YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీఆర్ఎస్ లో ఆ కుర్చీ ఎవరికి..?

టీఆర్ఎస్ లో ఆ కుర్చీ ఎవరికి..?

 హైదరాబాద్, ఏప్రిల్ 14  (న్యూస్ పల్స్): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవిని కేసీఆర్‌ ఎవరికి కట్టబెట్టబోతున్నారు? ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్‌ ఎందుకు దృష్టి మళ్లించారు? త్వరలో జరగబోయే పార్టీ ప్లీనరీలో గులాబీబాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
 తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావం నుంచి నేటివరకు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ వ్యవహరిస్తూ వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత పూర్తిగా పాలనపైనే ఆయన దృష్టి కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలపై ఆయన పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోయారన్న మాట తెరాస వర్గాల్లోనే వినిపిస్తోంది. పార్టీ కమిటీలు వేయడంలోనూ కాస్త ఆలస్యమే జరిగింది. ఈ తరుణంలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉండాలని టీఆర్‌ఎస్‌లో కొందరు సీనియర్లు చాలా కాలం నుంచి కోరుతున్నారు. పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య సమన్వయం కుదర్చగల సామర్ధ్యం ఉన్న వ్యక్తిని ఈ పదవిలో నియమించాలని వారు సూచిస్తున్నారు.
> ఇదిలా ఉంటే, తాజాగా టీఆర్‌ఎస్‌లో కొత్త చర్చ మొదలైంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని మంత్రి కేటీఆర్‌కి కట్టబెడితే బాగుంటుందని కొందరు అంటున్నారు. ఆయన అయితేనే కేసీఆర్‌కీ, పార్టీలోని మిగతా నేతలకు మధ్య వారధిలా వ్యవహరించగలరని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే మంత్రి కేటీఆర్‌ని వర్కింగ్ ప్రెసిడెంట్ పీఠంపై కూర్చోబెట్టాలని వత్తిడి తెస్తున్నారు. ఎంతో కాలం నుంచి ఈ చర్చ సాగుతున్నా.. గత రెండేళ్లుగా ఈ అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతుంది. 2016లో, 2017లో జరిగిన పార్టీ ప్లీనరీల్లోనే కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటిస్తారని ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారం కార్యరూపం దాల్చలేదు.
> ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీనికి తోడు గులాబీబాస్ కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. దీంతో పార్టీ కోసం తగినంత సమయాన్ని కేసీఆర్ వెచ్చించడం కష్టమనే వాదన పార్టీలో వినిపిస్తోంది. పార్టీలో పరిస్థితులను కేసీఆర్‌కు చేరవేయాలన్నా.. అది నేతలకు సాధ్యం కావడం లేదు. దీంతో గత కొంతకాలంగా ఈ గ్యాప్‌ను మంత్రి కేటీఆర్ పూరిస్తూ వస్తున్నారు. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి నేతలు కేటీఆర్‌కే రిపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు జాతీయ రాజకీయాలపై కేసీఆర్ అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పనుల్లో బీజీగా ఉంటున్నారు. దీంతో జిల్లా పర్యటనలు వాయిదా పడుతున్నాయి.
  రాష్ట్రంలో ఒకొకవైపు కాంగ్రెస్‌పార్టీ బస్సుయాత్రతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. సీఎం కేసీఆర్ పాలనాపరమైన విషయాల్లో తలమున్కలై ఉంటున్నారు. దీంతో స్వయంగా కేటీఆర్ రంగంలో దిగారు. జిల్లాలవారీగా ప్రగతిసభలు ఏర్పాటుచేసి పార్టీ క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పార్టీపై పట్టు పెంచుకోవడం కోసమే ప్రగతిసభల పేరిట ఆయన జిల్లాలను చుట్టేస్తున్నారనే చర్చ కూడ సాగుతోంది. ఈనెల 27న జరగనున్న పార్టీ ప్లీనరీలోనే కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారన్న అంచనాలు కూడా పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ఇంతకు ముందు ప్లీనరీల్లో ఇలాంటి అంచనాలే ఉన్నప్పటికీ నియామకం మాత్రం జరగలేదు. ఈసారి అయినా ఈ అంచనా నిజమవుతుంతో లేదోనని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.

Related Posts