విశాఖ టీడీపీలో రాజధాని రచ్చ
విశాఖపట్టణం,
మూడు రాజధానుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ రగడకు కారణం కాగా తెలుగుదేశం పార్టీలోనూ అంతర్గత పోరుకు కారణమవుతోంది. ముఖ్యంగా విశాఖపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ లైన్ దాటుతున్నారు.
ఒకవైపు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని, మూడు రాజధానులను ఒప్పుకునే సమస్యే లేదని చంద్రబాబు నాయుడు అంటుండగా విశాఖపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ విశాఖను పాలనా రాజధాని చేయడాన్ని స్వాగతిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలోనూ విబేధాలకు కారణమవుతోంది.
ప్రభుత్వం మూడు రాజధానులు అని చెబుతున్నా అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తున్నారనే భావననే అందరిలోనూ ఉంది. అమరావతికి పెట్టాల్సిన ఖర్చులో 10 శాతం పెడితే విశాఖపట్నం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీ పడుతుందని ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలు పదేపదే చెబుతున్నారు. అంటే, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచనతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక, మూడు రాజధానుల విషయానికి వచ్చినా పాలన ఎక్కడి నుంచి కొనసాగుతుందో అదే కీలకం అవుతుంది.
విశాఖను పాలనా రాజధానిగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుంది. ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలకు అమరావతి వేదిక అవుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్ భవన్, సచివాలయం వంటి కీలక వ్యవస్థలు మొత్తం విశాఖపట్నానికి వెళ్లనున్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో మెట్రో వంటి ప్రతిష్ఠాత్మక సదుపాయల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అమరావతికి బదులు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఆలోచన స్పష్టమవుతోంది.జనవరిలో మూడు రాజధానుల ప్రకటనను ముఖ్యమంత్రి జగన్ చేయగానే విశాఖపట్నం టీడీపీలో భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. మొదట విశాఖపట్నం నగరంలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలు జగన్ నిర్ణయాన్ని సమర్థించాయి.
అయితే, చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో వీరంతా తటస్థంగా ఉండిపోయారు. దీంతో విశాఖపట్నం ప్రజల్లోనూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే విశాఖను రాజధానిని చేయడానికి సహకరించడం లేదనే భావన వస్తోంది. తమ పార్టీకి పట్టున్న నగరంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఎలా అని భవిష్యత్‌పై విశాఖ టీడీపీ నేతల్లో బెంగ మొదలైంది.ఇప్పుడు గవర్నర్ మూడు రాజధానుల బిల్లును ఆమోదించగానే విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ బాహాటంగానే గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించారు. పార్టీ ఈ విషయంపై వ్యతిరేకంగా ఉన్నా ఆయన మాత్రం సానుకూలంగా స్పందించారు. మిగతా ముగ్గురు నగర ఎమ్మెల్యేలు ఈ విషయంలో పెదవి విప్పడం లేదు. పార్టీ లైన్ ప్రకారం మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడితే విశాఖ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. విశాఖను పాలనా రాజధానిని చేయడాన్ని సమర్థిస్తే చంద్రబాబుకు కోపం వస్తుంది.ఈ నేపథ్యంలో వారు సైలెంట్‌గా ఉండడమే మంచిదనే భావనలో ఉన్నారు. అయితే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం విశాఖను పాలనా రాజధానిని చేయడాన్ని ముందు నుంచీ సమర్థిస్తున్నారు.ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచనతో ఉండగా రాజధానుల వ్యవహారం తెరపైకి వచ్చింది. విశాఖను పాలనా రాజధాని కాకుండా వ్యతిరేకిస్తున్న టీడీపీ వైఖరిని విభేదిస్తున్నారు.