YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశం కుమ్ములాటలపై జగన్ ఫోకస్

ప్రకాశం కుమ్ములాటలపై జగన్ ఫోకస్

ఒంగోలు, ఆగస్టు 4, 
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు వైసీపీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశాలపై స్వయంగా సీఎం జగన్‌ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దర్శి, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందన్న అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ సీరియస్‌గా దృష్టి పెట్టారట. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారట. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ ఇన్‌చార్జ్‌ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిల ద్వారా విషయాలు తెలుసుకోవడమే గాక అధికారిక సమాచారం కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. ఇటు రాజకీయ అంశాలతోపాటు అటు శాంతిభద్రతల సమస్య కూడా మిళితం కావటంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.దర్శి, చీరాల నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉండటంతో పాటు దర్శిలో ఎమ్మెల్యే ఫ్లెక్సీల చించివేత, ప్రచారవాహనం ధ్వంసం లాంటి ఘటనలు జరిగాయి. చీరాలలో పోలీసు అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో ఇటు ఎమ్మెల్యే బలరాం, అటు మాజీ ఎమ్మెల్యే ఆమంచిల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరగ్గా పోలీసుల దాడిలో దళిత యువకుడు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.దీంతో అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారట. ప్రధానంగా దర్శిలో ఫ్లెక్సీల చించివేత ఘటన అనంతరం పార్టీలోని రెండు వర్గాలు బహిరంగ విమర్శలకు దిగాయి. మంత్రి హెచ్చరికతో విమర్శల హోరు తగ్గినా అంతర్లీనంగా వివిధరకాల ప్రచారాలు నియోజక వర్గంలోని వైసీపీ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి.ఫ్లెక్సీల ఘటనను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తే అంగీకరించబోనని, నిజాలు నిగ్గు తేల్చాలని సీఎంవో అధికారుల వద్ద డిమాండ్‌ చేశారని చెబుతున్నారు. దీంతో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విచారణలో జాప్యం నెలకొనడం, మధ్యలో వివిధ రకాల వదంతులు చోటుచేసుకోవటం మరింత గందరగోళానికి దారితీసింది.అలాగే పార్టీ ద్వితీయశ్రేణిని ఆర్థికంగా దెబ్బతీసేలా టెండర్ల విషయంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి జోక్యం చేసుకుంటున్నారని జగన్‌కు మద్దిశెట్టి ఫిర్యాదుచేశారు. రెండో వైపు బూచేపల్లి కూడా ఫ్లెక్సీల చించివేతలో తమ పాత్ర ఏమీ లేదని ఆ విషయంలో నిజాన్ని వెల్లడించేలా దర్యాప్తు జరగాలని పట్టుబడుతున్నారు. సీఎంవో అధికారులకు ఆయన అదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది.దర్శిలో అంతర్గత పోరు పార్టీకి నష్టం చేకూర్చుతోందని జగన్‌ భావిస్తున్నారట. గ్రూపు రాజకీయాల వల్ల కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే ఓ సీఐ బదిలీతో మొదలైన ఆధిపత్య పోరు ఏడాదిగా ఏదో ఒక విషయంలో కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గంలో బదిలీల నుంచి అభివృద్ధి ప్రాజెక్టుల సిఫారసు వరకు ఎమ్మెల్యేకే పూర్తి స్వేచ్ఛను జగన్ ఇచ్చారు. కానీ, అందుకు భిన్నంగా వీఆర్వో నుంచి ఉన్నత అధికారుల వరకు నేరుగా బూచెపల్లి సిఫారసు చేస్తున్నారట. దీనిపై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారు. అధిష్టానం ముందుకు వ్యవహారాన్ని తీసుకువెళ్లారట.ఆధిపత్య పోరు సాగుతున్న సమయంలోనే స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడి పుట్టిన రోజు సందర్భంగా దర్శిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ధ్వంసంతో మరోసారి వాతావరణం వేడెక్కింది. ప్లెక్సీలు ధ్వంసం చేయడం, వైసీపీ కార్యాలయంలోని ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో నెలకొన్న వివాదం ఇప్పుడు పెద్దదైంది.దీని వెనక బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి హస్తం ఉందని, కావాలనే ఆ పని చేయించారని ఎమ్మెల్యే వర్గం భావిస్తోంది. ఈ విషయంలో నిగ్గు తేల్చేందుకు డీఎస్పీతో పాటు నలుగురు సీఐలు, 12మంది ఎస్సైలు రంగంలోకి దిగారు. మరోవైపు ఇదంతా ఓ పిచ్చోడు చేసిన పనని, 17ప్లెక్సీలు చించాడని బూచేపల్లి వర్గంతో పాటు కిందిస్థాయి పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంతో రెండు వర్గాల విభేదాలు పార్టీ కార్యకర్తల్లో చీలికకు కారణమైందని అంటున్నారు.తాగు, సాగునీటి పనులకు చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌లోనూ ఇరు వర్గాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఇది కూడా ఇరు వర్గాల మధ్య పోటాపోటీకి కారణమైంది. ఇలా ప్రతి అంశంలోనూ ఇరు వర్గాలు పోటీపడుతున్నాయి. తమపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని బూచేపల్లి వర్గం అంటుంటే… ఆయన కారణంగానే నియోజకవర్గంలో పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని మద్దిశెట్టి వర్గీయులు అంటున్నారు. ఈ వ్యవహారం ఎక్కడకు చేరుతుందో చూడాల్సిందే. జిల్లా పార్టీ పెద్దలు, అధిష్టానం ఈ విషయంలో చర్యలు తీసుకుంటే మంచిదని కార్యకర్తలు అంటున్నారు.

Related Posts