నల్గొండ, ఆగస్టు 4,
రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు అరికట్టేందుకు సైబర్ క్రైం అధికారులు నిరంతరం శ్రమిస్తున్నా అదే స్థాయిలో నేరగాళ్లు సరికొత్త మార్గాలలో సైలెంట్‌గా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక నేరాలపై సిసిఎస్, సైబర్ క్రైం, నేర విభాగం, టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఒటి పోలీసులు నేర నియంత్రణ, నేర పరిశోధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నప్పటికీ నేరగాళ్లు ఏమా త్రం తమ మోసాలను యదేశ్ఛగా సాగిస్తున్నారు. రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్న నేరాలను నియంత్రించడంలో క్రైం విభాగం విఫమౌతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఆర్థిక నేరాల కేసులలో సిసిఎస్, సైబర్ క్రైం, నేర విభాగం, , టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఒటిలు నేరాలకు అడ్డుకట్టవేయకపోవడంతో సైబర్ నేరగాళ్లు సైలెంట్‌గా నేరాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో పల్స్ ఆక్సీమీటర్, కెవైసి,బ్యాంక్ రుణాలు, ఇసిమ్ పేరిట ప్రజలను మోసగిస్తున్నారు.పల్స్ ఆక్సీమీటర్‌పేరుతో సైబర్ నేరగాళ్లు దందాకు తెరతేశారు. కరోనా పరిస్థితులను కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. శరీరంలో ఆక్సిజన్‌స్థాయితో కరోనా ప్రభావాన్ని గుర్తించే వీలుండటంతో తాజాగా అందరి దృష్టి ఆక్సీమీటర్లపై పడింది. మార్కెట్‌లో కంపెనీని బట్టి గరిష్ఠంగా రూ.1,500 వరకు పల్స్ ఆక్సీమీటర్లు లభ్యమౌతున్నాయి. అయితే వీటిని అంత పెద్ద మొత్తాలు వెచ్చించి కొనలేని వారు సెల్‌ఫోన్‌లో యాప్‌డౌన్‌లోడ్ చేసుకుంటే ఆక్సీమీటర్ తరహాలోనే శరీరంలో ఆక్సిజన్‌స్థాయి తెలుసుకోవచ్చంటూ కేటుగాళ్లు గాలం వేస్తున్నారు. పొరపాటున యాప్‌డౌన్‌లోడ్‌చేస్తే మొబైల్‌ఫోన్‌లో ఉన్న మొత్తం సమాచారం తస్కరించడంతోపాటు బ్యాంకు ఖాతాలోని మొత్తాలను ఖాళీ చేస్తున్నారు. ఆక్సీమీటర్‌పేరుతో వచ్చే యాప్‌లు పూర్తి అబద్ధమని సైబర్ క్రైం పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. యాప్‌డౌన్‌లోడ్‌చేసే సమయంలో కెమెరా ముందు చూపుడు వేలు ఉంచాలని తద్వారా శరీరంలో ఆక్సిజన్‌స్థాయిని తెలుసుకునేందుకు వీలుంటుందని సైబర్‌నేరగాళ్లు సూచిస్తారని అలా చేయడం వల్ల వేలి ముద్ర స్కాన్‌చేసి మోసాలకు పాల్పడొచ్చని సైబర్‌నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు.ఇటీవల కాలంలో హైదరాబాద్ మదీనా కాలనీకి చెందిన అబ్దుల్ ఖదీర్ ఖాన్‌కు ఐసిఐసిఐ బ్యాంకు పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. కెవైసి వివరాలు అప్‌డేట్ చేయాలంటూ ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్నారు. అప్‌డేట్ చేసేప్పుడు ఒటిపిలు వస్తాయని ఈక్రమంలో ఒటిపి నంబర్ చెప్తేనే కెవిసి అప్‌డేట్ అవుతుందని నమ్మబలికారు. ఈ విధంగా ఒటిపి నంబర్ తీసుకొని 0 ఖాతా నుంచి రూ. 78 వేలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఇలాగే నగరానికి చెందిన మరో మహిళకు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు పేటిఎం, కెవైసి అప్ డేట్ పేరుతో వివరాలు సేకరించి రూ. 57వేలు స్వాహా చేశారు. వీరిద్దరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బ్యాంక్ లోన్‌కావాలా అంటూ ఫోన్ కాల్ చేస్తూ మెల్లగా మాటలు కలపడం, వారికి బ్యాంక్ రుణం అవసరం లేకున్నా వారిని మొహమాటపెట్టి పెద్ద మొత్తంలో బ్యాంక్‌లోన్ మంజూరు చేయిస్తున్నారు. ఆ డబ్బులు అసలు ఖాతాదారుడికి కాకుండా మరొకరి ఖాతాలో జమ చేయిస్తారు. గుట్టుచప్పుడు కాకుండా ఖాతాదారుడికి తెలియకుండానే దోచేసుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి కేసు ఒకటి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది. చిక్కడపల్లికి చెందిన సంగీతకు యాక్సిస్‌బ్యాంక్‌నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ కాల్ వచ్చింది. మీకు తక్కువ వడ్డీతో ఎక్కువ సొమ్ము జమ చేస్తామంటూ మాటల్లోకి దింపారు. తనకు లోన్ అవసరం లేదన్న వినకుండా లోన్‌తీసుకోవాల్సిందేనని పట్టుబట్టి రూ.4.70 లక్షలు మంజూరు చేయించారు. ఆ మొత్తాన్ని సంగీత ఖాతాలో జమ చేయించారు.మీ ఖాతాలో ఇంత డబ్బు జమ అయిందని సంగీత ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌వచ్చిన కొద్ది క్షణాల్లో ఆమె ఖాతాలోంచి రూ.5లక్షలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే బాధితురాలు బ్యాంక్‌సిబ్బందిని సంప్రదించింది. అయితే, వారు ఖాతాలో డబ్బు జమ అయిన వెంటనే విత్‌డ్రా కూడా అయ్యాయని స్పష్టం చేశారు. తనకు తెలియకుండానే మోసపోయాయని తెలుసుకొని సంగీత హైదరాబాద్‌సైబర్‌పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకుల పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్న తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు.ఇ-సిమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు నయా దందాకు తెర తీశారు. సిమ్ కార్డు అప్‌డేట్ పేరుతో అమాయకులను నిండా ముంచేస్తున్నారు. 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. రిజిస్ట్రేషన్, ఇ మెయిల్, అప్ డేట్ అంటూ అమాయక ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఇటువంటి కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇ- సిమ్ కార్డ్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గం ఎంచుకున్నారు. సిమ్ కార్డ్ అప్ డేట్ అంటూ ఫోన్ చేస్తారు. సిమ్ కార్డు బ్లాక్ అవుతుంద్ని మెసేజ్ పెడుతుండటంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. మెసేజ్‌లో వచ్చిన నెంబర్లకు ఫోన్ చేస్తున్నారు. సిమ్ బ్లాక్ కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌కేవైసీ నింపాలని కేటుగాళ్లు చెబుతుండగా, తెలియక అమాయకంగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి పంపిస్తున్నారు. దీనిద్వారా వినియోగదారుల ఫోన్ నెంబర్లు హ్యాక్ చేసి, బ్యాంకులో ఉన్న నగదును లూటీ చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఫోన్ చేసే అడిగే ఎవ్వరికీ వివరాలు చెప్పొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.