YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మండల వ్యవస్థ రద్దు దిశగా అడుగులు..?

మండల వ్యవస్థ రద్దు దిశగా అడుగులు..?

నెల్లూరు, ఆగస్టు 4, 
ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ మ‌రిన్ని చిక్కుల్లో ప‌డ‌నుందా ? వాటం చూసుకుని మ‌రీ వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ దెబ్బేస్తున్నారా ? అంటే.. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నవారు ఔన‌నే అంటున్నారు. టీడీపీకి జీవ‌నాడి అంటూ.. చెప్పాల్సి వ‌స్తే.. మండ‌ల వ్యవ‌స్థ! టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు నంద‌మూరి తార‌క‌రామారావు.. అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్లలో క‌ర‌ణాల వ్యవ‌స్థను తీసేసి మండ‌ల వ్యవ‌స్థను తీసుకువ‌చ్చారు. దీనిపై అప్పట్లో కొంద‌రు వ్యతిరేకించి.. విమ‌ర్శలు చేశారు. ఆయ‌న‌కు వ్యతిరేకంగా మండ‌లాధీసుడు అంటూ సినిమాలు కూడా తీశారు. అయిన‌ప్పటికీ.. ఎన్టీఆర్ వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు సాగారు. ఈ మండ‌ల వ్యవ‌స్థ బాగా పుంజుకుంది ఇప్పుడు అమ‌ల్లో ఉన్న మండ‌ల వ్యవ‌స్థ ఆనాటిదే.. ఎన్టీఆర్ తీసుకువ‌చ్చింది.అయితే, ఇప్పుడు ఇదే వ్యవ‌స్థపై జ‌గ‌న్ పెనుదెబ్బ వేస్తున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని, ఒక గిరిజన జిల్లా ఉంటుందని ఎన్నికల్లో వైసీపీ హామీ ఇచ్చింది. ఇది అమలు కావాలంటే ముందుగా గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్‌ల పునర్విభజన చేపట్టాల్సి ఉందని రెవెన్యూ శాఖ సర్కారుకు స్పష్టం చేసింది. అందుకు ప్రధానంగా కొన్ని కారణాలను చూపించింది. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆ మేరకు వాటిలోని మండలాలు కూడా విడిపోయాయి. వాటిని సమంగా డివిజన్‌లకు పంపిణీ చేయాలి. ఇది జరగాలంటే తొలుత మండలాలు, ఆపై డివిజన్‌ల పునర్విభజన చేపట్టాలి.రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్ లు ఉన్నాయి. కొత్తగా మరో 22 రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. పునర్విభజన ప్రభావం ఇప్పుడున్న 35 డివిజన్లపై తీవ్రంగా ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకున్నాక చివరగా 11 కొత్త రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న జిల్లాల్లో ప్రధాన కేంద్రం (హెడ్‌ క్వార్టర్‌) కొందరికి సుదూరంగా ఉందని… కొత్తగా ప్రతిపాదించే 9 జిల్లాల్లో కూడా ఈ సమస్య వస్తుందని రెవెన్యూశాఖ పేర్కొంది. కొత్త జిల్లా, డివిజన్‌, మండలాల ఏర్పాటులో ప్రధాన కేంద్రం మధ్యలో ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ఆ శాఖ స్పష్టం చేసింది. ఇక లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జిల్లాల‌ను విడ‌దీస్తే వ‌చ్చే స‌మ‌స్యల‌ను కూడా అధ్యయ‌నం చేసి ప్రజ‌ల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.ఇదే జ‌రిగితే టీడీపీ ఇప్పటి వ‌ర‌కు త‌మ‌కు క‌లిసి వ‌చ్చాయ‌ని భావిస్తున్న మండ‌లాల వ్యవ‌స్థ రూపు రేఖ‌లు స‌మూలంగా మారిపోనున్నాయి. ఇప్పటి వ‌ర‌కు ఎన్టీఆర్ చేసిన ఈ ప‌నిని చంద్రబాబు & టీడీపీ నేత‌లు ప‌దే ప‌దే త‌మ‌కు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ వ‌స్తున్నారు. మండ‌ల వ్యవ‌స్థతో ప‌రిపాల‌న ప్రజ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చార‌న్న మంచి పేరు టీడీపీకి ఉంది. ఇప్పుడు జ‌గ‌న్ మండ‌ల‌, రెవెన్యూ డివిజ‌న్లతో పాటు జిల్లాల‌ను విభ‌జిస్తే ప్రజ‌ల‌కు ప‌రిపాల‌న మ‌రింత అందుబాటులోకి రానుంది. ఇది టీడీపీకి పెను దెబ్బేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తెలంగాణ‌లో కేసీఆర్ మండ‌లాలు, రెవెన్యూ డివిజ‌న్లు, జిల్లాల పునర్విభ‌జ‌న‌తో చ‌రిత్రలో త‌న పేరు స‌రికొత్తగా లిఖించుకున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే రూట్లో వెళుతూ టీడీపీ పేరిట ఉన్న చరిత్రను చెరిపేసేలా క‌నిపిస్తున్నారు.

Related Posts