రాజుల వైపు...బీజేపీ చూపు
విజయనగరం,
ఏపీలో బీజేపీ బలపడాలంటే ఎక్కడ నుంచో అది రాదు, ఉన్న పార్టీలలోని వారినే తమ వైపు తిప్పుకోవాలి. నాలుగేళ్ల కాలం అంటే ఏమీ ఎక్కువ కూడా కాదు, చూస్తూండగానే 2024 ఎన్నికలు తోసుకువచ్చేస్తాయి. అందువల్ల రెడీ మేడ్ నాయకులే బీజేపీకి కూడా దిక్కు అవుతారని అంటున్నారు. బీజేపీ సైతం మడికట్టుకుని కూర్చోవడంలేదు. ఎవరి వచ్చిన రెడ్ కార్పెట్ పరచి చేర్చుకుంటోంది. ఫుల్ ఖాళీగా ఉన్న పొలిటికల్ హాల్లోకి ఎంత మంది వచ్చినా పుష్పక విమానమే అవుతుంది తప్ప రాజకీయ పొరాటాలు ఏవీ లేని హాయి బీజేపీది. ఇక బీజేపీ చూపు కచ్చితంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఉందని అంటున్నారు. ఇక్కడ బలంగా ఉన్న పలు సామాజిక వర్గ నేతలకు గేలం వేయడం ఖాయమని కూడా చెబుతున్నారు.రాజకీయాల్లో ఎవరూ పవిత్రులూ పతివ్రతలూ కారు. అవకాశాల కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం చేసిన వారే. అలా చూసుకుంటే ఒకనాడు రెవిన్యూ శాఖ లాంటి అత్యంత ముఖ్య శాఖలను నిర్వహించిన ధర్మాన ప్రసాదరావుకు వైసీపీలో వట్టి ఎమ్మెల్యే హోదా మాత్రమే ఉంది. ఆయన అన్న కృష్ణదాస్ కి ఇపుడు రెవిన్యూ శాఖ దక్కింది. దీంతో పాటు ఉపముఖ్యమంత్రిని కూడా చేశారు. అంటే ఆయనకు అయిదేళ్ల మంత్రి పదవి గ్యారంటీ. దాంతో షష్టి పూర్తి దాటిన బ్యాచ్ లీడర్ గా ఉన్న ధర్మాన ప్రసాదరావు చూపు బీజేపీ మీద ఉంది అంటున్నారు. వైసీపీలో మళ్ళీ టికెట్ వస్తుందని గ్యారంటీ లేదు, వచ్చినా వైసీపీ గెలిచినా మంత్రి పదవి అంతకంటే గ్యారంటీ లేదు, మరి భవిష్యత్తు నాలుగేళ్ళ ముందే తేలిపోయిన ధర్మాన లాంటి వారే ఇపుడు బీజేపీ టార్గెట్ అంటున్నారు.ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే పూసపాటి రాజులతో సమానంగా బొబ్బిలి రాజులు కూడా జన నేతలుగా ఉన్నారు. మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలై సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన ఓసీ వెలమ సామాజికవర్గం నేత. పైగా ఆయన సమీప బంధువు కడపకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బీజేపీలో ఉన్నారు. దాంతో ఆయన చూపు కూడా బీజేపీ మీద ఉండొచ్చు అంటున్నారు. బొబ్బిలి రాజులు కాషాయం కడితే కత్తి పడితే విజయనగరం జిల్లాలో బీజేపీకి మంచి ఊపు వస్తుందని అంటున్నారు. ఇదే జిల్లాలో వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలకు కూడా బీజేపీ గేలం వేస్తే మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు ఫ్యామిలీ జంప్ అయినా ఆశ్చర్యం లేదు. అలాగే మరో మాజీ మంత్రి, టీడీపీ నేత పతివాడ నారాయణస్వామి కుటుంబానికి కొత్త రాజకీయం కావాలంటే కమలం వైపే నడవాలి అంటున్నారు.ఇక టీడీపీ, వైసీపీ, మళ్ళీ వైసీపీ ఇలా రాజకీయంగా అటూ ఇటూ అడుగులు వేసినా కూడా పదవి దక్కక పదేళ్ళుగా పరితపించిపోతున్న మాజీ మంత్రి, విశాఖ జిల్లాకు చెందిన దాడి వీరభద్రరావు లాంటి వారు తప్పకుండా బీజేపీ టార్గెట్ అవుతారని అంటున్నారు. బలమైన బీసీ గవర సమాజిక వర్గానికి చెందిన దాడికి రూరల్ జిల్లాలో కొంత పట్టుంది. అదే విధంగా టీడీపీకి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు నాలుగేళ్ల పాటు పసుపు నీడలో ఉన్నా చివరి నిముషంలో అప్పటి పరిస్థితుల బట్టి బీజేపీ వైపు చూసినా ఆశ్చర్యంలేదని వినిపిస్తున్న మాట. ఇక వైసీపీలో టికెట్లు రాని వారు, ఆశావహులు వచ్చే ఎన్నికల నాటికి ఎటూ బీజేపీ నే ఆప్షన్ చేసుకుంటారు. మొత్తానికి చిట్టా తీస్తే బడా నేతల నుంచి చాలా మంది మీదనే బీజేపీ కన్ను ఉందని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ తనను తాను జనంలో కొంత నిరూపించుకుంటే, ఊపు ఉందనుకుంటే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని అంటున్నారు.