కాకినాడ, ఆగస్టు 6
రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వంపై ఒంటికాలిపై విరుచుకుపడు తున్న మాజీ ఎంపీ సబ్బంహరి చూపు ఇప్పుడు ఢిల్లీపై పడిందని అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్‌లో రాజకీయాల్లోకి వచ్చిన సబ్బంహరి వైఎస్ రాజశేఖరరెడ్డితో పరిచయం పెంచుకున్నారు. ఆయనతో సఖ్యతతో మెలిగారు. ఈ క్రమంలోనే వైజాగ్ నగర మేయర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనూ కూడా గుర్తింపు సాధించుకున్నారు. మంచి వాగ్దాటి ఉన్న హరిని ఢిల్లీకి పంపాలని డిసైడ్ అయిన వైఎస్ 2009లో అనకాపల్లి ఎంపీ సీటు ఇప్పించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగా విజయం సాధించారు.
ఆ తర్వాత వైఎస్ మరణాంతరం సబ్బం హరి జగన్‌కు అనుకూలంగా మీడియాలో తన బలమైన వాయిస్ వినిపించేవారు. ఈ క్రమంలోనే సబ్బంహరి నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక టైంలో 2014 ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. తర్వాత రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సబ్బంహరి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. వైసీపీలో చేరారు. జగన్ ను విభేదించి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, గత ఏడాది ఎన్నికల ముందు వరకు ఏ పార్టీలోనూ చేరని సబ్బంహరి చంద్రబాబు చెంతకు చేరిపోయారు.ఆ ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే, ఇక్కడ నుంచి పోటీచేసిన అవంతి శ్రీనివాసరావు చేతిలో ఆయన ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి పార్టీలో కార్యక్రమాలకు దూరంగా ఉన్నా.. విశ్లేషణల పేరుతో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను భీమిలి నుంచి పోటీ చేసే పరిస్థితి లేదని, ఇక్కడ అవంతి మంచి బలంగా ఉన్నాడని ఆయనకు అర్థమైంది. మరోవైపు అవంతి మంత్రిగా కూడా ఉండడంతో పాటు వచ్చే ఎన్నికల టైంకు భీమిలిలో తాను నిలదొక్కుకోవడం కష్టమని సబ్బంహరి భావించారని టాక్..?ఈ క్రమంలోనే తనకు పట్టున్న అనకాపల్లిని కేటాయించాలని సబ్బంహరి బాబుకు విజ్ఞప్తి చేస్తున్నారట. ఈ విషయాన్ని పరిశీలించిన చంద్రబాబు కూడా హరికి బలమైన నియోజకవర్గంగా ఉన్న అనకాపల్లి అయితే కరెక్ట్ అని.. ఆయన అసెంబ్లీలో ఉండడం కంటే పార్లమెంటులో ఉంటేనే బలమైన వాయిస్ ఉన్నట్లు అవుతుందని… అందుకే ఆయనకు అనకాపల్లి పగ్గాలే అప్పగించాలని చూస్తున్నారట. సబ్బంహరిని అనకాపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించే అవకాశముంది.