YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సుజనాపై కారాలు..మిరియాలు

సుజనాపై  కారాలు..మిరియాలు

విజయవాడ, ఆగస్టు 6, 
సుజనాచౌదరి. టీడీపీ పెట్టినపుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. ఎన్టీయార్ జమానా తరువాత చంద్రబాబు రాజ్యం వచ్చింది. అపుడు సుజనా చౌదరి బాబు సన్నిహితుడిగా కనిపించేవారు. ఆయన వ్యాపార లావాదేవీల కోసం టీడీపీతో సఖ్యత నెరిపేవారు అంటారు. టీడీపీ 2004 ఎన్నికల్లో ఓడినపుడు ఆర్ధికపరమైన అండ కోసం సుజానా చౌదరి లాంటి అవసరం పడిందని అంటారు. అలా 2009 ఎన్నికల నాటికి టీడీపీకి 92 ఎమ్మెల్యే సీట్లు వస్తే పార్టీకి తాను చేసిన సేవలకు కొలమానంగా 2010లో సుజనా చౌదరి రాజ్యసభ సీటు కోరడం, చంద్రబాబు ఓకే చెప్పి మరీ ఆయన్ని పెద్దల సభకు పంపడం చకచకా జరిగిపోయాయి.ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవడానికి మోడీ ఎంచుకున్నది విజయనగరానికి చెందిన పెద్ద మనిషి, నిజాయతీపరుడు అయిన పూసపాటి అశోక్ గజపతిరాజుని అని చెబుతారు. ఆ తరువాత విస్తరణలో బాబు పట్టు బట్టి మరీ సుజనాచౌదరిని కేంద్ర సహాయ మంత్రిగా చేశారు. ఇక సుజనా చౌదరి బాబుల బంధం అంత గట్టిదని అందరికీ తెలిసాక కూడా ఆయన బాబు వద్ద ఉండకుండా 2019 ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు, ఎవరి పంపున వెళ్లారు అన్నది కూడా లోక విధితమే.ఇపుడు బీజేపీలో ఎవరు తమవారు, ఎవరు పరవారు అన్న అన్వేషణ మొదలైంది. బహిరంగ రహస్యంగా ఉన్న సుజనా చౌదరి వ్యవహారంపైన బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు గుర్రు మీద ఉన్నారని అంటున్నారు. రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర పరిధిలోకి రాదు అని ఏకంగా బీజేపీ ప్రెసిడెంట్ అంటే కాదని ఖండించిన తరువాత సుజనా చౌదరికి బీజేపీలో నీళ్లు దొరుకుతాయా అన్నదే ఇపుడు చర్చ. సుజనా చౌదరి ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు బీజేపీకి వెళ్లారో తెల్సిన వారు కాషాయదళంలో ఉన్నారు. వారు ఇపుడు కత్తులు నూరుతున్నారు. మరి సుజనా చౌదరికి బీజేపీలో ప్లేస్ ఏంటి అంటే మామూలు ఎంపీ మాత్రమేనట. అది కూడా నోరు మెదపకుండా ఉండాలిట. ఇక సుజనా చౌదరి రాజధాని విషయంలో పదే పదే చేస్తున్న వివాదాస్పద ప్రకటనల మీద షోకాజ్ నోటీసు అడగాలని కూడా పార్టీ ఆలోచిస్తోందని కూడా ఢిల్లీ వర్గాల‌ కధనం.సుజనా చౌదరి 2016లో రెండవ సారి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆయన సభ్యత్వం 2022లో ముగుస్తుంది. గట్టిగా మాట్లాడుకుంటే ఏణ్ణర్ధం కాలం. ఇట్టే గిర్రున తిరిగిపోతుంది. ఈలోగా సుజనా చౌదరిని ఎంత కంట్రోల్ చేయాలో అంతగా చేసేందుకు బీజేపీలో స్కీం రెడీ అవుతోందిట. ఆ మీదట ఆయన మాజీ ఎంపీగా బయటకు రావడమే మిగిలిందని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు బ్రహ్మాస్రాన్ని తుత్తునియలు చేయడానికి అవసరమైన కసరత్తు అంతా బీజేపీలో తెర వెనక జోరుగా సాగుతోందని అంటున్నారు. సుజనా ఆయుధం ఇపుడు వ్యర్ధం కావడం అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు నిద్రపట్టని రాత్రులనే మిగులుస్తాయనడంలో సందేహమే లేదుగా.

Related Posts