కాకినాడ, ఆగస్టు 6,
డీపీలో రాజకీయ దురంధరుడుగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి ఫ్యూచర్‌పై బెంగ పట్టుకుందా ? ఆయన రాజకీయంగా సతమతం అవుతున్నారా ? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క టీడీపీ నేత సైతం ముక్తకంఠంతో అంగీకరిస్తోన్న పరిస్థితి. టీడీపీలో పార్టీ పెట్టిన నాటి నుంచి చక్రం తిప్పిన యనమల రామకృష్ణుడు తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన చరిత్రను సొంతం చేసుకున్నారు. అన్నగారి హయాంలోను తర్వాత చంద్రబాబు హయాంలోనూ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఎన్టీఆర్ ఉన్నసమయంలోనే స్పీకర్‌గా పగ్గాలు చేపట్టిన యనమల.. పార్టీలో తలెత్తిన సంక్షోభం సమయంలో పూర్తిగా ఆయన చంద్రబాబుకు దన్నుగా నిలిచారు.దీంతో చంద్రబాబు యనమల రామకృష్ణుడుకు బాగా ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఆర్థిక మంత్రి అయ్యారు. 2004 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా తునిలో వరుసగా ఆరోసారి గెలిచిన యనమల రామకృష్ణుడు డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. 2009 ఎన్నికల్లో తునిలో ఓటమితో అక్కడ ఆయన ప్రస్థానం మసకభారడం ప్రారంభమైంది. తుని నుంచి ఓడిపోయిన సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. తర్వాత కూడా గత ప్రభుత్వంలోనూ మంత్రిని చేశారు. కీలకమైన ఆర్ధిక శాఖను అప్పగించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆర్ధిక మంత్రిగా బాబు హయాంలో చక్రం తిప్పారు. అయితే, ఆయన ఇప్పుడు భవిష్యత్తుపై బెంగపెట్టుకున్నారనే వాదన వినిపిస్తోంది.బీసీ నేతగా ఎదిగిన యనమల రామకృష్ణుడు పార్టీని డెవలప్ చేయడం కంటే.. తన కెరీర్‌ను డెవలప్ చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఇప్పటికి మూడు సార్లుగా తునిలో ఓటమి పాలవుతూనే ఉంది యనమల కుటుంబం. ఆయన సోదరుడు కృష్ణుడు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కలేక పోతున్నారు. పోనీ యనమలకన్నా ధీటైన నాయకుడు తునిలో లేరా ? అంటే.. యనమల కుటుంబం ఇక్కడ ఎవరినీ ఎదగనివ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో సైలెంట్‌గా పావులు కదుపుతూ.. ఎవరినీ ఎదగనివ్వకుండా చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇక, ఇప్పుడు శాసన మండలిలో పార్టీ తరఫున యనమల రామకృష్ణుడు చక్రం తిప్పుతున్నారు. దీనిని రద్దు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించుకుని కేంద్రానికి తీర్మానం పంపింది. దీనిపై నిర్ణయం జరిగి.. మండలి రద్దయితే.. యనమల పదవి పోతుంది. లేదంటే.. వచ్చే ఏడాదిన్నరలో అయినా.. యనమల పదవీ కాలం పూర్తయ్యాక అయినా.. ఆయన పదవి నుంచిపక్కకు తప్పుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలో తన ఫ్యూచర్ ఏంటి ? పార్టీ పరిస్థితి చూస్తే.. అది పుంజుకునేలా కనిపించడం లేదు. పోనీ.. వచ్చే ఎన్నికల్లో తుని నుంచి పోటీ చేసినా.. ఇక్కడ వైఎససార్ సీపీ తరఫున విజయం సాధించిన దాడిశెట్టి రాజా బలంగా ఉన్నారు. విప్‌గా కూడా జగన్ ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు.యనమల రామకృష్ణుడు గెలుస్తారనే నమ్మకం లేదు. ఇక, కుమార్తె దివ్వ ను రాజకీయంగా ప్రమోట్ చేసుకుందామనుకున్నా.. గత ఎన్నికల్లో చంద్రబాబు సహకరించలేదనే ఆవేదన ఉంది. అప్పట్లోనే ఆమె కోసం కాకినాడ రూరల్ టికెట్ కోసం పట్టుబట్టారు. అయితే, బాబు పట్టించుకోలేదు. పోనీ.. రాజానగరం అయినా ఇవ్వమని కోరారు. అయినా బాబు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఇలా యనమల రామకృష్ణుడు కుటుంబానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. కనుచూపు మేరలో ఆయనకు రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.