మూడో ముచ్చట..ఎందాకా
విజయవాడ,
ఏపీలో మూడవ ప్రత్యామ్నాయం ప్రయత్నాలు ఎపుడూ సాకారం అయినది లేదు. ఇది నాలుగు దశాబ్దాలుగా సాగుతున్నదే. ఉమ్మడి ఏపీ ఎర్పాటు అయ్యాక మొదట రెండున్నర దశాబ్దాలు కాంగ్రెస్ ఏకపక్షంగా ఏలింది. తరువాత తెలుగుదేశం వచ్చి గట్టి రెండవ పక్షంగా నిలిచించి. ఆ రెండు పార్టీల మధ్యనే అధికారం బదలాయింపు అలా దశాబ్దాలుగా జరుగుతూ వచ్చేది. ఇక తెలంగాణాలో టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత పరిణామాల నేపధ్యంలో ఏకంగా ఏపీ రెండుగా చీలింది. అక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇక్కడ తెలుగుదేశం, వైసీపీ వరసగా పీఠమెక్కాయి. సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెండవ పార్టీగా బలంగా ఒకటే కనిపిస్తూ వస్తోంది. మూడు ముచ్చట మాత్రం తీరటంలేదు. అది వట్టి రాజకీయ ఆరాటమే అవుతోంది.ఇపుడు ఏపీలో మూడు కు మళ్ళీ మంచి మూడ్ వస్తోంది. దానికి కారణం బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులు కావడమే. ఆయన వచ్చేశారు, ఇక ఏపీలో 2024లో అధికారం మాదేనని కమలనాధులు జబ్బలు చరుస్తున్నారు. జనసేనతో కలిపి వచ్చేది మేమే అని కూడా అంటున్నారు. అయితే సోము వీర్రాజు ట్రాక్ రికార్డు తీసుకుంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేసి గెలవలేదు. ఆయన చాలా సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేఆ పోటీ చేశారు కానీ ఓటమి పాలు అయ్యారు. ఇపుడు మాత్రం ఆయన టీడీపీ దయతో ఎమ్మెల్సీగా నామినేటెడ్ పదవిలో కుదురుకున్నారు.ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ తీరు చూసినా అంతే. ఆయన 2019 ఎన్నికల్లో రెండు సీట్లలో పోటీ చేసినా ఒక్కటి కూడా గెలవలేకపోయారు. ఆయన కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రాజకీయంగా ప్రత్యర్ధులు ఇదే విషయాన్ని ఇపుడు గట్టిగా ఏకుతున్నారు. వార్డు మెంబర్ గా సొంతంగా గెలవలేని ఈ ఇద్దరు నాయకులూ కలసి ఏపీలో మూడవ ప్రత్యామ్నాయం ఎలా నిర్మిస్తారని అంటున్నారు. ముందు వారి సీట్లు వారు గెలుచుకుంటే అంతకు మించిన ఘనత వేరేదీ ఉండబోదని కూడా అంటున్నారు. ఇక ఈ రెండు పార్టీల బలాబలాలను తీసుకుంటే సొంతంగా పోటీ చేసినా ప్రతీ సారి బీజేపీకి అన్ని చోట్లా డిపాజిట్లు పోయి ఒకటి రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. పవన్ పార్టీకి అంత సినీ గ్లామర్ ఉన్నా కూడా తొలి ఎన్నికల్లోనే ఏడు శాతం ఓట్లు మించలేదు.నిజానికి ఏ నాయకుడు కూడా మీడియా ప్రభావానికి లోను అయితేనే పతనం కోరి తెచ్చుకుంటాడు. వాస్తవానికి ఏపీలో బీజేపీ పరిస్థితికి కాంగ్రెస్ కి పెద్దగా తేడా లేదు, ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కి కేంద్రంలో మళ్ళీ ఊపిరి వస్తే ఏపీలో కూడా పుంజుకునే చాన్స్ ఉందేమో. ఆ పార్టీకి కొన్ని సెక్షన్లలో ఇంకా అభిమానం ఉంది. బీజేపీది లక్ష్యం లేని ప్రయాణం అని కూడా అంటున్నారు. మీడియా బేబీలుగా మారి మేమే వచ్చేస్తాం, గెలిచేస్తామని బీజేపీ, జనసేన మురిసిపోతే దారుణమైన ఫలితాలే వస్తాయని అంటున్నారు. ఇక పవన్ అయినా, సోము వీర్రాజు అయినా ముందు తమకంటూ సొంత సీట్లు చూసుకుని గెలుపు దారికి ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటే కూటమికి కొంత ధైర్యం వస్తుందని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఇద్దరు నేతల కంటే కన్నా లక్ష్మీనారాయణ చాలా బెటర్ అంటున్నారు. ఆయన పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలక మంత్రిత్వ శాఖలు చూశారు. ఆయనను కాదని చేసిన ఈ ప్రయోగం బీజేపీకి ఎలా ఉపయోపడుతుందో చూడాలని అంటున్నారు.