామని భావించిన రైతులు మూడు పంటలు పండే భూములను అమరావతి కోసం ప్రభుత్వానికి అప్పగించారు.అయితే, చంద్రబాబు నాయుడు హయాంలో గ్రాఫిక్స్, తాత్కాలిక భవనాలతోనే కాలం గడిచిపోయింది. శాశ్వత భవనాల నిర్మాణం జరగలేదు. నిజానికి, ఆకాశానికి నిచ్చెన వేయకుండా, అంతర్జాతీయ నగరం అని చెప్పకుండా రాజధాని నగర నిర్మాణం పూర్తి చేసి ఉంటే ఇప్పుడు రాజధానిని మార్చే పరిస్థితి ఉండకపోయేదేమో. కానీ, అలా జరగలేదు. దీంతో అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానుల ఆలోచన చేశారు. నిజానికి అమరావతి కూడా రాజధానిగా ఉంటుందని చెబుతున్నా, కార్యనిర్వాహక రాజధానిగా ఉన్న విశాఖపట్నమే ప్రధానంగా ఉండబోతోంది. అమరావతిలో కేవలం చట్టసభలు మాత్రమే ఉండబోతున్నాయి.మూడు రాజధానుల వల్ల చంద్రబాబు చెప్పినట్లుగా అమరావతి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందనే భావన అమరావతి రైతుల్లో లేదు. అందుకే వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 230 రోజులుగా వారంతా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నిలుస్తోంది. నిజానికి మూడు రాజధానులను వ్యతిరేకించి, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న టీడీపీ ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీ ప్రయోజనాలను కూడా ఫణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉంది. అమరావతిని రాజధానిగా కాపాడుకునేందుకు ఉద్యమానికి సిద్ధమని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.అయితే, ఒకవైపు హైకోర్టులో ఈ వ్యవహారం కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఉద్యమం నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. చివరి అస్త్రంగా తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రజలంతా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని చంద్రబాబు అంటున్నారు.వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రెఫరెండంగా ఎన్నికలకు రావాలని బాబు డిమాండ్ చేస్తున్నారు. ఇది జరిగే పని కాదు. అయితే, చంద్రబాబు అంటున్నట్లుగా ప్రజలంతా అమరావతికే అనుకూలంగా ఉంటే, అమరావతి సెంటిమెంట్ బలంగా ఉంటే టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి మళ్లీ గెలిచి ఈ విషయాన్ని నిరూపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ అనేకసార్లు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. ఉద్యమాన్ని ఎప్పుడూ వేడి మీద ఉంచేందుకు, ప్రజల్లో ఉన్న తెలంగాణ ఆకాంక్షను నిరూపించడానికి తాను, తన పార్టీ ఎమ్మెల్యేలు అనేకసార్లు రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ప్రజల డిమాండ్ అని నిరూపించారు. కేసీఆర్ తెలంగాణ సాధించడంలో ఈ రాజీనామాలు, ఉప ఎన్నికలు ప్రధాన పాత్ర పోషించాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా తన పార్టీ ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, అమరావతి సెంటిమెంట్‌ను నిరూపించాలని వైసీపీ రెచ్చగొడుతోంది.
కాగా, మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తున్న కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బీటెక్ రవి రాజీనామా చేశారు. మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయాలనే చర్చ పార్టీలోనూ కొందరు తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజీనామాలు చేసే అంత ధైర్యం చంద్రబాబు చేస్తారా అనేది ప్రశ్నగా మారింది.టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురు పార్టీ వీడారు. మరికొందరు కూడా వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు అమరావతికి మద్దతుగా రాజీనామా చేస్తే మళ్లీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా టీడీపీని మరింత దెబ్బ తీసేందుకే దమ్ముంటే అమరావతికి మద్దతుగా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయండి అని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మరి, చంద్రబాబు అంత ధైర్యం చేస్తారా అనేది చూడాలి.